అత్తింటిపై వరాలు కురిపించిన ఆంధ్రా కోడలు.. బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట

– అత్యధిక మొత్తంలో ఆంధ్రాకు నిధులు కేటాయించిన ఆర్థికమంత్రి
– కలిసొచ్చిన సంకీర్ణ ప్రభుత్వం
– చక్రం తిప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
– గతంలో ఆంధ్రా కోడలిపై వచ్చిన విమర్శలకు చెక్ పడుతుందా?

నిర్దేశం, న్యూఢిల్లీ: ఆంధ్రా కోడలు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై గతంలో ఉన్న విమర్శలు దాదాపుగా తగ్గనట్టే ఇక. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆమె ఆంధ్రాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. రాజధానిక పెద్ద ఎత్తున సాయం చేయడం సహా.. అనేక ఇతర ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం, ఎన్డీయేలో చంద్రబాబు చక్రం తిప్పడం వల్లే ఇది సాధ్యమైందని వేరే చెప్పనక్కర్లేదు. గతంలో వాజిపేయి ప్రభుత్వంలో కూడా చంద్రబాబుకు ఈ అవకాశం లభించింది. మళ్లీ ఇప్పుడు ఆ అవకాశం లభించింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. అవకాశాల్ని వాడుకోవడం అటుంచితే చంద్రబాబు పరిమితికి మించి వాడతారు. ఈ విషయంలో ఆయనను కొట్టేవారే లేరు.

10 ఏళ్ల తర్వాత విభజన చట్టంపై ముందుకు
రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తైన తర్వాత విభజన చట్టంపై కేంద్రం స్పందించడం గమనార్హం. ఏపీ విభజన చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక విశాఖ-చెన్నై కారిడార్ లోని నోడ్ లకు ప్రత్యేక సాయం అందిస్తామని, హైదరాబాద్-బెంగళూరు కారిడార్ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కొప్పల్లు, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పోలవరం పూర్తిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు వెల్లడించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలకు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులతో ప్రత్యేక సాయం అందిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

పిడికెడు మట్టి 15 వేల కోట్లకు పెరిగింది
2014లో ఏపీ రాజధానికి ప్రధాని నరేంద్రమోదీ భూమి పూజ చేశారు. ఆ టైంలో చెంబెడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చారు. ఇక అంతే. అప్పటి నుంచి ప్రధానిగా మోదీనే ఉన్నారు. ఆంధ్రాకు పిడికెడు మట్టి తప్ప ఇంకేం ఇవ్వలేదని పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వం కావడం, అందులో ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉండడంతో ఆంధ్రాను ప్రత్యేకంగా చూడాల్సి వచ్చింది. అందుకే ఆంధ్రాకు ప్రధాన రెండు డిమాండ్లైన రాజధాని, పోలవరంపై కేంద్రం ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో వరాలు కురిపించింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!