Madanam Gangadhar: ఖాకీ డ్రెస్ వదిలి.. ఖద్దర్ బట్టలతో ‘‘పొలిటికల్’’ ఎంట్రీ

  • నాడు పోలీస్ ఉద్యోగం సాధించాడు..
  • పోలీసు బాస్ గా సక్సెస్ అయ్యాడు..
  • నేడు రాజ‌కీయంగా ప‌రీక్షించుకుంటున్నాడు..
  • పట్ట భద్రుల నియోజక వర్గ అభ్యర్థిగా బరిలో దిగాడు..
  • విస్తృత ప‌ర్య‌ట‌న‌లో ఉత్త‌ర తెలంగాణలో బిజీ బిజీ..
    డీఎస్పీ గంగాధ‌ర్ తో ‘‘నిర్దేశం’’ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ ( వయ్యామ్మెస్ ఉదయశ్రీ )

అతనికి పోలీస్ బాస్ గా ఎన్నో అనుభవాలు.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన అతనికి వంగీ సలాం చేస్తూ రెండు వందలకు పైగానే అవార్డులు.. రివార్డులు. అతనే డీఎస్పీ మదనం గంగాధర్.. డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల కథన రంగంలోకి దిగిన అతను ఇప్పుడు టాక్ ఆఫ్ పొలిటికల్ గా మారాడు. కరీంనగర్ పట్ట భద్రుల నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న డీఎస్పీ మధనం గంగాధర్ కరీంనగర్, నిజమాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో విసృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన ఆయనకు అంతలోనే ఎంతగానో ఆదరణ వస్తోంది. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రిటైర్డ్ అధికార్లు ఇలా ఒక్కక్కరుగా మద్దతు పెరుగుతోంది. అనతి కాలంలోనే ఇంత మద్దతు అందుకున్న నవ రాజకీయ నాయకుడు, మాజీ పోలీస్ బాస్ డీఎస్పీ మధనం గంగాధర్ ను ‘‘నిర్దేశం’’ సీనియర్ రిపోర్టర్ వయ్యామ్మెస్ ఉదయశ్రీ పలకరించింది.

ప్ర‌శ్నః ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న పోలీసుల ఉద్యోగం. హాయిగా సాగిపోయే జీవితం. 12 ఏళ్ల స‌ర్వీస్ ఉంది. అలాగే ఐపీఎస్ ఆఫీసర్ కావాల్సిన మీరు ముందుగా ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నారు?

గంగాధ‌ర్ః నేను 22 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడే ఎస్ఐ ఉద్యోగం సంపాదించాను. అందుకే నాకు ఎక్కువ కాలం స‌ర్వీస్ చేసే అవ‌కాశం ల‌భించింది. అయితే ఎంతో అట్ట‌డుగు వ‌ర్గం నుంచి వ‌చ్చిన నాకు, స‌మాజంలోని పేద‌ల ప‌రిస్థితి బాగా తెలుసు. బ‌హుశా.. అదేనేమో న‌న్ను వెన‌క నుంచి నెడుతోంది. ఇన్నేళ్ల పోలీసు ఉద్యోగం సంతృప్తినే ఇచ్చింది. అయితే, విస్తృతంగా చేయ‌డానికి ఇబ్బంది క‌లుగుతోంది. ఏదో చేయాల‌నే త‌ప‌న న‌న్ను వెంటాడుతోంది. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేశాను. చాలా మంది ప్ర‌జ‌ల‌కు ఇప్పటికీ చ‌దువు రాదు, చాలా విష‌యాలు తెలియ‌వు, యువ‌త చెడు వ్య‌స‌నాల‌కు అల‌వాటై జీవితాల‌ను పాడు చేసుకుంటున్నారు. వీట‌న్నిటికీ ప‌రిష్కారం కావాలి. దానికి నా నుంచి ఎంత జ‌రుగితే అంత చేయాల‌ని రాజ‌కీయాల్లోకి దిగాను.

ప్ర‌శ్నః ఉద్యోగంలో ఉన్న‌ప్పుడు కూడా అనేక సామాజిక కార్య‌క్ర‌మాలు చేశారు? అలా చేసుకోవ‌చ్చుగదా.. రిటైర్మెంట్ ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింది?

గంగాధ‌ర్ః నేను ఉద్యోగంలో చేరిన‌ప్ప‌టి నుంచి ఒక అజెండాతో ప‌ని చేశాను. అయితే ప్ర‌భుత్వ ఉద్యోగం ద్వారా కేవ‌లం 1% మాత్ర‌మే చేయ‌గ‌లిగాను. ఎంత ప్ర‌య‌త్నించినా కొన్ని హ‌ద్దుల వ‌ద్ద ఆగిపోవాల్సి వ‌స్తోంది. ఎలాంటి హ‌ద్దులు లేకుండా ఏదైనా చేయాలంటే ప్ర‌జాక్షేత్ర‌మే స‌రైన దారి. రాజ‌కీయం ద్వారా చాలా పెద్ద ప‌నులు జ‌రుగుతాయి. అందుకే రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నాను. దీనికి తోడు రాజ‌కీయ‌ప‌ర‌మైన అవ‌గాహ‌న యువ‌త‌లో క‌ల్పించి, రేప‌టి త‌రానికి మంచి నాయ‌కుల‌ను అందివ్వాల‌ని ఉంది. దాని కోసం కూడా ప్ర‌య‌త్నిస్తున్నాను.

 ప్ర‌శ్నః రాయ‌దుర్గం ఇష్యూ త‌ర్వాత ప్ర‌మోష‌న్ వ‌చ్చిన‌ప్ప‌టికీ కొన్ని విష‌యాల్లో మీరు అసంతృప్తితో ఉన్నార‌ని టాక్. రాజ‌కీయ ప్రమేయం లేక‌పోతే ఉద్యోగాల్లో స‌రైన గుర్తింపు ఉంద‌ని, ఇక ప్ర‌త్య‌క్ష రాజ‌కీయ పోరాట‌మే చేయాల‌ని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టు వినిపిస్తోంది. మీరేమంటారు?

గంగాధ‌ర్ః అన్ని వ్య‌వ‌స్థ‌ల్లో రాజ‌కీయం ఉంటుంది. కొంత మంది వ్య‌క్తులు చేసే రాజ‌కీయం కార‌ణంగా స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అంద‌రికీ ఇవి ఎదుర‌వుతాయి. నేను కూడా ఎదుర్కొన్నాను. 26 ఏళ్ల నా ఉద్యోగ అనుభ‌వంలో ఇది కూడా ఒక‌టి. వీట‌న్నిటి అనుభ‌వాల నుంచి నేర్చుకుని తీసుకున్న నిర్ణ‌య‌మే రాజ‌కీయాల్లోకి రావ‌డం.

ప్ర‌శ్నః 26 ఏళ్ల ఉద్యోగ జీవితంలో గంగాధ‌ర్ చాలా డబ్బులు కూడ‌గ‌ట్టార‌ని, ఇక ఎందుకు ఆయ‌న‌కు ఉద్యోగం అని కొంద‌రు అంటున్నారు. మీరేమంటారు?

గంగాధ‌ర్ః చాలా మందిపై ఇలాంటివి చాలా కామ‌న్ గా వ‌స్తుంటాయి. ప్ర‌తి దానికి స‌మాధానం ఇచ్చుకుంటూ వెళ్ల‌లేం. నేను ప‌ని చేసిన చోట ప్ర‌జ‌లు న‌న్ను ఎలా చూశారో నాకు తెలుసు. ఆ సంతృప్తి చాలు. రాజ‌కీయాల్లో కూడా ఇలాంటివి వ‌స్తుంటాయి. అప్పుడు కూడా నేనేమీ ప‌ట్టించుకోను. యువ‌త‌తో చేతులు క‌లిపి రాజ‌కీయంగా ముందుకు వెళ్ల‌డ‌మే ప్ర‌స్తుతం నాముందున్న ల‌క్ష్యం.

ప్ర‌శ్నః ప్ర‌జ‌ల విష‌యం వేరే. మీరు ప‌ని చేసిన చోట మీ కింది ఉద్యోగుల గురించి ఏమి చెబుతారు..? వారి కోసం ఏమైనా చేశారా?

గంగాధ‌ర్ః పోలీసు వ్య‌వ‌స్థ‌లో ఉన్న కొన్ని రూల్స్ కార‌ణంగా పోలీసులు ర్యాంకింగ్ సంపాదించిన త‌మ‌కు రావాల్సిన ప్ర‌మోష‌న్, ఇంక్రిమెంట్ లాంటి స‌కాలంలో రావ‌డం లేదు. దాని వ‌ల్ల చాలా నష్ట‌పోతున్నారు. ఇక‌పోతే పోలీసు వ్య‌వ‌స్థ‌ల్లో ఉన్న యూనిఫార్మ్ కార‌ణంగా.. క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న‌వాళ్లు, లేని వాళ్లు ఒకే గొడుగు కింద‌కు వ‌స్తున్నారు. ఈ రెండు మారాలి. నేను దీని మీద 2012లోనే అప్ప‌టి డీజీపీకి ప‌రిశోధ‌నా ప‌త్రం ఇచ్చాను. ప‌లుమార్లు చీఫ్ సెక్రెట‌రీ స‌హా ప్ర‌భుత్వ పెద్దల‌ను క‌లిశాను. ఇప్ప‌టికీ దీని మీద ఇంకా పోరాడుతూనే ఉన్నాను. స‌ర్వీస్ బెనిఫిట్, ఇంక్రిమెంట్ విష‌యాన్ని పోలీసు అసోసియేష‌న్ వ‌ర‌కు కూడా తీసుకెళ్లాను. ఈ రెండు జ‌రిగితే కానిస్టేబుల్స్, ఎస్సై స్థాయిలో ఉన్న‌వారు ఆర్థికంగా న‌ష్టపోకుండా ఉంటారు.

ప్ర‌శ్నః ఉద్యోగం పోయిందంటే ఆర్థిక క‌ష్టాలు పెరుగుతాయి. మ‌రి ఇంట్లో వారి ప‌ర్మిష‌న్ తీసుకునే రిటైర్మెంట్ తీసుకున్నారా? డ‌బ్బులు ఉన్నాయ‌ని వారికి ఏమైనా భ‌రోసా ఇచ్చి ఒప్పించారా?

గంగాధ‌ర్ః కుటుంబానికి రాజీనామా గురించి చెప్పాను. అప్పుడు కొంత ఇబ్బందిగా ఉన్నా ఇప్పుడు స‌పోర్ట్ చేస్తున్నారు. ఇక మ‌న‌కంటూ సేవింగ్స్ పెట్టుకుంటాం. వాటితోనే రాజ‌కీయం చేస్తున్నాను. రాజ‌కీయమంటే పూర్తిగా డ‌బ్బుతోనే న‌డ‌వ‌దు. నావ‌ద్ద ఉన్న‌వాటితో తిరుగుతున్న‌. నాకోసం స్వ‌చ్ఛందంగా ఖ‌ర్చు పెట్టి ప్ర‌చారం చేస్తున్న‌వారు చాలా మంది ఉన్నారు. మ‌న ఉద్దేశాలు బాగుంటే మ‌న‌కు అలాంటి మ‌ద్ద‌తు విప‌రీతంగా పెరుగుతుంది.

ప్ర‌శ్నః రాజీనామా గురంచి చెప్పిన‌ప్పుడు కుటుంబం ఎలా రియార్ట్ అయింది?

గంగాధ‌ర్ః కుటుంబం నుంచి మంచి మ‌ద్ద‌తే వ‌చ్చింది. ఎందుకంటే నేను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వ‌చ్చాన‌నేది వారికి బాగా తెలుసు. నా మీద వారికి పూర్తి విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు అయితే మ‌ద్ద‌తు మ‌రింత పెరిగింది.

ప్ర‌శ్నః రాజ‌కీయం అంటే చాలా డ‌బ్బు ఖ‌ర్చ‌య్యే వ్య‌వ‌హారం. మీ ద‌గ్గ‌ర అంత డ‌బ్బుందా? లేక‌పోతే ఎలా మ్యానేజ్ చేస్తారు?

గంగాధ‌ర్ః అన్నిసార్లు డ‌బ్బు ప‌ని చేయ‌దు. నేను చాలా ప్రాంతాల‌కు తిరుగుతున్నాను. నా సందేశం విన్న త‌ర్వాత నాకు ఆర్థికంగా మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ముందుకు వ‌స్తున్నారు. నా ఖ‌ర్చుల‌ను కొంద‌రు భ‌రిస్తున్నారు. ఇది నాకు రాజ‌కీయ ఇంధ‌నంగా ప‌ని చేస్తోంది. చాలా మంది కాల్స్ చేసి కూడా నాకు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. పార్టీ టికెట్, డ‌బ్బులు లేక‌పోయిన స్వతంత్రంగా గెలిచిన వాళ్లు చాలా మంది ఉన్నారు.

ప్ర‌శ్నః మీరు ఎంచుకున్న మార్గంలో స‌క్సెస్ కాక‌పోతే ఎలా?

గంగాధ‌ర్ః స‌క్సెస్ అనేది ఒక‌సారి వ‌చ్చేది కాదు, వ‌చ్చి అలాగే ఉండేది కాదు. జీవితం అంటే స‌వాళ్లు అనేకం ఉంటాయి. అందులో స‌క్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ఫెయిల్యూర్ వ‌స్తే స‌క్సెస్ అయ్యేందుకు ఇంకా ఎక్కువ ప‌ని చేస్తాను. మ‌నుషులు కూడా రెండు ర‌కాలు ఉంటారు. సంద‌ర్భం ఏదైనా నెగెటివ్ అనే వారు ఉంటారు. అలాగే పాజిటివ్ అనే వారు ఉంటారు. అయితే పేషెన్సీ అనేది చాలా ముఖ్యం. పేషెన్సీతో ఉండి ముందుకు వెళ్ల‌డం చాలా ముఖ్యం. నాకు అందులో చాలా అనుభ‌వం ఉంది.

ప్ర‌శ్నః నార్సింగిలో మీకు బ్రేక్ ప‌డ్డ‌ట్టు ఉంది?

గంగాధ‌ర్ః అది బ్రేక్ కాదు. నా లైఫ్ కు బ్రేక్ క్లియ‌ర్ అయింద‌ని నేను అనుకుంటున్నాను.

ప్ర‌శ్నః మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకోవ‌చ్చా?

గంగాధ‌ర్ః ట‌ర్నింగ్ అని ఏం కాదు. నేను బ్రేకులు లేకుండానే వెళ్లాను. నిజానికి జీవితంలో బ్రేకులు అనేవి ఉండ‌కూడ‌దు. ఏది జ‌రిగినా చాలా పేషెన్సీ ఉండాలి. క‌ళ్లు మూసుకుని హృద‌యం లేకుండా పనిచేయ‌కూడ‌దు.

ప్ర‌శ్నః రాజ‌కీయంగా మీ ల‌క్ష్యం ఏంటి?

గంగాధ‌ర్ః ఒక మంచి రాజ‌కీయ నాయ‌కుడని అనిపించుకోవాలి. యువ‌త‌ను ఈ వ్య‌వ‌స్థ‌లోకి వీలైనంత ఎక్కువ‌మందిని తీసుకు రావాలి. స‌మాజంలో మార్పుకోసం ఎంతో మందిని త‌యారు చేయాలి. ప్ర‌జ‌ల్లో చైతన్యం పెంచాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. సంద‌ర్భాన్ని బ‌ట్టి చెప్తాను.

ప్ర‌శ్నః మీకు ఏ రాజ‌కీయ పార్టీ వాళ్లు సపోర్ట్ చేస్తున్నారు?

గంగాధ‌ర్ః ప్ర‌స్తుతం ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎన్రోల్మెంట్ జ‌రుగుతోంది. అది వేల‌ను దాటి ల‌క్ష‌ల్లోకి వెళ్తోంది. దీనికి అట్రాక్ట్ అయి నాకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌వారు చాలా మంది ఉన్నారు. వారంద‌రితో క‌లిసి ఒక పార్టీ అనుకోవ‌చ్చు. మీకు బ‌య‌టికి క‌నిపించే ఏ రాజ‌కీయ పార్టీతో నాకు సంబంధం లేదు. అయితే, నా ప‌ని న‌చ్చి ఏదైనా ప్ర‌ధాన పార్టీ టికెట్ ఇస్తే ఆలోచిస్తాను.

ప్ర‌శ్నః పోలీసుగా కొంత ప్రోటోకాల్ అనుభవించి ఉంటారు. ఇప్పుడు రాజ‌కీయంగా అంద‌రితో క‌లిసి ఉండాలి. కొన్నిసార్లు వారికి ఎక్కువ గౌర‌వం ఇవ్వాలి. వాటిని ఇప్పుడు మీరు త‌ట్టుకుంటారా?

గంగాధ‌ర్ః నేను ఎక్క‌డి నుంచి ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చానో ఎప్ప‌టికీ మ‌ర్చిపోను. ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ది కూడా అందుకే. కాబ‌ట్టి, నాకు అలాంటి ఆలోచ‌న ఎప్ప‌టికీ రాదు. పొర‌పాటున కూడా మీకు ఆ ఆలోచ‌న రాకూడ‌దు.

ప్ర‌శ్నః మీ ఓట‌ర్ల‌కు మీరేం చెప్ప‌ద‌ల్చుకున్నారు?

గంగాధ‌ర్ః ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లు చాలా బ‌ల‌మైన‌వారు. వారు అంగీక‌రిస్తే వారికి ప‌ని చేసే అవ‌కాశం వ‌స్తుంది. నాకు పేద‌రికం, క్రీడారంగం, ప్ర‌జాసేవ లాంటి చాలా వాటిలో అనుభ‌వం ఉంది. క‌ష్ట‌న‌ష్టాలు నాకు బాగా తెలుసు. న‌న్ను గెలిపిస్తే ప్ర‌జ‌ల‌కు అత్యుత్త‌మ సేవ చేస్తాను. నాకు ఇప్ప‌టికే పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. అయితే, మ‌రింత మ‌ద్ద‌తు ల‌భిస్తే గెలుపు సుల‌భం అవుతుంది. నాకు ఆ అవ‌కాశం క‌ల్పిస్తార‌ని అనుకుంటున్నాను.

ముగింపు.. ప్రజల సమస్యలను పరిష్కారించి వారి హృదయాలలో చోటు కోసమే తాను పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నడీఎస్పీ గంగాధర్ కు ఆల్ ది బెస్ట్ చెబుదాం..

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!