Take a fresh look at your lifestyle.

Movie Review: ‘కల్కి’.. అద్భుతమైన ఓ చెత్త సినీమా

చరిత్ర ప్రసిద్ధి చెందిన భారతీయ పురాణ గాథలో కొంత భాగాన్ని ఎన్నుకోవాలి. దానికి హాలీవుడ్ వాళ్ళ పచ్చి వ్యాపార టక్కుటమార విద్యల్ని జత చేయాలి.

0 148

#టెక్నాలజీ_పిచ్చాసుపత్రిలో
#నెత్తురు_కక్కుకు_చచ్చిన_మైతాలజీ

‘కల్కి’చూశారా? చూడండి. అర్జెంట్ ఏమీ లేదు. రెండు రోజులు ఆగి ఐనా చూడండి.
మేగ్నంవోపస్ అని కొందరూ, మాస్టర్ పీస్ అని కొందరూ, నభూతో… అని మరి కొందరూ అంటున్నారు. నాగ్ అశ్విన్ ఇరగదీశాడనీ,
చరిత్రని తిరగరాశాడనీ పొగుడుతున్నారు.
600 కోట్లు పెట్టి తీసిన సినిమా, రెండు
రోజుల్లోనే 300 కోట్లు సంపాదించిందంటే..
మాటలా? మజాకానా? అంటున్నారు.
కల్కి-ఒక మహాకావ్యం అనో, ఒక మహోన్నత ఆశయ సిద్ధి కోసం రక్తం ధార పోసి తీసిన
సినిమా అనో ప్రేక్షక జనాన్ని నమ్మించడంలో దర్శకుడు బాగా సక్సెస్ అయినట్టే వున్నాడు.
అదెలా జరిగింది?
వాస్తవానికి ఇదొక స్కీమ్.
వందల కోట్లు
ఖర్చు పెట్టి వేలకోట్లు కొట్టేయ్యడానికొక షార్ట్ కట్!
దానికేంజేయాలి?
చరిత్ర ప్రసిద్ధి చెందిన భారతీయ పురాణ గాథలో కొంత భాగాన్ని ఎన్నుకోవాలి. దానికి హాలీవుడ్ వాళ్ళ పచ్చి వ్యాపార టక్కుటమార విద్యల్ని జత చేయాలి. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కంప్యూటర్ గ్రాఫిక్స్ మసాలాని జోడించాలి.
ఫైట్ మీది ఫైట్ తో ప్రేక్షకుడికి వూపిరాడకుండా చేయాలి. ఒక గర్భవతిని ప్రవేశపెట్టి మెలోడ్రామా పండించాలి. ఆవిడకి పుట్టబోయే బిడ్డే
‘దేవుడు’అని జనాన్ని భయభ్రాంతుల్ని చేయాలి.
చివర్లో ‘ఏ ఫిల్మ్ బై నాగ్ అశ్విన్’ అనే అక్షరాలు మెరవాలి. రెండు అరిగిపోయిన చెప్పులు
ఇన్ స్టా లో పెట్టాలి. ఇది విప్లవాత్మకమైన
విజయం అని అరుస్తూ నిర్మాత నోట్లకట్టలు లెక్కబెట్టుకుంటుండాలి.
ఆనక, మానవాళికో మహోపకారం చేసినట్టుగా
కల్కి విజయోత్సవ సంబరం దుమ్ము రేపి,
ఇక కల్కి-2 చూడడమే సమస్త భారతీయుల
జీవిత లక్ష్యం అంటూ వెర్రి జనాన్ని మేల్కొల్పాలి!
ఇది కదా స్కీమ్ అంటే…

కల్కి-నిస్సిగ్గుతో నిష్పూచీగా చేసిన ఒక ఫూలిష్
మిస్ ఎడ్వెంచర్. అనేక హాలీవుడ్ సినిమాలకు
థర్డ్ రేట్ కాపీ. అయినా అదొక ఫాంటసీ చిత్రం గనక,
ఏం చేసినా చెల్లిపోతుంది. ప్రభాస్ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా అతనే యోధుడు అవుతాడు. అమితాబ్ బచ్చన్ ఇరవై మందిని గాల్లోకి ఎత్తి పారేస్తుంటాడు. మనం చప్పట్లు కొడతాం. అద్భుతాలు, అతీంద్రీయ శక్తులూ, జనాలు గాల్లోకి ఎగరడాలూ …చూడడం ప్రేక్షకులకు అలవాటే. వాటిని ఎంతో యిష్టపడతారు కూడా. అయితే, ఈ పిచ్చికో పద్ధతి వుంటుంది. కథ, కథనం, సంగీతం, విజువల్ ప్రజంటేషన్
ప్రేక్షకుల్ని మెప్పించాలి. “ఆహా,ఏం తీశాడు గురూ” అనిపించాలి.

ఏనాడో కె.ఎ.ఆసిఫ్ తీసిన ‘మొగలే ఆజం’
జరిగిన కథ కాదు. అనార్కలి అనే ఆమె అసలు చరిత్రలో లేనే లేదని అంటారు. సాక్షాత్తూ అక్బర్ చక్రవర్తిని సవాల్ చేస్తూ ఆయన ముందు డాన్స్
చేస్తూ మధుబాల వోవర్ యాక్షన్ చేస్తుంది. అలాంటిది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.
ఐనా ఇప్పటికీ ఆ సినిమా చూస్తూనే వున్నాం.
కేవీ రెడ్డి మాయబజార్
నూరు శాతం ఫేంటసీ. పూర్తిగా చందమామ కథ. ఘటోద్గజుడు అనే భయంకరమైన రాక్షసుడు, పులిహోర, చక్రపొంగలి, లడ్డూలు తింటుంటాడు. ఐనా ఊగిపోతూ చూశాం,
ఆ పాట యిప్పటికీ పాడుకుంటున్నాం.
‘పాతాళ భైరవి’ ..ఒక నిరుపేదరాలి కొడుకు ఏకంగా యువరాణిని ప్రేమించి, పంతం నెగ్గించుకుంటాడు. ప్రేమ కోసమే వలలో పడెనే పాపం పసివాడు –
పాట వినిపిస్తోంటే, ఎన్టీ రామారావు కొండల్లో
గుట్టల్లో నడిచి వెళుతుంటే జనం కన్నీళ్ళ పర్యంతం అయ్యారు… ఆ యువకుడే మహాశక్తిమంతుడైన మాయల ఫకీర్ని నరికేస్తాడు, రాజ్యానికి రాజవుతాడు. ఎంత బాగా తీశాడు! అంటూ
కె.వి.రెడ్డి కాళ్ళకి దణ్ణం పెట్టుకున్నాం.
అది అచ్చమైన కళ, అందమైన సృజనాత్మకత. పదికాలాలపాటు నిలిచిపోయే కావ్యాలవి.

ఆధునిక కాలంలో ప్రశాంత్ నీల్ కేజీ ఎఫ్ ని
తెర మీద కళాత్మకంగా ఆవిష్కరించిన తీరు
చూసి జనం కళ్లు తిరిగి కిందపడ్డారు.
బాహుబలిలో రాజమౌళి విజువలైజేషన్, కథని బిగువుగా నడిపించిన తీరు కనకవర్షం కురిపించింది, నిజానికివి దొంగ సినిమాలే.
కనికట్టు కథలే! ఐనా హృదయాల్ని తాకాయి. కళతో, సౌందర్యంతో, ఎంటర్ టైన్మెంట్ తో
జనాన్ని రంజింపజేశాయి.
ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి లాంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన నాగ్ అశ్వినేనా ఈ కల్కి అనే కల్తీ సినిమా తీసింది! కనీవినీ ఎరుగని కథతో, మతిపోయే ఫాంటసీతో, వెన్నాడే విజువల్ ఎఫెక్ట్ తో చరిత్ర సృష్టిద్దామనే తాపత్రయంతో తీసిన ఒక కంగాళీ అవకతవక గందరగోళపు చిందరవందర చిత్రమే ‘కల్కి. సినిమాలో చాలామంది ఒక మహోదయం కోసం నిరీక్షిస్తుంటారు. “రేపటి కోసం” అని అంటుంటారు. ‘నీ త్యాగం వృధాపోదు కామ్రేడ్’ అని పీపుల్స్ వార్ నక్సలైట్లు అన్నట్టుగా, త్యాగం చెయ్యడం కోసం కొందరు సిద్ధంగా వుంటారు.
ఇది మహాభారతమో?
కల్కి రాబోవడమో?
విప్లవం తరుముకొస్తుండడమో?
ఏసు క్రీస్తు సెకండ్ కమింగో… అర్ధం కాకుండా దర్శకుడు సకల జాగ్రత్తలూ తీసుకున్నాడు.

వందల కోట్లు నీళ్ళలా ఖర్చయిపోతున్నాయి అన్న భయం, అభద్రత దర్శకనిర్మాతల్ని జమిలిగా కాటేసినట్టున్నాయి. సినిమాలో కొన్ని కమర్షియల్ వెకిలి వేషాలు జొప్పించారు. సినిమా సీరియస్ అయిపోతుందనే బెంగతో హీరో ప్రభాస్ ని ఒక చిల్లర కమెడియన్ గా మార్చారు. వీరుడూ, శూరుడూ, ఏకంగా అశ్వత్ఠామతోనే తలపడగల యోధుడూ ఐన భైరవుడు ప్రభాస్ ని బ్రహ్మానందం ఇంటి అద్దె అడుగుతుంటాడు. ఎలాగోలా కడతానని ప్రభాస్ ప్రాధేయపడుతుంటాడు. ఈ నేలబారు హాస్యానికి, సినిమా కథకీ అసలు సంబంధమే వుండదు.
ఇంకా అసందర్భంగా మధ్యలో రాజమౌళి వస్తాడు, “ఇతనితో పెట్టుకుంటే మరో అయిదేళ్ళు దూలతీరిపోతుంది” అనుకుంటాడు ప్రభాస్. అశ్వత్ఠామ, శ్రీకృష్ణుడూ ప్రధాన పాత్రలయిన ఈ సినిమాలో ఇంత చవకబారు డైలాగు ఎలా పెడతారు? ఈ చిన్న విషయం నాగ్ అశ్విన్ కి తెలియక కాదు. కమర్షియల్ ఫార్మాట్ అనే
ఫార్ములా వల్ల దాపురించిన దుర్గతి ఇది!

ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటాని …..గొప్ప స్టార్ కాష్ట్.
వీళ్లు చాలరన్నట్టు బ్రహ్మానందం, రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్ ….
ఎందుకు వీళ్ళంతా? ఒక ఉత్కృష్టమైన
ఆశయ సాధన కోసమా?
ఒక ఉదాత్తమైన ఆదర్శాన్ని మన ముందు వెలుగు వెన్నెల దారులుగా పరవడం కోసమా?
ఈ దిక్కుమాలిన లోకానికి సుఖశాంతులు ప్రసాదించే శ్రీకృష్ణ పరమాత్ముని బోధనల కోసమా?
దివ్య తేజస్సుతో వెలిగిపోయే కల్కి
ఆవిర్భావం కోసమా?
శ్రీశ్రీ చెప్పిన జగన్నాథ రథ చక్రాల్ని భూమార్గం పట్టించి, భూకంపం పుట్టించి ఈ శాపగ్రస్త లోకానికి శోకం లేకుండా చేయడం కోసమా?
ఒక అరుదైన, కళాత్మకమైన అనుభవాన్ని ప్రేక్షకులకు ఇవ్వడం కోసమా?
భగవంతుడా! ఇవేమీ కాదు, కేవలం ఒక వెయ్యి కోట్లరూపాయల లాభం అనే దురాశ నెరవేరడం
కోసం అని తెలిసినపుడు, కల్కి అసలు పేరు
‘ఫర్ ఎ బిలియన్ డాలర్స్ మోర్’ అనీ ,
కల్కి సెకండ్ పార్ట్ పేరు ‘ప్రాఫిట్స్ ఆర్ ఫరెవర్’ అని నీకు అర్థం అయినపుడు, కల్కి అనే ఈ మెగా డిజాస్టర్ కి మూలకారణంబెవ్వడో, ఆ అశ్వినీదత్ నే శరణంబు వేడెదన్!

అయిదు నెలల గర్భవతి నుంచి క్రూరమైన పద్ధతిలో ‘సీరం’ తీసి దాన్ని ఆయుధంగా వాడడం అనే అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని దరిద్రపు ఐడియాని యీ నకిలీ సినిమాలో మనం చూస్తాం. ప్రతీ పావుగంటకీ ఇద్దరో ముగ్గురో చచ్చిపోవడం అనే పాచిపట్టిన ఫార్ములాని కూడా చచ్చినట్టు చూడాల్సిందే! లోక కళ్యాణం కోసం
ప్రభవించబోయే కల్కి కోసం ఎదురు చూడ్డమే
ఈ మూడు గంటల మల్టీ కలర్ మోసం.
పోనీ వాడు పుట్టాడా?
అంటే అది కల్కి పార్ట్-2 లో!
కనక కథంటూ ప్రత్యేకంగా చెప్పుకోడానికేం లేదు. ‘రేపటి కోసం’ అనే ఉదాత్తమైన మాటల వెనుక వున్నది ఒక హార్ట్ లెస్ కార్పొరేట్ కమర్షియల్ స్కీమ్. ప్రజల జేబులు కత్తిరించడానికి వేసిన ఒక ఖరీదైన ఎత్తుగడ!
ఐనా యిలాంటి సినిమాలు చూడడానికి జనం సిద్ధంగా వున్నారు. చూస్తున్నారు కూడా, ఇంత పెద్ద ఆడియో విజువల్ మేజిక్ కి పాల్పడుతున్నప్పుడు, అది హృదయానికి హత్తుకునేలా, భావోద్వేగంతో కుదిపేసేలా, ఆహ్లాదంతోనో, ఆనందంతోనో పులకించిపోయేలా, ఆత్మ అమృతధారల్లో తడుస్తున్న ఫీల్ యిచ్చేలా వుండకపోతే ….ఎందుకీ శ్రమ?
ఉదయాన్నే పాలూ కూరగాయలూ కొనుక్కున్నట్టు, చికెనూ సిగిరెట్లూ కొనుక్కున్నట్టు, ఒకింత ఆనందాన్ని పొందడానికి టికెట్టు కొని మరీ థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుల మీద ఇంత అమానుషమైన లాఠీ ఛార్జి చేయడం నేరం అవుతుందనే నా ఫిర్యాదు.

రోజూ పిల్లలు కంప్యూటర్లో ఆడుకునే ఏ వీడియో గేమ్ కన్నా కల్కి గొప్పదేమి కాదు.
అలాంటప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం దేనికి? ఇండియా, కెనడా, అమెరికాల్లో ఈ సినిమాని జనం చూస్తున్నారు. కొందరు ఆహా వోహో అంటున్నారు. మరికొందరు భారతీయ మైథాలజీని అమెరికన్ టెక్నాలజీతో రేప్ చేయిస్తే పుట్టిన వికృత శిశువే
కల్కి అని కోప్పడుతున్నారు. కనుక ఈ డిబేట్ అవసరమైనది!

నిర్మాత పేరాశకీ, అష్టావక్ర లాంటి అంతుచిక్కని కథకీ మధ్య సిల్వర్ స్క్రీన్ పొయిట్ నాగ్ అశ్విన్ నలిగిపోయి వుంటాడని అనుమానిస్తున్నాను.
ఐనా, చివరికి దొంగ వేషం ఫలించినట్టే వుంది.
కాసుల వాన నాన్ స్టాప్ గా కురుస్తూనే వుంది.
అటు చూడండి…నోట్ల కట్టలగుట్టల మీద కూర్చుని వున్న ‘జగదేకవీరుడు’ అశ్వనీ దత్, గ్లాసులో సోడా పోసుకుంటూ, వెర్రి జనానికి కన్ను గీటుతూ కులాసాగా నవ్వుకుంటున్నాడు.
ఇప్పుడు లాఠీ చార్జ్ మాత్రమే చేశాను, త్వరలోనే కల్కి-టూ తో వచ్చి మిమ్మల్ని బాది బాది చంపేస్తానని బాధ్యతాయుతంగా
బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు!

చివరి మాట: తెలంగాణ దర్శకులు ఎంతో శ్రద్ధతో, కమిట్ మెంట్ తో సృజనాత్మకంగా తీసిన చిన్న సినిమాలు-మల్లేశం, పెళ్లి చూపులు, బలగం, విరాట పర్వం యిచ్చిన ఆనందాన్ని, ఉద్వేగాన్నీ- వందల కోట్ల కల్కి యివ్వలేకపోయిందన్నదే బాధ. కళని బతికించిన చిన్న సినిమా జిందాబాద్.

– తాడి ప్రకాశ్, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking