రోడ్లపై నెత్తురు.. ఆంధ్రాలో ఏం జరుగుతోంది?

  • ఒకవైపు రాజకీయం, మరోవైపు సినిమా
    తగాదాలు, తన్నులాటలతో ఉడుకుతున్న రాష్ట్రం

చూస్తుంటే ఆంధ్రాలో కొనసాగుతున్నంత భయంకరమైన వాతావరణం బహుశా దేశంలోనే లేదేమో అనిపిస్తోంది. ఒకవైపు రాజకీయ పార్టీల మధ్య వైరాలు, మరోవైపు సినీ హీరో అభిమానుల మధ్య తగాదాలు. ఎవరూ తగ్గడం లేదు. ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా వినడం లేదు. సోషల్ మీడియా గొడవల సంగతి వేరు. ఏకంగా వీధుల్లోకి వచ్చే తన్నుకుంటున్నారు. కొన్ని ఘటనలైతే మరీ దారుణంగా కనిపిస్తున్నాయి. రక్తాలు కారుతున్నాయి. ఇక మాటల దాడుల గురించి డిక్షనరీలో అర్థాలు దొరకడం లేదు. చెవులతో వినలేని, నోటితో పలకలేని బూతులు. తెలుగోడి సత్తా అంటూ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ నినదించేవారు. ఆయన నినాద ఉద్దేశం వేరు కానీ, రోతలో నేడు తెలుగోడి సత్తాను మాత్రం చాటుతున్నట్లుగానే కనిపిస్తోంది.

రాజకీయ వివాదం
గతంలో జరిగలేదని కాదు, అప్పుడు జరిగాయి కాబట్టే ఇప్పుడు కొనసాగుతున్నాయనీ కాదు. మామూలు ప్రజానికంలో ఏవో తగాదాలు వచ్చి తన్నుకున్నారంటే పరవాలేదు కానీ, పార్టీల మధ్య గొడవలతో కార్యకర్తలు రోడ్ల మీద తన్నుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి టీడీపీ-వైసీపీ-జనసేన పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సహజంగానే అధికారంలో ఉన్నవారిది పై చేయి ఉంటుంది. నిన్నటి వరకు వైసీపీ కార్యకర్తలు మొదటి వరుసలో ఉండేవారు, నేడు టీడీపీ కార్యకర్తలు మొదటి వరుసలో ఉన్నారు. పార్టీల అధినేతలు దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నట్లుగానే కనిపస్తోంది పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే, ఎదుటి వారు తమపై దాడి చేస్తున్నారని చెప్పేవారే కానీ, తమ వారిని శాంతించమని మాత్రం ఎవరూ చెప్పడం లేదు.

సినిమా వివాదం
రాజకీయ గొడవల తర్వాత ఆంధ్రాలో ఎక్కువ తన్నులాటలు జరుగుతున్నది సినిమా హీరోల అభిమానుల మధ్య. అయితే రోడ్ల మీదకు వచ్చి తన్నుకోవడం లాంటివి పెద్దగా లేవు కానీ, బూతు పురణాల్లో మాత్రం పట్టాలు పొందినట్లే కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వీళ్ల రచ్చ అయితే భరించలేనిది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ తిండితిప్పలు మానేసి మరీ రచ్చకెక్కుతున్నారు. వీరి గొడవలు ఎంత సిల్లీగా ఉంటాయంటే మొన్నామధ్య గూగుల్ విడుదల చేసిన ట్రెండులో హీరోలకు ర్యాంకులు ఇచ్చారు. దానిపై కూడా కొంత కాలం తన్నుకుచచ్చారు.

చివరగా..
అభిమానం ఉంటే మంచిదే కానీ, వెర్రితనానికి పోతే నష్టపోయేది సాధారణ ప్రజలేనని గుర్తుంచుకోవాలి. రాజకీయ పార్టీల మధ్య అనేక తగాదాలు ఉంటాయి. కానీ, పార్టీ నేతల ఇస్త్రీ చొక్కా కూడా నలగదు. కానీ కార్యకర్తలు నెత్తురోడుతారు. సినీ హీరోలు వాళ్ల సినిమాలకు ఒకరికొకరు సహరించుకుంటారు. కానీ, అభిమానులు మాత్రం శత్రుత్వాలకు పోయి ఏవేవో చేస్తుంటారు. సోషల్ మీడియా ప్రభావేమేమో ఈ విపరీత్వం మరింత తీవ్ర స్థాయికి పోయింది. అలా అని సోషల్ మీడియాను చెడు దారి అని చెప్పలేం. అయితే దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. ఆంధ్రాను దేశానికి అన్నపూర్ణ అంటారు. మరి ఇలాంటి ప్రాంతంలో ఈ అరాచకం ఎందుకు చెలరేగుతుందో ఆలోచించి, దాన్ని అంతం చేయడం వైపు ఆచరణ సాగించాలి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!