నిర్దేశం, హైదరాబాద్ః ‘ఎవరినీ ధ్వేషించకు, ఎవరినీ హేళన చేయకు. ఇతరులపై నువ్వు చూపించే ధ్వేషం, నిన్ను కూడా నాశనం చేస్తుంది’ అంటాడు తథాగత గౌతమ బుద్ధుడు. విమర్శ, ధ్వేషాలు కొంత మేరకే పని చేస్తాయి, మితిమీరితే చివరికి తమ పరువే పోతుంది. పైగా, తాము ఎవరినైతే తగ్గించాలనుకున్నామో, వాళ్లు పైకి లేస్తారు కూడా. రేవంత్ రెడ్డి విషయంలో జరుగుతున్నది ఇదే. కేసీఆర్ ఓడిపోయారు. ఫాం హౌజ్ కే పరిమితం అయ్యారు. మీడియాకు రాజకీయాలకు కనిపించడం లేదు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్ ఏంటో కానీ, కేసీఆర్ పేరు తల్చుకోకుండా ఉండడం లేదు. తల్చుకుంటే తల్చుకున్నారు కానీ, మరీ జుగుప్సాకరమైన పదజాలంతో కేసీఆర్ ను దాడి చేస్తున్నారు. నిన్నగాక మొన్న జరిగిన వరంగల్ సభలో పదుల సార్లు కేసీఆర్ పేరెత్తి తాగుబోతు, తిరుగుబోతు అంటూ వ్యాఖ్యానించారు. విపక్ష నాయకుడిగా రేవంత్ కు ఈ మాటలు చెల్లాయి కానీ, ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి. పైగా ముఖ్యంత్రి అయి ఏడాది దాటింది. ప్రజలు ఇచ్చిన అధికారంతో పాలన చేయకుండా, కలుగులో ఉన్న విపక్ష నాయకుడిని పట్టుకోవడానికే రేవంత్ తహతహలాటడం రేవంత్ ప్రతిష్టను దిగజార్చడమే కాదు, కేసీఆర్ ను హీరో కూడా చేస్తుంది.
సీఎం ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్లు హీరో
నిజానికి, ఒక పెద్ద వ్యక్తి ఎవరి గురించైనా మాట్లాడితే ప్రజల అటెన్షన్ ఆటోమేటిక్ గా వారి వైపు మళ్లుతుంది. రాజకీయాల్లో కూడా అది వర్తిస్తుంది. సీఎం ఎవరిని టార్గెట్ చేస్తే ప్రజల్లో వారి పట్ల చర్చ పెరుగుతుంది. క్రమంగా అది సానుభూతిగా మారుతుంది. ఎమ్మెల్యేగా రేవంత్ ను గెలవనివ్వలేదు కేసీఆర్. అంతటితో ఆగకుండా టార్గెట్ చేస్తూ పోయారు. ముఖ్యమంత్రి పాలన మరిచి కక్షసాధింపులకు పోతున్నారని, రేవంత్ మీద సానుభూతి పెరిగింది. ఇంతితై వటుడింతై అన్నట్లు.. ఏకంగా కేసీఆర్ కుర్చీ కూలదోసి, తానే సీఎం అయ్యారు. ఇది రేవంత్ కు కూడా వర్తిస్తుంది. కేసీఆర్ మీద జనాల్లో వ్యతిరేకత అనేది ఎన్నికలతోనే పోయింది. ఇప్పుడు ఆయనను పట్టించుకోరు. పైగా, కేసీఆర్ కూడా బయటికే రావడం లేదు. వీటన్నిటికీ మించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. అయినా సరే రేవంత్ మాత్రం కేసీఆర్ ను వదలడం లేదు. ప్రతి సందర్బంలో కేసీఆర్ ను లాగుతున్నారు. ఆయన పేరు తల్చకుండా రేవంత్ రెడ్డి ఏదీ చేయడం లేదు. ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ తో ప్రారంభమై కేసీఆర్ తో ముగుస్తుంది. అప్పుడు కేసీఆర్ గురించి ప్రజలు ఎలా అనుకున్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి కూడా అలాగే అనుకునే ప్రమాదం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే.. కేసీఆర్ బయటికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కంటే పెద్దగా కనిపిస్తారు.
హామీలు టార్గెట్ అవుతున్నాయి
అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇష్టారీతిన హామీలు ఇచ్చింది. అంతటితో ఆగకుండా.. కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పింది. కానీ, ఏడాది దాటినా ఒక్క హామీ పూర్తిగా నెరవేరలేదు. వీటిని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు రేవంత్. అయితే ఇదే సమయంలో కేసీఆర్ చేసిన పనుల గురించి చర్చ వస్తోంది. ఆ విషయంలో కేసీఆరే నయం, ఏదైనా చెప్తే చేసేవాడన్న చర్చ లేస్తోంది. రాజకీయాల్లో ఒకరి మీద ప్రత్యేకంగా సానుభూతి అవసరం లేదు. అధికారంలో ఉన్నవారి మీద వ్యతిరేకత పెరిగితే, ఆటోమేటిక్ గా విపక్షం మీద సానుభూతి పెరుగుతుంది. పైగా, అధికార పక్షం ఎవరినైతే టార్గెట్ చేస్తుందో వారి మీదే పెరుగుతుంది. రేవంత్ తమ హామీలపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ ను తిట్టుకుంటూ పోతే, కేసీఆర్ మీద సానుభూతి పెరగడం తప్పితే మరోటి జరగదు.
రేవంత్ భాష అస్సలు బాలేదు
నిజానికి ప్రజా జీవితంలో ఉన్నవారు నోరు అదుపులో పెట్టుకోవాలి. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం ఎప్పుడూ రెచ్చిపోయే ప్రసంగాలు ఇస్తుంటారు. కొన్నిసార్లు భయానకంగా మాట్లాడుతుంటారు, బెదిరిస్తుంటారు. అసభ్యకరమైన భాషలో తిడుతుంటారు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తుంటారు. ఈ విషయంలో కేసీఆరేమీ తక్కువ తినలేదు. కానీ, కేసీఆర్ ను ప్రజలు ఓడించింది ఇందుకేనన్న వాస్తవాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలి. విపక్ష నేత మీద మాటల తూటాలు పేలితే పేలొచ్చు. కానీ, అవి పరిధులు దాటితేనే సరికాదు. పైగా, ఇప్పటికే రేవంత్ మీద ఈ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. బూతుల సీఎం, రేవంత్ నోరు మూసీ నది అంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎంత హుందాగా ఉంటే రాజకీయ నాయకుడికి సమాజంలో అంత గౌరవం. రేవంత్ ఇప్పటికే చాలా డ్యామేజీ చేసుకున్నారు. ఇకనైనా హుందాగా వ్యవహరించకపోతే ప్రమాదమే.
తెరచాటున కేసీఆర్ రాజకీయం
కేసీఆర్ పేరుకు ఫాంహౌజ్ కు పరిమితమయ్యారు. కానీ, అక్కడి నుంచే ఆయన రాజకీయం నడిపిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలను కలుస్తున్నారు. బీఆర్ఎస్ సానుభూతిపరులకు కూడా ఫొటో దిగే అవకాశం ఇస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇటు వైపు కేటీఆర్, హరీష్ రావులు ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు. నిజానికి, కేటీఆర్, హరీష్ లనే కాంగ్రెస్ కౌంటర్ చేయలేకపోతోంది. దీంతో, కేసీఆర్ బయటికి వస్తే కాంగ్రెస్ పని అంతేనని ప్రచారం జరుగుతోంది కూడా. వీటని రేవంత్ రెడ్డి గమనిస్తున్నారో లేదో. ఏ నాయకుడైనా తన స్థాయికి తగ్గ నాయకుడిని ప్రత్యర్థిగా చూడడం సబబు. అలాగే కేసీఆర్ ను రేవంత్ తన ప్రత్యర్థిగా చూడడం సబబే. అయితే, బయటి కనిపించకుండా ఉన్న కేసీఆర్ ను అదే పనిగా దాడి చేయడం సబబు కాదు. రాజకీయాల్లో డబ్బు, కులం, మందు కంటే సానుభూతి బలమైంది. ప్రత్యర్థికి ఆ అవకాశం కల్పిస్తే ఎంతటి పీఠమైనా కూలిపోతుంది. కేసీఆర్ అదే తప్పు చేశారు. రేవంత్ కు చాలా అవకాశం ఉంది. ఇప్పటికే ఆపేసి పాలన మీద దృష్టి పెడితే మంచింది.