డామిట్, క‌థ అడ్డం తిరిగింది

ఫిరాయింపు నేత‌లతో సంబంధం లేద‌న్న‌ట్టే మాట్లాడుతోంది. కౌశిక్ రెడ్డి, గాంధీది ఆ పార్టీ ఎమ్మెల్యేల గొడ‌వని మంత్రి శ్రీధ‌ర్ బాబు అన్నారు.

0

నిర్దేశం, హైద‌రాబాద్ః గిరీశం ఈ డైలాగ్ చెప్ప‌డంతో క‌న్యాశుల్కం నాటకం పూర్త‌వుతుంది. తెలంగాణ‌లోని రాజ‌కీయ నాట‌కం ఈ డైలాగ్ తో సెకండ్ ఇన్నింగ్స్ కి వెళ్తోంది. అదేనండి.. గులాబీ పార్టీ నుంచి హ‌స్తం పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యే ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఇలాగే ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త‌పై నాలుగు వారాల్లో నిర్ణ‌యం తీసుకోవాల‌ని స్పీక‌ర్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పుడే మొద‌టివారం పూర్తికావచ్చింది. అందుకే పార్టీ మారిన నేత‌ల్లో గుబులు మొద‌లైంది. మ‌రో మూడు వారాలు గ‌డిస్తే అన‌ర్హ‌త వేటు ప‌డ్డా ప‌డొచ్చు. అందుకే, ఫిరాయింపు నేత‌లు త‌మ అరికాలి కింద మ‌ట్టి పూర్తిగా పోక‌ముందే దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగుతున్నారు.

ఫిరాయింపు నేత‌ల ఫీట్లు

హైకోర్టు ఆదేశాల‌తో ఫిరాయింపు నేత‌లు తామింకా గులాబీ పార్టీలోనే ఉన్నామ‌ని నిరూపించే ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టారు. కౌశిక్ రెడ్డితో తొడ‌లు కొట్టిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తానింకా గులాబీ పార్టీలోనే ఉన్నానని పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు. మ‌రో ఎమ్మెల్యే దానం నాగేంద‌రేమో గులాబీ కండువా క‌ప్పుకొని మీడియా స‌మావేశాలు పెడుతున్నారు. ఇది స‌రిపోద‌న్న‌ట్లు.. ఫిరాయింపు నేత‌లతో త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్టే మాట్లాడుతోంది. కౌశిక్ రెడ్డి, అరికెపూడిగాంధీది ఆ పార్టీ ఎమ్మెల్యేల గొడ‌వని మంత్రి శ్రీధ‌ర్ బాబు అన్నారు. అంటే కాంగ్రెస్ లో చేరిన అరికెపూడిని బీఆర్ఎస్ నేత‌ని శ్రీధ‌ర్ బాబు చెప్పడం వెనుక ఫిరాయింపుల చ‌ట్టం ప్ర‌కారం ప్ర‌స్తుత‌ చేరికలు వ‌ర్కౌట్ కావ‌నే.

ఎరక్కుపోయి ఇరుక్కున్న కాంగ్రెస్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ గులాబీ కండువా క‌ప్పుతుంటే ల‌బోదిబోమ‌న్న కాంగ్రెస్ నేత‌లు.. ఇప్పుడు అదే గులాబీ నేత‌ల‌కు హ‌స్తం కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. టిట్ ఫ‌ర్ టాట్ అనుకున్నారేమో ఏమో. ఇప్ప‌టికే ప‌ది మంది ఎమ్మెల్యేల‌ను లాగారు. ఏమైందో కానీ, చేరిక‌లు అంత‌టితోనే ఆగిపోయాయి. అక్క‌డే వ‌చ్చింది చిక్కు. ఫిరాయింపు చ‌ట్టం ప్ర‌కారం ఒక పార్టీలోని వ్య‌క్తుల్లో మూడింట్లో రెండొంతులు పార్టీ మారక‌పోతే స‌ద‌రు ఎమ్మెల్యే, ఎంపీల స‌భ్య‌త్వం ర‌ద్దవుతుంది. బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేల్లో ఎంత లేద‌న్నా అటుఇటుగా 25 మంది పార్టీ మారితేకానీ ఫ‌లితం ఉండ‌దు. కానీ, ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా రాక‌పోవ‌డంతో కేసీఆర్ పై విసిరిన రాయి తిరిగి కాంగ్రెస్ నుదుటికే త‌గిలింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking