నిర్దేశం, ఇస్లామాబాద్ః చాలా మంది మిలియనీర్లు, బిలియనీర్ల పరువు పోయిందంటే నమ్మండి. బిచ్చగాడి కుటుంబం 1.25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విందు ఇస్తే అలాగే ఉంటుంది మరి. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజెన్ల కామెంట్ల వర్షంలో తడుస్తోంది. పైగా ఈ ఘటన.. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో జరగడం మరో విశేషం. పాకిస్తాన్లోని గుజ్రాన్వాలాలో ఒక బిచ్చగాడి అమ్మమ్మ చనిపోయింది. అనంతరం 40వ రోజు జ్ఞాపకార్థం విందు ఏర్పాటు చేశారు. దీని కోసం దాదాపు 1.25 కోట్ల పాకిస్తానీ రూపాయల ఖర్చు చేసి సుమారు 20,000 మందికి అద్భుతమైన విందును ఏర్పాటు చేశారు.
సిరిపాయె, మురబ్బ వంటి సంప్రదాయ వంటకాలతో పాటు వివిధ మాంసాహార వంటకాలను అందులో ఏర్పాటు చేశారు. ఇక ఈ విందు కోసం ఏకంగా 250 మేకలను కోశారు. అతిథుల కోసం 2,000 వాహనాలను ఏర్పాటు చేశారు. పంజాబ్ నలుమూలల నుంచి వేలాది మంది ఈ అద్భుతమైన కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి భోజనంలో లేత మటన్, నాన్ మటర్ గంజ్ (తీపి అన్నం), అనేక స్వీట్లు పెట్టారు.
చిన్న సంఘటన జరిగినా పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యే నెటిజెన్లు.. ఇంత పెద్ద సంఘటనపై ఊరుకుంటారా.. తమదైన స్టైల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఓ నిరుపేద కుటుంబం ఇంత ఘనంగా విందు ఇవ్వడంపై చాలా మంది చమత్కారంగా స్పందించారు. ఈ విందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏమాటకామాటే.. ఒకవైపేమో తీవ్ర ఆర్థిక మాంద్యంలో ఉన్న పాకిస్తాన్ లో కనీస అవసరాలు తీర్చేందుకు ఆ దేశ నేతలు ఇతర దేశాలకు వెళ్లి అడుక్కుంటున్నారు. మరోవైపు అదే దేశంలోని బిచ్చగాడి కుటుంబం కోట్లు పెట్టి విందు ఇచ్చాడు. ముందే తెలిసుంటే, ఆ బిచ్చగాడికి ఇస్లామాబాద్ ప్రధాని కార్యాలయం నుంచి అప్పు కోసం ఫోన్ వచ్చేది.