అంబేద్కర్ ను చూడనివ్వరా? వివక్ష చూపుతున్న కాంగ్రెస్ సర్కార్

– అంబేద్కర్ విగ్రహ పరిసరాల్లోకి సందర్శకులకు అనుమతి లేదు
– అమరుల స్మృతి చిహ్నం పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే
– రాజీవ్ సభలోపాల్గొని అంబేద్కర్ ను పట్టించుకోని సీఎం రేవంత్

నిర్దేశం, హైదరాబాద్: హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు. దీంతో ఆ ప్రాంతం సందర్శకులను కోల్పోయింది. అంబేద్కర్ విగ్రహంతో పాటు అమరుల స్మృతి చిహ్నం కూడా కళ కోల్పయింది. వీటి నిర్మాణాలు పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రజా సందర్శనకు అనుమతించకపోవడంతో సందడి ఏమాత్రం కనిపించడం లేదు. ఎక్కడెక్కడి నుంచో ట్యాంక్‌బండ్‌కు వచ్చిన వారికి దూరం నుంచే సెల్ఫీ పాయింట్లుగా మిగిలిపోతున్నాయి. అంబేడ్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం రూ.146 కోట్లకు పైగా వ్యయంతో 125 అడుగుల ఎత్తు, 45.4 అడుగుల వెడల్పు, 465 టన్నుల బరువు కలిగిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

కేసీఆర్ కట్టించారనే అక్కసు రేవంత్ రెడ్డి ఉరఫ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందేమో.. ఏకంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేద్కర్ ను కూడా వెలివేశారు. ఆ మధ్య అంబేద్కర్ జయంతి రోజున పూల మాల కూడా రేవంత్ ప్రభుత్వం వేయలేదు. ఎందుకంటే, ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందని ఏవేవో బొంకారు. కానీ, అదే సమయంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాల్లో స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి జాతి వివక్ష చూపిస్తున్నారని విమర్శలు లేకపోలేదు. విగ్రహ పరిసరాల్లో కనీస పట్టింపు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

ఈ విగ్రహం దిగువన 50 అడుగుల ఎత్తు, 172 అడుగుల వెడల్పున ఉన్న పీఠంలో గ్రంథాలయం, మ్యూజియం, జ్ఞాన మందిరం, అంబేడ్కర్‌ జీవిత ముఖ్య ఘట్టాల ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ పనులన్నీ పూర్తయినా సందర్శకులను లోపలికి అనుమతించడం లేదు. నిర్వహణ లేక పీఠంలోని నిర్మాణాలు పాడైపోతున్నాయి. మరోపక్క, ప్రపంచంలోనే అతి పెద్ద స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ నిర్మాణంగా పేరొందిన అమరుల స్మృతి చిహ్నం పరిస్థితి కూడా ఇలానే తయారైంది. 3.29ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.179 కోట్లతో మూడు అంతస్తులతో చేపట్టిన ఈ నిర్మాణం.. తెలంగాణ కోసం అమరులైన వారి త్యాగానికి గుర్తుగా నిరంతరం వెలిగే జ్యోతి రూపంలో ఉంటుంది. ఈ స్మృతి చిహ్నం లోపలి భాగంలో మూడంతస్తుల్లో మ్యూజియం, కన్వెన్షన్‌ హాల్‌తోపాటు జ్యోతిని సందర్శించేలా ఏర్పాట్లు చేశారు.

ఈ కన్వెన్షన్‌ హాల్‌ సభలు, సమావేశాల నిర్వహణకు అనువుగా ఉండడంతో పాటు ఆదాయం తెచ్చిపెడుతుంది. కానీ ప్రస్తుతం నిరుపయోగంగా మిగిలింది. కాగా, హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లోని పార్కులను నిర్వహిస్తున్న హెచ్‌ఎండీఏ ఈ అమరుల స్మృతి చిహ్నం, అంబేడ్కర్‌ విగ్రహ నిర్వహణకు సిద్ధంగా ఉంది. కానీ, ఆర్‌ అండ్‌ బీ అధికారులు హెచ్‌ఎండీఏకు అప్పగించేందుకు తాత్సారం చేస్తున్నారు. వెరసి పట్టించుకునే వారు లేక ఆయా ప్రాంగణాలు దుమ్ము పట్టిపోతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు ఈ కట్టడాల నిర్వహణపై దృష్టి పెట్టాలని, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!