మల్లారెడ్డి టార్గెట్
– కబ్జాలను వెలికి తీస్తున్న సర్కారు
– గతంలో మల్లారెడ్డి పై రేవంత్ రెడ్డి ఆరోపణలు
– ఇద్దరి మధ్య మాటల యుద్ధం
– అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు
– రాజీకి సీఎం ససేమిరా
నిర్దేశం, హైదరాబాద్:
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ని టార్గెట్ చేసింది. గతంలో తాను చేసిన ఆరోపణలు రుజువు చేయడమేగాక, రాజకీయంగా దెబ్బతీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లారెడ్డి మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. ఆ సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. భూకబ్జాలు చేస్తున్నారని ఆధారాలతో సహా బయట పెట్టారు. అప్పటి ప్రభుత్వం ఈ ఆరోపణలను పట్టించుకోలేదు. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఒకరి నొకరు సవాళ్లు చేసుకున్నారు. వ్యక్తి గతంగా దూషణలు కూడా చేసుకున్నారు. ఒక దశలో మీడియా సమావేశంలో మల్లారెడ్డి తొడగొట్టారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత..
ప్రతి పక్షంలో ఉన్న సమయంలో తాను చేసిన ఆరోపణలు రుజువు చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆక్రమించిన భూముల్లో నిర్మాణాలు ఒక్కొక్కటి కూల్చేస్తున్నారు. మల్లారెడ్డి గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ ఎండీఏ లే అవుట్ లో 2500 గజాల భూమి ఆక్రమించి రోడ్డు నిర్మించగా, ప్రస్తుతం తొలగించారు. అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాలు బఫర్ జోన్ లో ఉన్నవి కూల్చేశారు. అంతేగాక యూనివర్సిటీ స్థలం, జవహర్ నగర్ లోని ఐదెకరాల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశముంది.
రాజకీయంగా దెబ్బ
మల్లారెడ్డి కబ్జాలపై చర్యలు తీసుకుంటే ఆయనకు రాజకీయంగా కూడా దెబ్బతగులుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజి గిరి పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజక వర్గాలకు మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించినందున ఈఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. ఇది ఒక రకంగా అగ్ని పరీక్షగా తయారయింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే ముందుగా ఆ పార్టీ నుంచే రేవంత్ రెడ్డికి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితిలో మల్లారెడ్డిని దెబ్బతీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజీకి ససేమిరా
రాజీకి మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ససేమిరా అంటున్నట్లు తెలిసింది. కాలేజీలో కూల్చివేత ప్రారంభిస్తారని తెలియగానే మర్రి రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కలువగా నిరాసక్తతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. అక్రమాలు రుజువు కావడంతో కూల్చివేస్తున్నారు. ఈ పరిస్థితిలో పార్టీలోకి చేర్చుకుంటే అక్రమాలన్నీ సక్రమాలు చేసినట్లవుతుందని, అంతేగాక మెడమీద కత్తి పెట్టి పార్టీలో చేర్చుకున్నారనే అపవాదు వస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మల్లారెడ్డి ఒక సీనియర్ మంత్రిని కూడా కలిశారు. సీనియర్ మంత్రి ద్వారా రాయబారం ఫలించలేదు. కాంగ్రెస్ లో వెళ్లడానికి దారులు లేక పోవడమేగాక, ఎలాగైనా కూలుస్తారనే మర్రి రాజశేఖర్ రెడ్డి ఏం పీక్కుంటారో పీక్కోండని మీడియాతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రికి ఏమైనా ఆదేశాలు వస్తాయో, కూల్చివేతలు కొనసాగుతాయో వేచిచూడాల్సిందే.