శాసనమండలిలో కవిత వర్సెస్ పొన్నం,

శాసనమండలిలో కవిత వర్సెస్ పొన్నం,

చిచ్చురేపిన తులం బంగారం

హైదరాబాద్, నిర్దేశం:

తెలంగాణ శాసన మండలిలో తులం బంగారం అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రేపింది. తెలంగాణ మహిళలను మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మహిళా వ్యతిరేక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సిఎం దురుసుగా మాట్లాడడమే కాకుండా ఈ రోజు స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయబోమని చెప్పడమేంటంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ కళ్యాణమస్తు పథకం. ఈ పథకంలో భాగంగా పెండ్లి సందర్భంగా ఆడపిల్లలకు రూ. లక్ష రూపాయల డబ్బుతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. అయితే ఎప్పుటి నుంచి మీరు చెప్పిన తులం బంగారం ఇస్తారని శాసన మండలిలో కవిత ప్రశ్నించారు. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన వివాహాలకు కూడా తులం బంగారం ఇస్తారా అని మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కవిత. కవిత ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ.. కళ్యాణమస్తు పథకాన్నిఅమలు చేసే ఆలోచన లేదని తెలిపారు. దీంతో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో జరిగిన తులం బంగారం రచ్చపై బయటకు వచ్చిన తరువాత కవిత మీడియాతో మాట్లడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలతో రెచ్చిపోయారు. కాంగ్రెస్ మెనిఫెస్టో చిత్తుకాగితమని తేలిపోయిందని, ప్రజలను, ముఖ్యంగా మహిళలను మోసం చేయడానికే ఇష్టానుసారం కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చి,ఇప్పుడు చేతులెత్తేస్తున్నారని విమర్శించారు.సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానం అని పదే పదే అన్నారు, కానీ అవన్నీ అబద్దాలేనని శాసన మండలి సాక్షిగా తేలిపోయిందాన్నరు కవిత. కళ్యాణమస్తు పథకమే కాకుండా మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న హామీ, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్న హామీలు అమలుపై అనుమానాలు నెలకొన్నాయని తెలిపారు. ప్రభుత్వ వైఖరి చూస్తే మహిళలను చిన్నచూపు చూస్తున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు తప్పకుండా బుద్దిచెబుతారని హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలో మిర్చి పంటకు రూ. 25 వేలు కనీస మద్ధతు ధర ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మిర్చి ధరలు పడిపోయి రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి నిరసనగా సహచర బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కలిసి ఎమ్మెల్సీ కవిత శాసన మండలి ఆవరణలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎండు మిర్చి దండలను మెడలో వేసుకొని ఎమ్మెల్సీలు వినూత్నంగా నిరసన తెలియజేశారు. మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. నాఫెడ్, మార్క్ ఫెడ్ వంటి సంస్థ ద్వారా ప్రభుత్వమే మిర్చి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు పంటకు కూడా రూ. 15 వేల మేర కనీస మద్ధతు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు. సుగంధ ద్రవ్యాల బోర్డు పరిధిలోకి మిర్చి పంటను కూడా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్నికోరారు కవిత.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »