కామ్రేడ్ నవత స్మృతికి
లోకేటి చందర్ రాసిన భావోద్వేగ లేఖ…
– సోషల్ మీడియాలో వైరల్
విప్లవోద్యమంలో తన భార్య, కామ్రేడ్ నవత అలియాస్ లోకేటి సులోచన అలియాస్ రమా అమరత్వం సందర్భంగా 2016లో ఆమెను చివరి చూపు చూడలేని విప్లవోద్యమ పరిస్థితులను మావోయిస్టు నేత లోకేటి చందర్ రావు అలియాస్ ప్రభాకర్ రాసిన భావోద్వేగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ లేఖలో ఆయన తన భార్యతో పంచుకున్న వైవాహిక బంధం, ఆమె ఎదుర్కొన్న కష్టాలు, విప్లవ మార్గంలో చూపిన నిబద్ధతను హృదయవిదారకంగా లోకేటి చందర్ వర్ణించారు. విప్లవం అంటే విందు బోజనం కాదని, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం నిరంతరం శత్రువుతో పోరాడుతూ, సిద్ధాంతపరంగా విజ్ఞానం సంపాదిస్తూ, కష్టాల మధ్య ఉద్యమాన్ని కొనసాగించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. లేఖలో లోకేటి చందర్ అలియాస్ పడకల్ స్వామి అలియాస్ ప్రభాకర్ ఇలా రాశారు.
– యాటకర్ల మల్లేష్
కామ్రేడ్ నవత!
“నిన్ను, మన పిల్లల్ని కలుసుకోవడానికి ఈ మధ్య కాలంలో ఉద్యమ అవసరాల రీత్యా కొంత ఆలస్యమైనా, చివరికి మనందరినీ కలుసుకునే మంచి అవకాశం పార్టీ పనుల్లో ప్లాన్ అవుతోందనే ఉత్తేజంతో సుదీర్ఘ ప్రయాణం చేస్తూ కాంటాక్టు ప్లేస్‌కు చేరుకుంటున్న క్రమంలో… నాలో మీ అందర్నీ ఒక్కసారి చూడబోతున్నాననే ఆశ మరింత పెరిగింది. కానీ చివరకు మీరు ఎవరూ కలవకపోగా, నీ అమరత్వం వార్త వినగానే నా గుండె దుఃఖంతో నిండిపోయింది రమా!
మన వైవాహిక జీవితంలో నీ జీవిత గాథలన్నీ ఒక్కసారి కళ్ల ముందు సుడులు తిరిగాయి. ఇంటివద్ద నీవు అత్తమామలతో (నేను పార్టీలోకి వచ్చిన తర్వాత) ఎదుర్కొన్న కష్టాలు, తల్లిదండ్రులు సహకరించని సమయంలో పడ్డ బాధలు, పోలీసుల వేధింపులు… పిల్లల పోషణ, చదువులకు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ బతకడం కంటే విషం పోసి చనిపోతానని నీ బాధలన్నీ గుర్తుకొస్తే గుండె రగిలిపోతుంది రమా…
ఈ కుటుంబ, సమాజ బాధలే చివరికి నిన్ను విప్లవం వైపు మల్లించి, దోపిడీ సమాజంపై అసహ్యం, కసి రగిలించి సమాజ మార్పు కోసం పయనించేలా చేశాయి. నీవు విప్లవంలోకి అడుగుబెట్టిన నాటి నుండి మన మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా అన్నదమ్ముల అన్యోన్య బంధంలా సాగిన మన జీవితం గుర్తుకొస్తోంది.
ఉప్పొంగుతున్న దుఃఖాన్ని అదిమిపట్టేందుకు ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి రమా… కామ్రేడ్ నవతా, ఈ క్రూర రాజ్య నిర్బంధం వల్ల చివరి క్షణంలోనైనా నీ అమరత్వపు ముఖాన్ని చూడ నోచుకోలేకపోతున్నందుకు గుండె రగిలిపోతుంది.
ఏది ఏమైనా… నీ గొంతులో ఊపిరి ఉన్నంతవరకు వర్గ రహిత సమాజ స్థాపన మార్గాన్ని వదలనని నా ముందు చేసిన శపథాన్ని, నీ అమరత్వం ద్వారా నిరూపించుకున్నావు గదా రమా! నువ్వు పడ్డ కష్టాలు, మన గాఢమైన బంధం… నేడు నన్ను దుఃఖంలో ముంచెత్తగా, నీ ఆశయ బాటలోనే తప్పకుండా నా విప్లవ మార్గాన్ని కొనసాగిస్తానని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా చివరికంటా పోరాడతానని నీ అమరత్వం సాక్షిగా శపథం చేస్తున్నాను.
నీకు నేను తలవంచి వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను అమ్మా…
కామ్రేడ్ నవత అమర్ హై! అమర్ హై!, కామ్రేడ్ నవత ఆశయాన్ని కొనసాగిద్దాం! కొనసాగిద్దాం!
అమర్ హై కా. నవతా… అమర్ హై కా. నవతా…

దుఃఖంతో, విప్లవ జోహార్లతో
నీ
ప్రభాకర్
(లోకేటి చందర్)
(గమనిక: ఈ లేఖ 2016లో కామ్రేడ్ నవత అలియాస్ రమా అనారోగ్యంతో దండకారణ్యంలో మరణించిన సందర్భంలో రాయబడింది. ప్రస్తుతం లోకేటి చందర్ (ప్రభాకర్) గత శుక్రవారం గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో మరణించిన నేపథ్యంలో ఈ లేఖ మళ్లీ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.)





