16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధం..
ఫ్లోరిడా రాష్ట్రంలో కొత్త చట్టానికి ఆమోదం
నిర్దేశం, (అమెరికా) ఫ్లోరిడా :
సోషల్ మీడియా పిల్లల జీవితాలను తారు మారు చేస్తుంది. ఏడాది పిల్లోడు కూడా సెల్ ఫోన్ లో వీడియో చూడకుండా ఉండలేని పరిస్థితులు.. కానీ.. అమెరికాలోని ప్లోరిడా ప్రభుత్వం పిల్లల భవిష్యత్ గురించి మంచి నిర్ణయం తీసుకుంది.
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో సోషల్ మీడియా పై కొత్త చట్టాన్ని రూపొందించారు. 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు ఆ కొత్త బిల్లు ప్రకారం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లను వాడరాదు. ఆన్‌లైన్ వల్ల పిల్లల మానసిక స్థితి ప్రభావం పడకుండా ఉండేందుకు ఫ్లోరిడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
చట్టసభలో పాసైన నిషేధ చట్టం ప్రస్తుతం రిపబ్లికన్ గవర్నర్ రాన్ డీసాంటిస్ వద్దకు వెళ్లనున్నది. కొత్త బిల్లు ప్రకారం 16 ఏళ్ల లోపు పిల్లల అకౌంట్లను టర్మినేట్ చేయనున్నారు. అండర్ ఏజ్ ఉన్న పిల్లలను స్క్రీనింగ్ చేసేందుకు థార్డ్‌పార్టీ వెరిఫికేషన్ వ్యవస్థను రూపొందించనున్నారు. కొత్త బిల్లుపై తుది నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ డిసాంటిస్ వెల్లడించారు. సోషల్ మీడియాతో పిల్లలకు ప్రమాదమే ఉంటుందన్న విషయాన్ని ఏకీభవిస్తానన్నారు. కానీ పేరెంట్స్ పర్యవేక్షణలో సోషల్ మీడియాను వాడవచ్చు అన్నారు. ఫ్లోరిడా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఆ బిల్లుకు 108-7 ఓట్లు పోలయ్యాయి. సేనేట్ నుంచి కూడా ఆ బిల్లుకు ఆమోదం దక్కింది. అయితే కొందరు విమర్శకులు ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అమెరికా రాజ్యాంగంలోని తొలి సవరణను ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపించారు. అయితే ఇన్‌స్టా, ఎఫ్‌బీకి చెందిన పేరెంట్ కంపెనీ మెటా కొత్త చట్టాన్ని తప్పుపట్టింది.