బాంబే హైకోర్టులో టీవీ9 రవి ప్రకాష్ కు పరాజయం

బాంబే హైకోర్టులో టీవీ9 రవి ప్రకాష్ కు పరాజయం
– మేఘాపై వేసిన పిటిషన్ కొట్టివేత!

నిర్దేశం, ముంబయి :
మేఘా ఇంజినీరింగ్ సంస్థపై బురదజల్లే ప్రయత్నంలో టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ బొక్కబోర్లాపడ్డారు. మేఘా సంస్థ ‘బోరెవెళ్లి’ ప్రాజెక్టులో బ్యాంకు గ్యారంటీ ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ, బాంబే హైకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేసిన ఆయనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, రవి ప్రకాష్ దాఖలు చేసిన పిల్‌ను కొట్టివేసింది.

ఈ కేసులో మేఘా ఇంజినీరింగ్ తరపున ముకుల్ రోహత్గీ, డేరియస్ ఖంబాటా, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ తరపున తుషార్ మెహతా, రవి ప్రకాష్ తరపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.
చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ భారతి డాంగ్రే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ రోజు రవి ప్రకాష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో భాగంగా మేఘా ఇంజినీరింగ్ తరపున ఇంటరిమ్ అప్లికేషన్ కూడా దాఖలైంది. ఇందులో రవి ప్రకాష్ వేసిన పిల్, అతనిపై పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు న్యాయస్థానం చర్చించింది.

దాదాపు 10 రోజుల క్రితం జరిగిన వాదనల్లో, మేఘా తరపున ముకుల్ రోహత్గీ మరియు డేరియస్ ఖంబాటా మాట్లాడుతూ, పిటీషనర్ రవి ప్రకాష్ కోర్టును తప్పుదారి పట్టిస్తూ, న్యాయ ధిక్కారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. అలాగే, బాంబే హైకోర్టు మరియు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని రుజువులతో సహా కోర్టులో సమర్పించారు. ఈ పిల్ వ్యక్తిగత ద్వేషంతో ప్రేరేపించబడి, ప్రజాప్రయోజనంతో ముడిపడి లేదని పేర్కొన్నారు. పిల్ వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా కోర్టు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎంఎంఆర్‌డీఏ తరపున హాజరైన భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ఈ పిల్‌ను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నిబంధనలకు అనుగుణంగా పరిగణించలేమని స్పష్టం చేశారు. రవి ప్రకాష్‌కు లోకస్ స్టాండీ (వాదించే అర్హత) లేదని, వివాదాస్పద గ్యారంటీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ధృవీకరించాయని తెలిపారు. కానీ ఈ అంశాలను పిటీషనర్ ఉద్దేశపూర్వకంగా దాచేశారని వివరించారు.

ప్రతిస్పందనగా, రవి ప్రకాష్ తరపున ప్రశాంత్ భూషణ్, సోషల్ మీడియా పోస్టులను అంగీకరించినప్పటికీ అవి “అతిగా ఉత్సాహంతో” పోస్ట్ చేయబడ్డాయని, తరువాత తొలగించబడ్డాయని తెలిపారు. వాటి ప్రభావం పరిమితమైనదని పేర్కొన్నారు. కోర్టు లోకస్ స్టాండీ లేదని భావిస్తే, విచారణ కోసం అమికస్ క్యూరీని నియమించవచ్చని సూచించారు.

తదుపరి సమగ్ర వాదనలు విన్న అనంతరం, బాంబే హైకోర్టు మేఘా ఇంజినీరింగ్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తూ, రవి ప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »