బడ్జెట్ అర్థం కావాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి

నిర్దేశం, హైదరాబాద్: 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్‌ సామాన్యులకు అర్థం కాదు. మరి ఇది సులభంగా అర్థం చేసుకోవాలంటే ఆ పరిభాష కొంత తెలుసుకోవాలి. బడ్జెట్‌ ప్రసంగాన్ని, బడ్జెట్‌తో ముడిపడిన వ్యవహారాలను అర్థం చేసుకోవడానికి పనికొచ్చే కొన్ని పదాలు ఏంటో తెలుసుకుందాం.

ఆర్థిక సంవత్సరం
భారత్‌లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై, మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది.

వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి
వ్యక్తులు తాము ఏడాది కాలంలో ఆర్జించే ఆదాయానికి ఎంత వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదో చెప్పే పరిమితి.

ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు
పౌరులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నుల భారం ప్రజలపై నేరుగా పడుతుంది. ఆదాయపు పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ పన్ను- ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు.

పరోక్ష పన్నుల భారం పౌరుడిపై నేరుగా పడదు. విలువ ఆధారిత పన్ను(వ్యాట్), అమ్మకం పన్ను, సేవా పన్ను, విలాస పన్ను, వినోద పన్ను తదితర పన్నుల స్థానంలో ప్రవేశపెట్టిన జీఎస్‌టీ- పరోక్ష పన్నులకు ఉదాహరణ.

మూలధన లాభాలు
షేర్లు కొన్న తర్వాత ఏడాదిలోపు వ్యవధిలో వాటిపై ఆర్జించే లాభాలను స్వల్ప కాలిక మూలధన లాభాలు అంటారు. ఏడాది కన్నా ఎక్కువ వ్యవధిలో వాటిపై ఆర్జించే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలు అంటారు.

ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంటారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని పట్టి చూపే కీలకాంశాల్లో ఇది ఒకటి.

ద్రవ్య లోటు
ప్రభుత్వ మొత్తం వ్యయాలు, మొత్తం రాబడిని మించితే ఆ స్థితిని ద్రవ్య లోటు (ఫిస్కల్ డెఫిసిట్) అని వ్యవహరిస్తారు. ద్రవ్య లోటును లెక్కించేటప్పుడు రుణాలను పరిగణనలోకి తీసుకోరు.

కరెంటు ఖాతా లోటు
వస్తు, సేవల దిగుమతుల విలువ, ఎగుమతుల విలువ మధ్య వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు అంటారు.

పెట్టుబడుల ఉపసంహరణ
ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాలను ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించడాన్ని ‘పెట్టబడుల ఉపసంహరణ’ అంటారు.

ఆర్థిక బిల్లు
కొత్త పన్నులను, ఉన్న పన్ను విధానంలో మార్పులను ప్రభుత్వం ఆర్థిక బిల్లులో ప్రతిపాదిస్తుంది. బడ్జెట్ సమర్పించిన వెంటనే దీనిని ప్రవేశపెడతారు.

రెపో రేటు
ఆర్‌బీఐ తమకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!