– స్పీకర్ పదవిపై పట్టుమీదున్న చంద్రబాబు
-గతంలో ఇదే పదవిని అడ్డుపెట్టుకుని చక్రం తిప్పిన బాబు
– ప్రధాని పదవి కోల్పోయిన అటల్ బిహారీ వాజిపేయి
నిర్దేశం, న్యూఢిల్లీ: స్పీకర్ పదవి కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుపడుతున్నారు. అయితే చంద్రబాబు ఈ పదవి కోరడంపై బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారణం, గతంలో ఒకసారి ఇలాగే టీడీపీకి స్పీకర్ పదవి ఇస్తే.. బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. అటల్ బిహారి వాజిపేయి ప్రధానిగా ఉండగా జరిగిన ఈ ఉదంతాన్ని ఏ బీజేపీ నేతా మర్చిపోరు. అయితే చంద్రబాబు మరోసారి స్పీకర్ పదవి మీదే పట్టుతో ఉండడంతో బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
గతంలో ఏం జరిగింది?
25 ఏళ్ల క్రితం నాటి స్టోరీ. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిపై అవిశ్వాస తీర్మానం వచ్చింది. వాజ్‌పేయి ప్రభుత్వానికి మెజారిటీ ఉంది, కానీ కాంగ్రెస్ ఎంపీ గిర్ధర్ గమాంగ్‌కు లోక్‌సభలో ఓటు హక్కు లభించడంతో ప్రభుత్వం పడిపోయింది. నిజానికి, దీనికి కొద్ది రోజుల ముందే గిర్ధర్ ఒడిశా ముఖ్యమంత్రిగా అయ్యారు. ముఖ్యమంత్రి కావడంతోనే ఆయన సభ్యత్వం రద్దైందని బీజేపీ అపోహ పడింది. ఆ టైంలో గిర్ధర్ కు ఓటు వేసే హక్కు కల్పించింది అప్పటి స్పీకర్ జీఎం బాలయోగి. ఆయన టీడీపీ నేత. ఇదే కాదు.. ఎల్.కే అద్వాణీని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నది చంద్రబాబే. మోదీతో సైతం ఆయనకు కొంత వైరం ఉంది. ఉమ్మడి ఏపీ సీఎంగా బాబు ఉన్న సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ.. ఇక్కడికి పర్యటనకు వస్తే జైల్లో వేస్తానని బాబు బెదిరించారు. ఇలాంటి కారణాలు కూడా చంద్రబాబుతో బీజేపీ భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి.
అందుకే మొండిపట్టు
లోక్‌సభ స్పీకర్ పదవి ఎంత ముఖ్యమో ఈ ఒక్క ఉదాహరణ చాలు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే చంద్రబాబు స్పీకర్ పదవి తమకే కావాలన్న మొండి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మోదీని పదవి నుంచి దింపడం, బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం అటుంచితే, స్పీకర్ పదవి తన వద్ద ఉంటే ప్రభుత్వంతో అనుకున్న పని సులభంగా చేయించుకోగలమని చంద్రబాబు భావిస్తున్నారట. రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులను రాబట్టొచ్చనే ఆలోచిస్తున్నారట. అందుకే ఆయన ఇంత మొండి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.