Take a fresh look at your lifestyle.

ఆత్మహత్య పరిస్థితి నుంచి ధీరవనితగా పెట్రి శ్రియ నారాయణ్

0 32

సక్సెస్ స్టోరీ

 ఆత్మహత్య పరిస్థితి నుంచి

ధీరవనితగా..

ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని కన్నీళ్లమయమైన జీవితాన్ని కడతేర్చుకుందామని కడలి వైపు నడక సాగించింది.

అలా సముద్రతీరంలో నడుస్తూ ఉండగా‌ అక్కడ పల్లీలు బఠాణీలు అమ్ముతున్న వారిని చూసింది. ‘చదువు సంధ్యల్లేని ఈ అమాయకులు కాయకష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను!’ అన్న ఒక్క ఆలోచన ఆమెలో ఆశాదీపం వెలిగించింది.

అప్పటి నుండి తీరంలో బఠాణీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలెట్టింది.

‌‌‌‌‌‌‌‌           మొదటిరోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో అమ్మడం ఆపలేదు. మొదట్లో ఐదు,ఏభై,కొన్ని నెలల తర్వాత ఆదాయం నూరు రూపాయలకు చేరింది.

కొన్నాళ్ళకు సూక్ష్మ ఋణాలను తీసుకుని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది. మరి కొన్ని సంవత్సరాలకు ఒక హోటల్ ప్రారంభించింది. నాణ్యతకు ప్రాధాన్యత నిచ్చి వ్యాపారం సాగించడం వల్ల కొద్ది కాలంలోనే వ్యాపారం పుంజుకొని చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచ్ లు నెలకొల్పగలిగింది.

ప్రస్తుతం ” Sandeepa Chain Of Restaurants ” అనే సంస్థకు అధిపతిగా ఆమె సంపాదన నెలకు అక్షరాల రూ. 50 లక్షలు. 1982లో కేవలం 50 పైసలతో మొదలు పెట్టి ఆదాయాన్ని నేడు రు.50లక్షలకు చేర్చిన ఆమె విషాదగాథకు ప్రత్యక్ష సాక్షి ‘చెన్నై మెరీనాబీచ్’.

2010 సంవత్సరంలో అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం పొందిన ఆ ధీర వనిత పేరు  ” పెట్రి శ్రియ నారాయణ్ ”.

తినడానికి తిండిలేని నిర్భాగ్యస్థితి నుండి చనిపోవడానికి కూడా సిద్ధమయిపోయిన స్థితి నుండి నేడు కొన్ని వేలమందికి ఉపాధిని కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవితగాథలే కదా మనకు స్ఫూర్తి!.

శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం. అలాగే మనసు నీరసపడితే ఇలాంటి ధీరుల జీవితాలు చదివి స్ఫూర్తి పొందాలి. చిన్నచిన్న వైఫల్యాలకే నీరసించిపోయే స్వభావం గల వారికి అపజయాలకు క్రుంగిపోయేవారికి ఇటువంటి సజీవగాథలే స్ఫూర్తి!!!.

– గద్దె జయరామ్ చౌదరి

Leave A Reply

Your email address will not be published.

Breaking