జర్నలిస్టుల ఇళ్ళస్థలాల ప్రక్రియను వేగవంతం చేయాలి
ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్ ముకుంద రెడ్డి
సొసైటీలన్నీ సమిష్టిగా సహకరిచాలి
మీడియా అకాడమీ ఛైర్మెన్ కె. శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్:
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రారంభమైన జర్నలిస్టుల ఇళ్ళస్థలాల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ముకుంద రెడ్డి కోరారు. బుధవారం హైదరాబాద్ లోని మీడియా అకాడమీలో జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ళస్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతోందని అన్నారు. మీడియా అకాడమీ ఛైర్మెన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈనెల 21న జరుగనున్న కేబినెట్ సమావేశం నాటికి హైదరాబాద్ లో ఉన్న అన్ని సొసైటీల పూర్తి వివరాలను, జర్నలిస్టుల సంఖ్యతో కూడిన నివేదికను తయారు చేయాలని అన్నారు. ఇందుకు అన్ని సొసైటీలు సమిష్టిగా సహకరించాలని ఆయన కోరారు. అర్హులైన జర్నలిస్టులను మాత్రమే జాబితాలో చేర్చాలని ఆయన సొసైటీల ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఈ సొసైటీని కూడా పరిగణలోకి తీసుకొని జేఏసీలో చేర్చారు. అదేవిధంగా మహాత్మగాంధీ జర్నలిస్ట్స్ సొసైటీని కూడా చేర్చారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి సోమయ్య, బొల్లం శ్రీనివాస్ లు తమ సొసైటీ సభ్యుల జాబితా ను సమర్పించారు. ఈ సమావేశంలో ఐఅండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ డీఎస్ జగన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, వివిధ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు.





