బండి భగీరథ్ అరెస్ట్
సరెండర్ అని బండి సంజయ్.. అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ రమేష్ !
రాజకీయ లబ్ది కోసం కేంద్ర మంత్రి ‘క్రెడిట్ గేమ్’..
మీడియాపై రెండు వైపులా ఒత్తిడి!
మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలాలు నమోదు..

(యాటకర్ల మల్లేష్ ముదిరాజ్)
: మైనర్ బాలికపై అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్ ను సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి 8.15 గంటలకు పోలీస్ అకాడమీ సమీపంలో అరెస్టు చేశామని సైబరాబాద్ సీపీ రమేష్ ప్రకటించారు. అయితే ఆయన తండ్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం “మా అబ్బాయి స్వయంగా లొంగిపోయాడు” అని ప్రకటన విడుదల చేశారు. ఒకే రోజు రెండు వ్యతిరేక వార్తలు.. రాజకీయ లబ్ది కోసం బండి సంజయ్ ఆడుతున్న క్రెడిట్ గేమ్ మీడియాకు తలనొప్పిగా మారింది!
హైకోర్టు షాక్.. ఇంటరిమ్ రక్షణ నిరాకరణ
తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ టి. మాధవి దేవి శుక్రవారం రాత్రి భగీరథ్ తరపు న్యాయవాదుల అరెస్టు నుంచి ఇంటరిమ్ రక్షణ ఇవ్వాలనే అభ్యర్థనను కొట్టేసారు. బాధితురాలి వాంగ్మూలం చూసి “ఇప్పటి దశలో రక్షణ ఇవ్వడానికి ఇష్టం లేదు” అని స్పష్టం చేశారు. హైకోర్టు షాక్ తర్వాతనే ఆజ్ఞాతంలో ఉన్న భగీరథ్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
అరెస్ట్ వర్సెస్ సరెండర్.. ఎవరి వార్త నిజం?
పోలీసులు స్పష్టంగా చెబుతున్నారు: “పోలీసుల కథనం ప్రకారం మేరకు సైబరాబాద్ ఎస్ వోటీ బృందం నర్సింగి పరిధిలోని మంచీరేవుల టెక్ పార్క్ సమీపంలో భగీరథ్‌ను పట్టుకుంది. సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి స్వయంగా మీడియాకు ఈ విషయాన్ని ప్రకటించారు.”
అయితే బండి సంజయ్ కార్యాలయం నుంచి వచ్చిన స్టేట్‌మెంట్ ఇంకా భిన్నంగా ఉంది: “చట్టంపై గౌరవంతో న్యాయవాదుల ద్వారా మా అబ్బాయిని విచారణకు అప్పగించాం.”
ఈ డ్యూయల్ నెరేటివ్‌తో మీడియాపై ఒకవైపు పోలీసు అధికారులు, మరోవైపు బండి సంజయ్ కార్యాలయం నుంచి తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. “లొంగిపోయాడని స్క్రోలింగ్ వేయండి” వర్సెస్ “అరెస్టు చేశామని వార్త ఇవ్వండి” అని రెండు వైపులా ఫోన్లు, మెసేజులు వస్తున్నట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

బండి భగీరత్ కేసు వివరాలు
- మే 8, 2026న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం సెక్షన్ 5(1), 6 మరియు BNS సెక్షన్ 64(2)(m) కింద కేసు నమోదు.
- దర్యాప్తు అధికారి బాధితురాలి, తల్లి వాంగ్మూలాలు రికార్డు చేశారు. BNSS సెక్షన్ 183 కింద మేజిస్ట్రేట్ ముందు నమోదు.
- కరీంనగర్, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో బృందాలు పంపి, లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు.
- శనివారం రాత్రి పోలీస్ అకాడమీ సమీపంలో నాకా-బందీలో భగీరథ్ అదుపులోకి వచ్చాడు.
- పంచ సాక్షుల సమక్షంలో విచారణలో నేరం చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. వైద్య పరీక్షలు, మేజిస్ట్రేట్ హాజరు అనంతరం జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు.
బాధితురాలి వాంగ్మూలాలు.. హైకోర్టు ముందు కీలకం
శనివారం మేడ్చల్ మేజిస్ట్రేట్ ముందు 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి 40 నిమిషాల పాటు వాంగ్మూలాలు ఇచ్చారు. బాధితురాలి తరపు న్యాయవాది పప్పు నాగేశ్వర్ రావు హైకోర్టులో సమర్థవంతమైన వాదనలు చేసి ఇంటరిమ్ రక్షణను అడ్డుకున్నారు. బండి సంజయ్ అధికార పలుకుబడిని ఉపయోగించి వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారని, కరీంనగర్ ఏక్తా యాత్రలో బెదిరింపులు చేశారని ఆరోపించారు. మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీ, రాష్ట్రపతికి లేఖలు రాశారు.
రాజకీయ దుమారం.. అన్ని వైపులా విమర్శలు
- బీఆర్‌ఎస్ నాయకులు (డా. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్): కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహించిందని, రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని ఆరోపణ.
- మహిళా సంఘాలు: బండి సంజయ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని ప్రధాని మోదీకి లేఖలు.
- సీఎం రేవంత్ రెడ్డి: “కుమారుడిని స్వయంగా పోలీసులకు అప్పగించాలి” అని సూచన.
బండి సంజయ్ భావోద్వేగ ప్రకటన
“మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు. చట్టం ముందు అందరూ సమానమే. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం” అని బండి సంజయ్ భావోద్వేగంగా ప్రకటించారు.
కేసు ట్విస్ట్: బాధితురాలికి రెండు బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని, ఆమె మైనర్ కాదని భగీరథ్ వైపు నుంచి కౌంటర్ ఆరోపణలు. భగీరథ్ కూడా బాలిక, తల్లిపై కౌంటర్ ఫిర్యాదు చేశాడు.
దిశా నిర్దేశం:
ఈ కేసు చట్టం ముందు అందరూ సమానమే అన్న సందేశం ఇస్తోంది. రాజకీయ ప్రభావాలు, అధికార పలుకుబడి లేకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి. బాధితురాలి గోప్యత, భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక హామీ ఇవ్వాలి. న్యాయం త్వరగా, నిష్పక్షపాతంగా జరిగితేనే ప్రజల్లో చట్టం పట్ల నమ్మకం పెరుగుతుంది. కోర్టు తీర్పు ఏమైనా.. న్యాయం జరగాలి!

