గద్దరన్నను స్మరించుకుందాం..
కులాల పేరా.. మతాల పేరా అగ్రవర్గాల కింద అనచబడుతూ సమాజంలో సమానత్వం లేక పీడనకు గురవుతూ ఎదురీదుతున్న సమాజం ఒక వైపు.. నీవు తినే తిండిపై నువ్వు కట్టుకునే బట్టపై.. నువ్వు మాట్లాడే మాటపై ఆంక్షలు విధిస్తూ… లౌకిక రాజ్యమనే మాటను మరచి మతాల మధ్య చిచ్చుపెట్టి.. ప్రజలను వేరు చేసి భావప్రకటన స్వేచ్ఛను హరిస్తూ దాడులు చేసే సందర్భం మరొక వైపు..
ఇగో.. అలాంటి పరిస్థితులలో పీడత, తాడిత కులాల వైపు నుండి అనునిత్యం పోరాడిన గద్దరన్నను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. 1949 నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన గుమ్మడి విఠల్ రావు. ప్రజాఉద్యమాల్లో ప్రజలచేత గద్దర్ గా పిలవబడ్డాడు. తన తల్లి లచ్చుమమ్మ జానపద గాయకురాలే కావడంతో పాటలంటే ఎలా పాడాలో చిన్నప్పటి నుండే అలవాటు చేసుకున్నారు.
యువతను ఆలోచింప చేసిన గద్దర్ పాటలు
కష్టజీవులు కట్టుకునే గోసిగొంగడి వేసుకొని ప్రజలు సేలల్లో.. సెలకల్లో బానీలను తీసుకొని పోరాట పాటలను రాసిండు.. పాటలు పాడిండు విప్లవ కారుడు గద్దరన్న.
‘‘విప్లవం అంటే విందు బోజనం కాదు.. ప్రతి క్షణం శతృవు గుండెల్లో నిదుర పోవడం’’ అంటూ గొంతెత్తి పాట ద్వారా బడుగు బలహీన వర్గాలకు విప్లవ బాట చూపిండు గద్దర్.
“బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే ఓతవు కొడుకో.. నైజాం సర్కరోడా.. నా జీలమించినవురో నైజాం సర్కరొడా.. సుట్టుముట్టూ సూర్యపేట నట్టనడుమ నల్లగొండ .. నువ్వుండేదైద్రబాద్..దాని పక్కన గోలుకొండ…. గోలుకొండ ఖిల్లా కింద.. గోలుకొండ ఖిల్లా కింద నీ గోరి కడుతం కొడుకో నైజాం సర్కరొడా” అని బండి యాదగిరి పాటను తన గొంతుతో నైజాంపై గర్జించిన వీరుడు గద్దర్.
“భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదువ లేదురా.. బంగరు పంటల భూములన్నవి సావు ఎరుగని జీవనదులురా.. అంగట్లోనా అన్నీ ఉన్నను అల్లుడి నోట్లో శని ఉన్నట్లు … సకల సంపదల గల్ల దేశంలో దరిద్రమెట్లుందో నాయన.. నీతికల్ల మన దేశంలోన అవినీతేందుకు పెరిగిపోయరా.. నిరుద్యోగులు నిరాశ చెంది ఉరితాడెందుకు బిగించుకుండ్రు.. అమ్మలు..అక్కలు తల్లులు చెల్లెలు మానలెందుకు అమ్ముకున్నరు.. ఈ అవినీతికి మూలమేమిటో ఆలోకించరండో నాయన.. నూటికి డెబ్బైకి పైగా జనులు భూమిని నమ్మి బ్రతుకుతున్నరు.. దున్నేవాడికి దుక్కేలేదు.. కూడు జనులకే కూడు లేదురా… రైతుదేశంలో రైతు బిడ్డకే భూమిలేదు ఎట్లో నాయన ’’ కొండపల్లి సీతారామయ్య రాసిన పాటను మట్టి మనుషుల పక్షాన గొంతెత్తాడు గద్దరన్న.
“అదిగదిగో అదిగో సూడు అమెరికోడోస్తుండూ” అంటూ పాడాడు..
“కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంట్లకొచ్చి దయ్యం పట్టిందిరో నాపెండ్లం పోరలకు’’
అంటూ సామ్రాజ్యవాదం స్వార్థంను పాట రూపంలో ప్రజలకు వివరించారు.
“నాసకింద మీసాకింద నిన్ను జైల్లో పెట్టినారు నీకునాకు తేడాలేదన్నో.. ఓ పోలీసన్న.. పోరుదప్ప దారీ లేదన్నో.. ఓ పోలీసన్న”… అంటూ పోలీసుల బతుకులను పాట ద్వారా వినిపించారు గద్దరన్న.
“పొట్టాకూటి కోసం కొడుకు పోలీసొల్లా చేరినాడు.. ఎప్పుడొత్తడో కొడుకు..యాడ ఉన్నడో. ఏమీ తిన్నడో.. యాడవన్నడో” అంటూ కన్నతల్లీ హృదయ ఆవేదనను పాటలో వినిపించారు గద్దరన్న.
“నిండు ఆమాస నాడు ఓ లచ్ఛా గుమ్మాడీ.. ఆడపిల్ల పుట్టినాదే ఓ లచ్ఛా గుమ్మాడీ.. అత్తా తొంగీ సూడలేదు ఓ లచ్ఛా గుమ్మాడీ.. మొగడూ ముద్దాడరాలే ఓ లచ్ఛాగుమ్మాడి” అంటూ ఆడపిల్ల పుడితే ఈ సమాజం ఎట్ల అర్ధం చేసుకుంటుందో, ఎట్లా అర్ధం చేసుకోవాలో వివరంగా చెప్పినవాడు గద్దరన్న.
పేదల వైపు నిలబడి పోరాడుతూ అమరులైన వీరులను తన సొంత బిడ్డల్లా..
“వందనాలు..వందనాలమ్మో మాబిడ్డలు.. వందనాలు .వందనాలమ్మో నాకూనలు..’’ అంటూ వాళ్ల ధీరత్వాన్ని ఉట్టి పడుతూ విప్లవానికి ఊతమిచ్చిన వాడు గద్దరన్న. ఉమ్మడి రాష్ట్రంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోశించిన వాడు గద్దరన్న..
“పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా.. పోరు తెలంగాణమా… కోట్లాది ప్రాణమా.. మా నీళ్లు మాకేనని మర్లబడ్డ గానమా.. తిరబడ్డ రాగమా.. పోరుతెలంగాణమా.. కోట్లాది ప్రాణామా” అంటూ తెలంగాణకు ఏది కావాలో సూటిగా చెప్పి ఆంధ్రుల గుండెల్లో గుణపంలా మారారు గద్దరన్న..
కళ.. కళ కోసం కాదు, కళ ప్రజల కోసమని, ప్రజలను చైతన్యపర్చడమే నిజమైన కళ అని నమ్మి అదే బాటలో పయనించిన వాడే ప్రజాయుద్ధనౌక గద్దరన్న. తన ధైర్యం, తన ఆలోచన, తన మాట, తన ఆటా, తన పాట సర్వస్వాన్ని ప్రజల కొరకు అంకితం చేసిన యుద్ద నౌక గద్దరన్న. నేటి సమాజంలో రాజ్యాంగాన్ని కాపాడుకునే పరిస్థితి ఏర్పడ్డదని, సేవ్ కానిస్ట్యూషన్ అనే నినాదాన్ని తీసుకున్నాడు.
నూతన సమాజం కోసం తమ విలువైన జీవితాలను త్యాగం చేసిన పెరియార్ రామస్వామి, జ్యోతిరావుపూలే, సావిత్రిబాయ్పూలే, డా. బీఆర్. అంబేద్కర్ లాంటి మహానీయుల అడుగుజాడలో నడవాలని సూచించిన గద్దరన్న పేద ప్రజలకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే పెద్ద దిక్కు అని చెప్పారు గద్దరన్న.
కానీ నేడు రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసే కుట్రలు పన్నుతున్నారు. దీనిని మన దళిత సమాజం తెలివిగా పసి గడుతూ ఆ కుట్రలన్నీ బద్దలు చేయాల్సిన అవసరం మనపై ఉన్నదనే మాటను గ్రహించాలి. ఉత్పాదక రంగాల్లో భాగమైన దళిత సమాజం ఏకమై ఒకే నినాదంగా ఉండాలని అదే.. గద్దరన్నకు మనమిచ్చే నిజమైన నివాళ్లు.
జోహార్ గద్దరన్న.. జోహార్లు.. జోహార్లు..
కందికట్ల నర్సింహ (జర్నలిస్ట్)
హైదరాబాద్ సెల్: 7702123848