ఆ రిపోర్టర్ పట్టువదలని విక్రమార్కుడే..
– భాగ్యకు న్యాయం చేసిన పోలీసు సీపీ
రిపోర్టర్ అనుకుంటే అన్యాయం జరిగినోళ్ల వార్త కథనాలు రాసి న్యాయం చేయించవచ్చు.. ఇసుక అక్రమ రవాణ చేస్తున్న అధికార పార్టీ పెద్దల బట్టలు ఊడ తీయించవచ్చు.. లంచాలు తీసుకునే ప్రభుత్వ అధికారుల భరతం పట్టవచ్చు.. రిపోర్టర్ గా వరుస కథనాలు ఇచ్చి న్యాయం జరిగే వరకు బాధితులకు అండగా ఉండచ్చు.
ఇగో.. ‘‘ఆంధ్రప్రభ’’ నిజామాబాద్ బ్యూరో ఇన్ చార్జీ దురిశెట్టి నర్సింహాచారి అదే చేశారు. బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు అమాయకురాలు భాగ్యను చితుక బాదిన సంఘటనపై ‘‘పాపం బోయి భాగ్య..’’ అనే శీర్శికతో వరుస కథనాలు రాశారు. ఇటీవలనే బదిలీపై వచ్చిన నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్యను చారి రాసిన కథనాలు ఆలోచింప చేసాయి. ఖాకీ డ్రెస్ వేసుకోగానే రౌడిలా ప్రవర్తిస్తే ఎలా అనుకున్నారేమో… ఆ వెంటనే విచారణ జరిపించి బాధితురాలు భాగ్యకు న్యాయం చేశారు సీపీ సాయి చైతన్య.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ లక్ష్మీ నరసింహాస్వామి జాతరలో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు నెల రోజుల క్రితం అకారణంగా బోయి భాగ్యను చితుక బాదిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. మహిళ అని చూడకుండా ప్రజల సమక్ష్యంలో లాఠీతో చితుక బాదిన గాయాలు అలాగే ఉండి పోయాయి. అయినా.. ఆ అభాగ్యురాలు భాగ్య తనను అకారణంగా కొట్టిన సీఐ విజయ్ బాబుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తో పాటు అప్పటి సీపీకి ఆమె విన్నవించుకుంది. నెల రోజులుగా ఆ బాధితురాలి గోడును ఎవరు పట్టించుకోలేరు. అయితే.. నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య ఇటీవల బదిలీపై రావడంతో పూర్వపరాలతో మళ్లీ వార్త కథనం రాశారు రిపోర్టర్ నర్సింహాచారి. ఆ వెంటనే సీపీ స్పందించి విచారణ జరిపించి సీఐ విజయ్ బాబుకు చార్జీమెమో జారీ చేశారు. అకారణంగా కొట్టిన సీఐ విజయ్ బాబుపై చర్యలు తీసుకున్న సీపీ సాయి చైతన్యకు, తనకు జరిగిన అన్యాయాన్ని వార్త కథనంగా రాసి న్యాయం జరిగేటట్లు చేసిన రిపోర్టర్ చారికి కృతజ్ఞతలు తెలిపింది బాధితురాలు బాగ్య.
నిర్దేశం, నిజామాబాద్ :