దుర్భర భారతం.. దౌర్భాగ్యపు బతుకులు

నిర్దేశం, న్యూఢిల్లీ: భారతదేశంలో పేదరికం ఒక పెద్ద రాజకీయ సమస్య. అంతకు మించి ఎన్నికల సమస్య. గరీబీ హటావో అంటూ ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న టైంలో ప్రారంభమైన ఈ పరంపరను దేశంలోని అన్ని పార్టీలు బాగానే వాడుకుంటున్నాయి. ఎన్నికల ముందు పేదరిక నిర్మూలన గురించి మైకులు పగిలిపోయే ప్రసంగాలు చేయడం, అధికారంలోకి వచ్చాక తెప్పతగలేయడం కామన్ ఇక్కడ. ఉన్నపళంగా పేదరికం పోతే.. నోటుకు అమ్ముడు పోయేది ఎవరు? కోటర్ కు ఆశపడి వచ్చేది ఎవరు? అన్నిటికీ మించి, నాయకులు చెప్పే అబద్ధాలను నమ్మేది ఎవరు? అందుకే చాలా జాగ్రత్తగా పేదరికాన్ని కాపాడుతున్నాయి మన ప్రభుత్వాలు, పార్టీలు.

మన దేశంలో పేదరికంపై తాజాగా ప్రపంచ బ్యాంకు ఓ నివేదిక బహిర్గతం చేసింది. మన దేశంలో 23.4 కోట్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారట. అత్యంత పేదలే ఇంత మంది ఉంటే.. పేదలు ఎంత మంది ఉన్నారో కదా! గత తొమ్మిదేళ్లలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ నివేదిక తెలియజేస్తోంది. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు కానీ, ఈ ప్రభుత్వాల వల్ల ఎన్నికోట్ల మంది పేదలుగా మారారనే జాబితా వస్తే కదా.. మన దేశ రాజకీయ అసలు రంగు బయటపడేది.

డేటా ప్రకారం.. మన దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరికి కనీసం తిండి దొరకడం లేదు. అత్యధికంగా పేదరికంలో మగ్గుతున్న ఐదు దేశాల్లో భారత్‌ ఒకటంటే మన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్ కంటే ముందు పాకిస్తాన్ (93 మిలియన్లు), ఇథియోపియా (86 మిలియన్లు), నైజీరియా (74 మిలియన్లు), కాంగో (66 మిలియన్లు) దేశాలు ఎక్కువ పేదరికంలో ఉన్నాయి. ఇక్కడ మరో చిత్రమైన విషయం ఏంటంటే.. ప్రపంచంలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న 110 కోట్ల మందిలో దాదాపు సగం మంది అంటే 48.1% ఈ ఐదు దేశాల్లోనే నివసిస్తున్నారు.

ప్రపంచ బ్యాంకు నివేదిక ఏం చెప్పింది?

ప్రపంచవ్యాప్తంగా పేదరికంపై ప్రపంచ బ్యాంకు కొత్త నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశంలోని 12.5 కోట్ల మంది రోజువారీ సంపాదన 2.15 డాలర్లు అంటే 182 రూపాయల కంటే తక్కువ. అయితే ఇక్కడ మరో విషయాన్ని స్పష్టం చేసింది. నిజానికి 1990లో మన దేశంలో వీరి జనాభా 43.1 కోట్లు ఉండేదట. గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ కోట్ల మంది దుర్భర జీవితంలో ఉండడం శోచనీయం. 2021కి ముందు మన దేశంలో పేదరికం పెరిగిందని ఇదే ప్రపంచ బ్యాంకు చెప్పింది. ఆ తర్వాత మళ్లీ తగ్గుదల పట్టింది.

ప్రపంచంలో పేదరికం ఎక్కడ ఎక్కువగా ఉంది?

ప్రపంచంలోని దాదాపు 70 కోట్ల మంది (8.5%) అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. ఇందుకు కరోనా కూడా ఒక కారణం. అత్యధిక పేదరికం ఆఫ్రికాలో ఉంది. ప్రపంచ జనాభాలో కేవలం 16% మంది మాత్రమే ఆఫ్రికాలో నివసిస్తున్నారు. అయితే 67% మంది పేదలు అక్కడే ఉన్నారు. యుద్ధం లేదా అశాంతి ఉన్న దేశాలను కూడా చేర్చితే, ఈ సంఖ్య మూడు వంతులు పెరుగుతుంది.

పేదరికాన్ని తగ్గించడంలో భారత్ ముందుంది

పేదరిక నిర్మూలనా చర్యలు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందగమనంలో ఉన్నాయని ఆక్షేపించింది. ఆఫ్రికా సహా పలు దేశాల్లో 2030 నాటికి దుర్భర పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించకపోతే.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టసాధ్యమని నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి ఇలానే సాగితే మరికొన్ని శతాబ్దాలు పట్టే అవకాశం ఉందని తెలిపింది. అయితే, ప్రపంచ పేదరికంలో భారత్‌ వాటా మాత్రం కొన్ని దశాబ్దాలలోనే తగ్గే అవకాశం ఉందని, దీనికి కారణం జీడీపీ వృద్ధి పెరుగుతోందని వివరించింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »