వేటకొడవళ్ల స్వైర విహారం..
సీనియర్ జర్నలిస్టు దారుణ హత్య!
శ్రీగంధం స్మగ్లింగ్‌పై రిపోర్టింగ్‌కు గిప్ట్ మర్డర్
(ఈదుల్ల మల్లయ్య/ చిత్తూరు)
చిత్తూరు జిల్లా వి.కోట మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు జగన్‌మోహన్ రెడ్డి (49) వాకింగ్‌కు వెళ్లిన సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వేటకొడవళ్లు (కత్తులు)తో వెంటాడి కిరాతకంగా నరికి చంపారు. ఈ సంఘటనతో మొత్తం జిల్లా ఉలిక్కిపడ్డది. జిల్లాలో ఇలాంటి దారుణ హత్య గతంలో ఎన్నడూ జరగలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘటన వివరాలు:
జగన్‌మోహన్ రెడ్డి రోజువారీ అలవాటు ప్రకారం మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వి.కోటలోని రహమత్‌నగర్‌లో వాకింగ్‌కు బయలుదేరారు. మరో జర్నలిస్టు మణి కూడా ఆయనతో ఉన్నారు. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారిని వెంటాడారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తగా, దుండగులు కత్తులతో విరుచుకుపడి దాడి చేశారు. ఆయన నడి రోడ్డుపైనే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. సహచరుడు మణి తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు ఘటనా స్థలం నుంచి పరారీ అయ్యారు.
వి.కోట పోలీసులు తక్షణం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పలమనేరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ప్రధాన నిందితుడు రౌడీ షీటర్ తమీమ్:
పోలీసులు ఈ హత్యకు తమీమ్ అనే రౌడీ షీటర్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. తమీమ్ వి.కోటకు చెందినవాడే అయినప్పటికీ ప్రస్తుతం కర్ణాటకలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. మరో వ్యక్తి సాయంతో ఆయన ఈ దాడి చేసినట్లు అనుమానం. పాత కక్షతో లేదా స్మగ్లింగ్ సంబంధిత కారణాలతో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి తనిఖీలు ముమ్మరం చేశారు.
స్మగ్లర్ల కన్నెర్రకు బలి?
జగన్‌మోహన్ రెడ్డి వి.కోటలో 30 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి విలేఖరిగా పని చేస్తున్నారు. పలమనేరు, కుప్పం, తంబళ్లపల్లె ప్రాంతాల్లోని అడవుల్లో శ్రీగంధం (సాందల్‌వుడ్), ఎర్రచందనం అక్రమ రవాణ, స్మగ్లింగ్‌పై ఆయన ఇటీవల ప్రత్యేక కథనాలు రాశారు. ఈ రిపోర్టుల వల్ల స్థానిక స్మగ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జర్నలిస్టు సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలో ఒక స్మగ్లర్‌ను అరెస్టు చేయించడంతో కక్ష పెంచుకుని ఉండవచ్చని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రాంతం కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో ఉండటం వల్ల అక్రమ అటవీ ఉత్పత్తుల రవాణ సులభం. ఇలాంటి స్మగ్లింగ్‌ను ఎండగట్టడం జర్నలిస్టులకు ప్రాణాపాయంగా మారుతోంది.
జర్నలిస్టు సంఘాల తీవ్ర నిరసన..
ఈ హత్యను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తదితర సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. చిత్తూరు, తిరుపతి, పాలకొండ తదితర ప్రాంతాల్లో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ ఘటన ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛపై పెద్ద ప్రశ్నార్థకం. స్థానిక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.







