తీరు మారకుంటే బీఎస్పీ ‘మాయ’మే
– కాలానికి అనుగుణంగా మార్పు చెందని పార్టీ
– ఓట్ల రాజకీయం నుంచి పూర్తిగా పలాయనం
– ఆత్మ పరిశీలన చేసుకోని మాయావతి
– తరుచూ నిర్ణయాల మార్పుతో ప్రజల్లో సడలిన నమ్మకం
బహుజన్ సమాజ్ పార్టీ.. కొన్ని వందల ఏళ్లుగా బానిసత్వం, అంటరానితంలో ఉన్న ప్రజలకు అధికారం అందించిన పార్టీ. వారి మనసులో నమ్మకాన్ని, ఆత్వవిశ్వాసాన్ని, ఆశనూ కల్పించిన పార్టీ. నిజానికి దేశ రాజకీయాల్ని బీఎస్పీకి ముందు బీఎస్పీకి తర్వాత అని చూడాలి. అప్పటి వరకు పాకిస్తాన్ పేరు చెప్పో, పేదరికం పేరు చెప్పో బండి నెట్టుకొస్తున్న రాజకీయ పార్టీలకు ఉన్నట్టుండి సామాజిక న్యాయం గుర్తుకు వచ్చింది. నిజానికి, బీఎస్పీ బలపడ్డ తర్వాతనే చాలా పార్టీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత దక్కింది. అంతకు రిజర్వుడు స్థానాల్లో నాయకులకు ప్రాధాన్యత ఉండేది కాదు. ప్రభుత్వంలో వారికి అవకాశం దక్కేదే కాదు. పచ్చిగా చెప్పాలంటే.. ఓట్లు వేసే యంత్రాలుగానే బీసీ, ఎస్సీ, ఎస్టీలను చూసేవారు. అయితే బీఎస్పీ కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు రాజకీయ అవకాశాలతో పాటు, ప్రాధాన్యతా పెరిగింది. ఎన్నికల ప్రచారంలో వారి సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి పెరిగింది. ఒక రకంగా చెప్పాంలంటే.. ఆ సమయంలో బీఎస్పీ పేరు వింటే దేశంలోని రాజకీయ పార్టీల వెన్నులో ఒణుకు పుట్టేది.
అయితే, అదంతా ఒకప్పటి ఘన చరిత్ర. ఏనుగు ఘీంకారం క్రమంగా సన్నబడింది. ప్రస్తుతం ఏనుగును ఎలుకలాగ చూస్తున్నారు. రాజకీయంగా చూసుకుంటే అలాగే కనిపిస్తోంది. 2017 లో అధికారం కోల్పోయిన నాటి నుంచి బీఎస్పీ కిందకు దిగజారుతూ పోతూనే ఉంది కానీ, ఒక్కసారంటే ఒక్కసారి ఒక మెట్టు ఎక్కింది లేదు. పరిస్థితి ఎంత దారుణానికి వెళ్లిందంటే.. యూపీలో నాలుగు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీకి.. నేడు 403 సీట్లకు గాను కేవలం ఒక్కటే ఒక్క సీటు ఉంది. ఓటు బ్యాంక్ ఇప్పటికీ కాస్త ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. అది కూడా క్రమంగా పడిపోతూనే ఉంది. గత ఎన్నికలో 9 శాతానికి పడింది. ఈసారికి ఎంతకు పడుతుందో తెలియదు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజనకంగా, వజ్రాయుధంగా కనిపించిన బీఎస్పీ.. ఇంతలా పడిపోవడం ఆందోళనకరమే. అయితే అందుకు గల కారణాలు తెలుసుకుందాం.
టెక్నాలజీని వినియోగించుకోని ఏకైక పార్టీ బీఎస్పీ
ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటలైజ్ అయింది. ఇప్పుడు ఏ పనైనా డిజిటల్ గానే అవుతోంది. మారుమూల గ్రామంలో రేషన్ సరుకు తీసుకోవడానికి కూడా బయోమెట్రిక్ వచ్చి దశాబ్దం దాటింది. కానీ, బీఎస్పీ ఇప్పటికీ డిజిటల్ లోకి అడుగు పెట్టలేదు. బహుశా.. సాంకేతిక రంగంలోకి అడుగుపెట్టని ఏకైక పార్టీ బీఎస్పీనే కావచ్చు. ఆ పార్టీకి ఐటీ విభాగమే లేదు. పార్టీ సుప్రెమో మాయావతి 2018లో ట్విట్టర్ ఖాతా తీసుకున్నారు. అంతకు మించి పార్టీకి సంబంధించి మరేమీ లేదు. ఒకవైపు మిగిలన పార్టీలేమో సోషల్ మీడియా ట్రెండ్స్ లో వార్ చేస్తుంటే.. బీఎస్పీ మాత్రం ఇప్పటికీ హార్డ్ కాపీలతో ప్రెస్ నోట్లు విడుదల చేస్తోంది. ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి వారిని ప్రసన్నం చేసుకోవడం, తమవైపుకు లాక్కోవడం రాజకీయ పార్టీ విధి. ఇప్పుడు ప్రజలు ఫిజికల్ గా అందుబాటులో లేరు. మనిషి మన పక్కనే ఉన్నా ఇంస్టాలోనో స్నాప్ చాట్లోలోనో తన ఉంటుంది. మరి, వారిని పట్టుకోవాలంటే అక్కడి నుంచే వెళ్లాలి. కానీ, బీఎస్పీ అందుకు ససేమిరా అంటోంది. ఇదే ఆ పార్టీకి పెద్ద దెబ్బ.
ఇంకా పాత విధానాలే
మూస పద్దతులు ఎవరికీ అంత ఆరోగ్యకరం కాదు. అవి చెడ్డవని కాదు, కానీ ప్రస్తుత ప్రయోజనాలకు అనుగుణంగా వాటిని అప్డేట్ చేయాలి. కాన్షీరాం సమయంలో గ్రామ సభలు, గోడ పత్రికలు ప్రధానంగా ఉండేవి. కానీ, ప్రజలతో కమ్యునికేట్ అయ్యేందుకు టెక్నాలజీ పెరిగింది. ఇది తక్కువ ఖర్చులో ఎక్కువ మందిని కలుసుకునే విధానం. కానీ, బీఎస్పీ మాత్రం టెక్నాలజీని మహమ్మారిగా చూస్తుంది. 5 నిమిషాల వీడియో చూడడానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదు. మరి ఇప్పటికీ గ్రామాల్లోకి వెళ్లి క్యాడర్ క్యాంపులు పెడతామంటే ఎలా? అంతే కాకుండా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను కన్విస్ చేసే విధానం బీఎస్పీ నాయకుల్లో కనిపించదు. ఒక అకడమిక్ స్టైల్లోనే చెప్తుంటారు. తమ స్థాయి దిగి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలనుకోరు. ఇది కూడా ఒకప్పుడు కాన్షీరాం పాటించిన విధానమే అనుకోండి. కానీ, అప్పటి పరిస్థితులు వేరు. ఇక పార్టీలో యువతకు ప్రాధాన్యత దక్కడం లేదు. పార్టీ వెనుకబాటుకు ఇది కూడా చాలా పెద్ద కారణం. పార్టీకి విద్యార్థి విభాగం లేదు, యువ విభాగం లేదు. మరి ఇలాంటి విభాగాలు లేకుండా వారిని పార్టీతో ఎలా కలుపుకుంటారు? ఏజ్ గ్రూప్ లేని వారి మధ్య సఖ్యత కుదరక వచ్చిన కొద్దో గొప్పో యువత పార్టీకి దూరమవుతున్నారు.
ఎత్తులు ఏమాత్రం వేయలేకపోతున్న మాయావతి
ఒకప్పుడు మిరాకిల్ ఆఫ్ డెమొక్రసీ అని మాయావతిని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజిపేయి అన్నారు. సోషల్ ఇంజినీర్ అని కూడా అనేవారు. కానీ, నేడు రాజకీయంగా మాయావతి పాచికలు పారడం లేదు. 12 ఏళ్లుగా మాయావతి తీసుకున్న ఒక్క నిర్ణయం కూడా పార్టీకి లాభం చేకూర్చలేదు. రాజకీయం అంటే ఎన్నికలు, ఓట్లు, సీట్లే. ఈ విషయంలో బీఎస్పీ ఒకప్పుడు మిరాకిల్. కానీ నేడు బీఎస్పీనే పెద్ద డిజాస్టర్. ఈ మధ్య కాలంలో స్ట్రాటిజక్ గా మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను తీసుకువచ్చారు. తన తర్వాత పార్టీ అన్నీ తానే అని ప్రకటించారు. తర్వాత అతడిని తొలగించారు. మళ్లీ తీసుకున్నారు, మళ్లీ తొలగించారు. ఈ మధ్య కాలంలో పార్టీని అత్యంత విమర్శలకు, హేళనకు గురి చేసిన సంఘటన ఇదే. నిజానికి ఆకాష్ ద్వారా బీఎస్పీ వైపుకు యువత కొంత మొగ్గు చూపారు. డిజిటల్ వైపు కూడా పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆకాష్. కానీ, కలిసి వస్తున్న అవకాశాన్ని మాయావతి కాలదన్నారు.
మాయావతి కూడా నియంతే
రాజకీయాల్లో చాలా ముఖ్యమైంది తమ పార్టీ ఎజెండానే రాజకీయ అంశంగా మార్చడం. బీఎస్పీ ఈ పని కాదు కదా కనీసం ఇతరుల నుంచి వచ్చే విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదు. పార్టీ మీద వచ్చే విమర్శలపై మాయావతి పెద్దగా స్పందించరు. అయితే, ఇదే పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని తగ్గిస్తోంది. తమపై వచ్చే విమర్శలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయంలో కార్యకర్తలు ఉన్నారు. మాయావతి పూర్తిగా నియంతలా వ్యవహరిస్తున్నారు. తన అనుమతి లేకుండా ఏదైనా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుంచి తొలగించడం రొటీన్ అయింది. అలా చాలా మంది బడా నాయకులను మాయావతి తొలగించారు. మరి ఇదే సమయంలో కొత్త వారిని ఎవరినైనా తయారు చేశారా అంటే అదీ లేదు. ఉన్నవారికి నమ్మకం కలిగించడంలో విఫలమవుతూనే ఉన్నారు. మాయావతి అనే పరు తప్ప బీఎస్పీలో మరెవరూ కనిపించరు. పార్టీని నిలబెట్టేవారికి కాకుండా తనకు నచ్చిన వారికి పదవులు ఇస్తున్నారు. అలాంటి వారు తమ స్వలాభాల కోసం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నా ఆమె పట్టించుకోవడం లేదనే విమర్శ పార్టీలోపలే ఉంది. క్షేత్ర స్థాయిలో స్వయం పరిశీలన చేయకుండా తన అనుచరుల రిపోర్టుల ఆధారంగా పార్టీ నడుస్తోంది. ఆకాష్ ను పార్టీ నుంచి తొలగించడం కారణం కూడా ఇదేనని తెలుస్తోంది.
చివరగా..
రాజకీయం అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు, సీట్లు, అధికారం. ప్రస్తుతం ఈ పని బీఎస్పీలో జరగడం లేదు. ఇలాంటివి వచ్చినప్పుడు సిద్ధాంతం పేరు చెప్తుంటారు బీఎస్పీ నాయకులు. యధా రాజ తథా ప్రజ అంటారు. మరి అధికారం సాధించకుండా సిద్ధాంతాన్ని నిలబెట్టడం సాధ్యమా? మాయావతి అధికారంలోకి వచ్చాకనే కదా చాలా మార్పులు వచ్చాయని మర్చిపోయినట్టు ఉన్నారు. మాయావతి ఒక డిక్టేటర్ లా అన్ని తనకు నచ్చినట్టే ఉండాలనే విధానాన్ని మానుకోవాలి. అన్ని రాష్ట్రాలకు స్వతంత్రను ఇవ్వాలి. అవసరాన్ని బట్టి రాజకీయ పొత్తులకు పోవాలి. ఒంటరి పోరు పార్టీని చాలా బలహీనం చేసింది. మాయావతి రాష్ట్రాలు పర్యటించి క్యాడర్ లో ఉత్సహాన్ని నింపాలి. ఆధునికతవైపు అడుగులు వేయాలి. పార్టీలో అన్ని రకాల వారికి ప్రత్యేక విభాగాలు ఉండాలి. ఇప్పటికే బీఎస్పీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఓట్ల రాజకీయంలో మరోసారి విఫలమైతే, ఇక బీఎస్పీ అనేది చరిత్రే అవుతుంది.
– ఈదుల్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్