ఆన్లైన్ లో వల వేస్తూ.. ఏకంగా 25 పెళ్లిల్లు చేసుకున్నాడు

నిర్దేశం, హైదరాబాద్: ఈ మధ్యే మలయాళంలో ‘నర్సింగన్ హనీమూన్స్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరో మోసాలు చేస్తూ ఐదు పెళ్లిల్లు చేసుకుంటాడు. ఇలాంటి ఘటనలు నిజజీవితంలోనూ ఉంటాయి. అయితే.. ఏకంగా 25 పెళ్లిల్లు చేసుకోవడాన్ని ఎవరైనా ఊహించగలమా? ఆన్లైన్ యుగాన్ని అదునుగా తీసుకుని ఒక యువకుడు చేసిన మోసం ఇది. ఒక పక్క పెళ్లిల్లు కావడం లేదని యువత గుండెలు బాధుకుంటుంటే.. ఇతగాడు ఏకంగా 25 పెళ్లిల్లు చేసుకోవడం సాటి యువకులను నయవంచించడమేనని నెటిజెన్లు ట్రోల్స్ వేస్తున్నారు.

ఇక వివరాల్లోకి వెళితే.. ఈ మోసగాడి అసలు పేరు ఫిరోజ్ షేక్. పెళ్లిల్ల కోసం అన్వర్, రెహ్మాన్, రహీమ్, సురేష్ , రమేష్ ఇలా ఎన్నో మారు పేర్లు మార్చుకున్నాడు. ఫిరోజ్ ఇప్పటి వరకూ 25 మందికి పైగా మహిళలను పెళ్లి చేసుకుని బాధితులుగా మార్చాడు. ఫిరోజ్ ఉద్దేశ్యం ఒక్కటే.. యువతులను పెళ్లి చేసుకుని వారిదగ్గర ఉన్న దోచుకుని పారిపోతాడు. అయితే ఫిరోజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయిలు లేదా మహిళల్లో ఎక్కువగా వితంతువులు, విడాకులు తీసుకున్నవారే ఉండడం విశేషం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఫిరోజ్ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ షాదీ.కాంలో పలు సంఖ్యలో ప్రొఫైల్స్ సృష్టించాడు. దీని ద్వారా అతను వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, తనకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు రెక్వెస్ట్ పంపేవాడు. వారితో స్నేహం చేసి తర్వాత ప్రేమ ఉచ్చులో బంధించేవాడు. పెళ్లి కూడా చేసుకుని కొద్దిరోజులు పెళ్లికూతురు దగ్గరే ఉండేవాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే వధువుకి సంబంధించిన విలువైన వస్తువులు, నగలు, నగదు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించేవాడు.

అయితే.. మన సొసైటీలో ఉన్న బలహీనత వల్ల ఇది బయటికి రాలేదు. చాలా మంది మహిళలు తాము మోసపోవడం అవమానంగా భావించి, పరువు పోతుందని ఫిర్యాదు చేయలేదు. అయితే ఓ మహిళ ధైర్యం చేసి నలసోపరాలో కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ఫిరోజ్ లాంటి పథకమే వేశారు. నకిలీ అమ్మాయి పేరుతో సోషల్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి, అతడిని సంప్రదించారు. పెళ్లి గురించి చర్చలు జరిగాయి. నిందితుడు త్వరలోనే ఈ ఉచ్చులో చిక్కుకున్నాడు. అప్పుడు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.

ఫిరోజ్ ఖాన్ నుంచి సుమారు రూ.3 లక్షల నగదు, అమ్మాయిల ఏటీఎంలు, పాస్ బుక్కులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి మహారాష్ట్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పెళ్లి పేరుతో చాలా మంది అమ్మాయిలను బలిపశువుగా మార్చాడు. షాది.కాం వంటి సైట్‌లో మీకు ఇలాంటి వ్యక్తి కనిపిస్తే ముందుగా అతని గురించి, అతని కుటుంబం గురించి ముందుగా తనిఖీ చేయాలని పాల్ఘర్ పోలీసులు మహిళలందరికీ విజ్ఞప్తి చేశారు. చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వమని సూచించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »