గరుడపురాణరహస్యం వంటిది కారం శంకర్ కవిత్వం
జనన-మరణాల గూఢ తత్వాన్ని గరుడపురాణంలో వేదవ్యాస మహర్షి వివరించినట్లే, కవియాత్ర జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, సద్విమర్శకులు *డా. కారం శంకర్* గారు తన “*మరణమంటే…*” అనే కవితలో లోతైన తాత్వికతను ఆవిష్కరించారు.
మరణం అంటే మరణం కాదు, భయం కాదు, దుఃఖం కాదు అని స్పష్టంగా చెప్పిన శంకర్ గారు, భౌతిక స్పృహను కోల్పోయి అలౌకికం వైపు పయణించడమే మరణమని నిర్వచించారు. స్వామి వివేకానందులు భయాన్ని మరణంతో పోల్చినట్లు, ఇక్కడ కవి మరణాన్ని భయరహిత స్థితిగా చిత్రీకరించారు.
“మరణమంటే ఏడవ ఋతువు, మరణమంటే జీవక్రతువు” అని వ్యాఖ్యానించిన శంకర్ గారు, కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలతో పాటు ఈర్ష్య, ద్వేషం, అసూయ, కుట్రలు వంటి దుర్గుణాలను వదిలేస్తేనే నిజమైన మోక్షం సాధ్యమవుతుందని సూచించారు. ఈ దుర్గుణాలు ఉన్నంతవరకు మనిషి బ్రతికున్నా మరణించినట్లే అని హితవచనం చెప్పారు.
ప్రకృతి చలన సూత్రాలు మారవు. జనన-మరణాలు ఆగవు. మనం అద్దె ఇంటిని ఖాళీ చేసి వెళ్లినట్లు ఒకరోజు ఈ దేహాన్ని వదిలేయాల్సిందే. తీరం చేరేదాకా నావ అవసరం, తీరం చేరాక నావ అవసరం లేదు — జీవితం కూడా అంతే అని అందమైన ఉపమానంతో వివరించారు.
*“మట్టికి మరణం లేదు”* అని చెప్పిన శంకర్ గారు, నిత్య చైతన్యపు ఆనవాలుగా ఆత్మను సూచిస్తూ, జీవితం ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగులుతుందని, బ్రహ్మ కూడా దాని మరణరేఖలను చెరపలేడని లోతైన సత్యాన్ని హృదయానికి చేర్చారు.
ఈ కవిత “మరణమంటే” శీర్షికకు తగినట్లుగా కరుణ, విరక్తి, మోక్ష సాధనకు ఒక అపూర్వ ఉదాహరణగా నిలుస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన జనన-మరణ తత్వంతో ఇది అనుసంధానమవుతుంది.
జాతీయ సాహితీ పురస్కారాల గ్రహీత, కవియాత్ర జాతీయ ప్రధాన కార్యదర్శి *డా. కారం శంకర్* గారికి తాత్వికాభినందన నీరాజనాలు.
– డా. బి. వెంకట్
కవి, వ్యాఖ్యాత
కవియాత్ర జాతీయ ప్రధాన కార్యదర్శి
మరణమంటే..
మరణం అంటే మరణం కాదు
మరణమంటే దుఃఖం కాదు
మరణమంటే సంఘర్షణ కాదు
మరణం అంటే భయము కాదు
మరణం అంటే ఆశ్చర్యం కూడా కాదు
మరణం అంటే అంతం కాదు
అది క్షేత్రంతో అనుసంధానమైన
ఉచ్ఛ్వాస-నిశ్వాసాల విరామం మాత్రమే
భౌతిక ప్రాపంచిక స్పృహను కోల్పోయి
లౌకిక ప్రపంచాన్ని దాటి
అలౌకికం వైపు పయణించడమే
మరణమంటే ఏడవ ఋతువు
మరణమంటే జీవ క్రతువు
దీనికి సానుభూతి అక్కర్లేదు
సంతాపం అక్కర్లేదు
వీధుల్లో ఫ్లెక్సీలు అక్కర్లేదు
పత్రికల్లో ఫోటోలు అక్కర్లేదు
మరణం అంటే అంతర్-బహిర్ యుద్ధాలకు
సుదీర్ఘ విరామం ఇవ్వడమే
సముద్రమంత గాయాలకు స్వస్థత చేకూర్చడమే
ఇక చీకటి ఉండదు, వెలుతురు ఉండదు
రంగుల ప్రపంచం ఉండదు
స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, కుట్రలు — ఏవీ ఉండవు
అంతా శూన్యం…
మనిషి నిర్మించుకున్న భయాల గూళ్లు
స్వర్గ-నరకాల ఆవలి తీరం
మనం అద్దె ఇంటిని ఖాళీ చేసి వెళ్లినట్లే
ఒకరోజు ఈ దేహాన్ని వదిలేయాల్సిందే
జనన-మరణాలు ఆగవు
ప్రకృతి చలన సూత్రాలు మారవు
తీరం చేరే దాకా నావ అవసరం
అచేతనంగా అగ్గిలో బుగ్గి అయ్యే మట్టిలో
కలిసిపోయే నిత్య జీవనతత్వం
మట్టికి మరణం లేదు
నిరంతరం అచేతనంగా కనిపించే
నిత్య చైతన్యపు ఆనవాలు అది
ఆత్మ ఉందంటాము…
తేల్చుకోలేని సందిగ్ధంలోనే
అనేక ఆలోచనా వైరుధ్యాల్లో దగ్ధమవుతూ
జవాబు దొరకని ప్రశ్నలాగా…
జీవితమే ప్రశ్నార్థకంగా ముగుస్తుంది.





