నిర్దేశం, హైదరాబాద్: టెక్నాలజీ ఎంత ఎదుగుతోందో, మోసాలు అదే రేంజిలో ఎదుగుతున్నాయి. చోరీ చెయ్యాలంటే ఇప్పుడెవరూ ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొనే మన బ్యాంకు లూటీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తెలివిగా చోరీలు చేస్తున్నారు. తాజాగా సెల్ఫీ తీసుకున్నా కూడా బ్యాంకుకు కన్నం పడుతుందని అంటున్నారు.
సెల్ఫీ తీసుకోవడం అనేది సర్వసాధారణ విషయం. ప్రతి ఒక్కరూ తమ అందమైన ఫొటోలను సెల్ఫీలుగా తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. లైకులు, కామెంట్లు చూసి ఉబ్బితబ్బిబ్బై పోతుంటారు. అయితే ఈ అలవాటే పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందట. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సెల్ఫీలను ఉపయోగిస్తూ మీ వ్యక్తిగత, బ్యాంక్ ఖాతా సమాచారాన్ని దొంగిలిస్తున్నారట.
అనేక యాప్‌లు, అలాగే వెబ్‌సైట్‌లలో మీ గుర్తింపును నిర్ధారించడానికి సెల్ఫీ తీసుకోమని మిమ్మల్ని అడగడం మీరు గమనించే ఉంటారు. దీనినే సెల్ఫీ అథెంటికేషన్ అంటారు. మీరు ఎవరి గుర్తింపును నిరూపించుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మీరేనని నిర్ధారించే సాంకేతికత ఇది. చాలా బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు సెల్ఫీల ద్వారా వ్యక్తులను ధృవీకరిస్తాయి. అయితే, ఇదే టెక్నిక్‌ని సైబర్ నేరగాళ్లు కూడా ఉపయోగించవచ్చని అంటున్నారు.
సెల్ఫీతో సైబర్ మోసాలు
బ్యాంక్ మోసం: సైబర్ నేరస్థులు మీ సెల్ఫీని ఉపయోగించి మీ బ్యాంక్ ఖాతాలోకి చొరబడి మీ డబ్బును తీసుకోవచ్చు.
లోన్ మోసం: హ్యాకర్లు మీ సెల్ఫీని ఉపయోగించి మీకు తెలియకుండానే మీ పేరు మీద లోన్ తీసుకోవచ్చు.
సిమ్ కార్డ్ క్లోనింగ్: మీ సెల్ఫీ సహాయంతో, సైబర్ నేరగాళ్లు మీ సిమ్ కార్డ్‌ను క్లోన్ చేయవచ్చు, దాని నుండి వారు మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని పొందవచ్చు.
మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి మార్గాలను తెలుసుకోండి
* తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు
*మీ అన్ని ఖాతాల కోసం ప్రత్యేకమైన, బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోండి.
*మరింత భద్రతంగా ఉండేందుకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించండి.
* యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించండి.
* సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం మానుకోండి.
* మీరు సైబర్ మోసానికి గురైనట్లు భావిస్తే, వెంటనే మీ బ్యాంక్‌ని సంప్రదించండి.
* ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.