నిర్దేశం, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజా నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. టీనేజర్లలో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రల వాడకం తగ్గుతోందని, ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. ఐరోపా దేశాలలో దాదాపు మూడింట ఒకవంతు మంది అబ్బాయిలు, అమ్మాయిలు గడిచిన కొద్ది రోజుల్లో కండోమ్‌లు లేదా గర్భనిరోధక మాత్రలు తీసుకోలేదని అంగీకరించినట్లు ఈ నివేదిక పేర్కొంది. అసురక్షిత సెక్స్ వల్ల వ్యాధులు, అవాంఛిత గర్భధారణ ప్రమాదం పెరిగింది.
WHO డేటా ఏమి చెప్తోంది?
WHO ఇటీవల యూరప్, మధ్యప్రాచ్యంలోని 42 దేశాలలో ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 15 సంవత్సరాల వయస్సు గల 2,42,000 మందిని ప్రశ్నించారు. వారిని అడిగిన ప్రశ్నల ప్రకారం.. చివరిసారిగా ఎవరితోనైనా సంబంధం కలిగి ఉన్నపుడు కండోమ్ ఉపయోగించిన అబ్బాయిల సంఖ్య 2014లో 70% నుంచి 2022 నాటికి 61%కి పడిపోయింది. ఇక బాలికల సంఖ్య 63 శాతం నుంచి 57 శాతానికి తగ్గింది. అంటే, టీనేజర్లలో మూడింట ఒకవంతు మంది సెక్స్ సమయంలో కండోమ్‌లను ఉపయోగించడం లేదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం, గర్భనిరోధక మాత్రల వాడకం 2014 నుంచి 2022 వరకు స్థిరంగా ఉంది. 15 ఏళ్ల వయసున్న 26 శాతం మంది బాలికలు సెక్స్ సమయంలో గర్భనిరోధక మాత్రలు వాడారు. దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన 33% మంది యువకులు కండోమ్‌లు లేదా గర్భనిరోధక మాత్రలు ఉపయోగించలేదు. ఇక ఉన్నత తరగతి కుటుంబాలకు చెందిన 25% యువత వీటికి దూరంగా ఉంది. ఐరోపాలోని చాలా దేశాల్లో నేటికీ సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదని డబ్ల్యూహెచ్‌ఓ యూరప్ డైరెక్టర్ హన్స్ క్లూగే చెప్పారు. అసురక్షిత శృంగారం వల్ల కలిగే నష్టాలను యువతకు సరైన సమయంలో చెప్పకపోవడం వల్ల కూడా ఈ తరహా సమస్యలు పెరుగుతున్నాయని WHO పేర్కొంది.