ఈ ఎన్నికలు రేవంత్ కు అగ్నిపరీక్ష
– బీజేపీతోనే పోటీ కాంగ్రెస్ పోటీ..
– ఆరు గ్యారంటీలపైనే కాంగ్రెస్ ఆశలు…
– కారు దిగుతున్న బీఆర్ ఎస్ నేతలు
నిర్దేశం, హైదరాబాద్ :
లోక్ సభ ఎన్నికల రిజల్ట్ సీఎం రేవంత్ రెడ్డి పాలనకు అగ్నిపరీక్షలా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలే… అయినా.. రేవంత్ ఈ లోక్ సభ ఎన్నికలను చాలేంజ్ గా తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో అన్నీతానై పని చేసినట్లుగానే లోక్ సభ ఎన్నికలలో 14 ఎంపీ సీట్లలో గెలువడానికి ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.
బీజేపీతోనే పోటీ కాంగ్రెస్ పోటీ..
అసెంబ్లీ ఎన్నికలలో త్రీముఖ పోటీ ఉండేది. చాలా చోట్ల బీఆర్ ఎస్ తో కాంగ్రెస్ పార్టీ పోటీ పడ్డది. కానీ.. ఈ లోక్ సభ ఎన్నికలలో బీజేపీతోనే నువ్వా -నేనా అనే రీతిలో పోటీ కాంగ్రెస్ పోటీ పడుతుంది. డబుల్ డిజిట్ టార్గెట్ గా బీజేపీ అడుగులు వేస్తుంటే, 14 సీట్లు గెలువాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా దూసుకు వెళుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో 13 శాతం ఓట్లు సాధించిన ఉత్సహంతో ఉన్న బీజేపీ 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. మోదీ హవాలో పది ఎంపీ సీట్లు గెలువడం ఖాయమంటున్నారు ఆ పార్టీ ముఖ్య నాయకులు.
ఆరు గ్యారంటీలపైనే ఆశలు…
లోక్ సభ ఎన్నికలలో ఆరు గ్యారంటీ పథకాలపైననే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, హెల్త్ కార్డు లిమిట్ పది లక్షలకు పెంపకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలాంటి పథకాలు అమలు చేస్తున్నందున ప్రజలు తమకే ఓటు వేస్తారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
పరువు కోసం బీఆర్ ఎస్ పాకులాట..
ఈ లోక్ సభ ఎన్నికలలో ఎంపీ సీట్లను గెలుచుకోనట్లయితే బీఆర్ ఎస్ భవిష్యత్ ప్రశ్నార్థకమే. అసెంబ్లీ ఎన్నికలలో 100 సీట్లలో గెలుస్తున్నామని తాము చేయించుకున్న సర్వేలను నమ్మిన కేసీఆర్ 39 ఎమ్మెల్యే సీట్లతో సరి పెట్టుకున్నారు. అయితే.. ఈ లోక్ సభ ఎన్నికలలో బీఆర్ ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. రెండు, మూడు ఎంపీ సీట్లు గెలిచినా పరువు కాపాడుకున్నట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కాంగ్రెస్ వైపు బీఆర్ ఎస్ నేతల చూపు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ ఎస్ ఉనికి ప్రశ్నార్థంగా మారింది. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లేకుండా చేసిన కేసీఆర్ లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే.. ఇప్పటికే బీఆర్ ఎస్ కు చెందిన ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కాంగ్రెస్ గూటికి చేరారు. సీనియర్ నాయకులు కే.కేశవరావు సముద్రల వేణుగోపాల్ చారీ లాంటి వారు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ ఎస్ నాయకులు క్యూ కడుతున్నారు.
లోక్ సభ ఎన్నికలలో పరువు కోసం బీఆర్ ఎస్ పాకులాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెఫరెండంలా మారాయి. ఇగ పోతే.. డబుల్ డిజిట్ ఎంపీలను గెలిచి తీరుతామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉన్నాయి.