పంచాంగం కాదు పంగనామాలు
– ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న జ్యోతిష్యులు
– రాజకీయ పార్టీని బట్టి పంచాంగం మారడం ఏంటి?
– కాసుల కోసం మరీ కక్కుర్తికి పోతున్నారు
– ప్రజల విశ్వాసాలను వ్యాపారం చేసుకుంటున్నారు
నిర్దేశం, హైదరాబాద్ః
తెలంగాణలో ఎన్నికలకు మూడున్నరేళ్ల టైం ఉంది. ఆంధ్రాలో అయితే నాలుగేళ్ల టైం ఉంది. కానీ, జ్యోతిష్యులకు ఎందుకో తొందరొచ్చింది. ఈ ఏడాదే జగన్ కు, కేసీఆర్ కు రాజభోగాలు ఉన్నట్లు పంచాంగం పఠించారు. నిజానికి గతేడాది కూడా ఆ నియకుతే మళ్లీ గెలుస్తారని చెప్పారు. కానీ దారుణ ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉంటే.. అధికార పార్టీ పంచాంగం మరోలా ఉంది. అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డిని వీరుడు, శూరుడు.. ఇంకో పదేళ్లు, ఇరవయేళ్లు వీరికి పోటీనే ఉండదంటూ కితాబులిచ్చేశారు. అమరావతి చకచకా పూర్తవుతుందని ఒకాయన అంటే, తెలంగాణలో వడ్లకు బదులు వజ్రాలు పండుతాయని మరొకాయన అన్నాడు.
ప్రజలు ఎర్రొల్లు, ఏది చెప్పినా నమ్ముతారని రాజకీయ నాయకులు అనుకుంటారు. కానీ, మరీ అతిశయోక్తికి పోవాలంటే జంకుతారు. కానీ, జ్యోతిష్యలు అలా కాదు. ప్రజలను, నాయకులను కలిపి ఎర్రిపప్పల్ని చేస్తారు. ప్రజలకు ఉన్న విశ్వాసాలను అడ్డుపెట్టుకుని అద్భుతంగా వ్యాపారం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. వీటిని ఘరానా మోసాలని చెప్పొచ్చు. భవిష్యత్ గురించి ఆశాజనకంగా ఉండడం వేరు. పోనీ.. ఇలా ఉంటుందేమోనని అంచనా వేయడాన్ని కొంత వరకు ఒప్పుకోవచ్చు. కానీ, ఇలాగే జరగుతుందని చెప్పడం ఏంటి? ఎవరికైనా భవిష్యత్ ఎలా తెలుస్తుంది? సరే భవిష్యత్ ను అంచనా తెలుస్తుందనే అనుకుందాం. మరి పార్టీ జెండాను బట్టి ఆ భవిష్యత్ ఎందుకు మారుతుంది? శాస్త్రం ఎక్కడైనా ఒకే విధంగా ఉండాలి కదా. కేసీఆర్ రాజే అవుతాడు, రేవంత్ రెడ్డే రాజే అవుతాడు. కాసుల కోసమే కదా ఈ పచ్చి అబద్ధాలు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, నోటికి ఎంతొస్తే అంత చెప్పేస్తున్నారు. నిస్సిగ్గుగా అబద్ధాలను, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు.
రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్దెర పంచాంగాలను బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి. ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు. నిజానికి, ఇలాంటి వాటి మీద ప్రస్తుతం ప్రజల్లో ఆదరణ తగ్గినప్పటికీ.. ఇప్పటికీ ఇవి నిజమే అనుకునే వారు చాలా మందే ఉన్నారు. వారికి తప్పుడు సంకేతాన్ని ఇస్తాయి ఇలాంటి పంచాంగాలు. ఈ పంచాంగాల వల్ల కొన్నిసార్లు పార్టీలే నవ్వుల పాలవుతాయి. ఉదాహరణకు తెలంగాణలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఒక పండితుడు అన్నాడు. ప్రపంచాన్ని బీజేపీనే కాపాడుతుందని ఇంకొకాయన అన్నాడు. నవ్వులాట కాకపోతే ఏంటివి? అయినా ఇలాంటి అబద్ధాలు చెప్పడం కంటే ఇంకేదైనా గౌరవమైన పని చేసుకుని బతకొచ్చు.