వెంటనే రైతు రుణ మాఫీ చేయండి
– సీఎం కు హరీష్ రావు లేఖ
నిర్దేశం, హైదరాబాద్:
తెలంగాణలో రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు లేఖ రాశారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే నెరవేర్చాలని సూచించారు. రుణమాఫీపై విధివిధానాలు లేకపోవడంతో రైతులపై బ్యాంకర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. రుణమాఫీతోపాటు వరికి ఇవ్వాల్సిన బోనస్ కూడా ఇవ్వాలన్నారు. సీఎంకు హరీష్ రాసిన లెటర్లో ఉన్న అంశాలు ఏమంటే…”తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోవాలని స్వయంగా పిలుపునిచ్చారు. మీ మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. డిసెంబర్ 9 నాడు మీరు ప్రకటించినట్టుగా రుణమాఫీ జరగలేదు. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెలలు కావొస్తున్నది. అయినప్పటికీ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణ మాఫీ కాలేదు. బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయి.
ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని, తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వందల మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థిక భారం పడుతోంది. రైతులను డిఫాల్టర్లుగా మారుతున్నారు. సిబిల్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోతోంది. రైతుల పిల్లలు చదువు కోసం విద్యారుణాలతోపాటు ఇతర రుణాలు పొందలేకపోతున్నారు. ఈ సమస్యలతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధానం ప్రకటించకపోవడం, ఈ బడ్జెట్లో రుణమాఫీ ప్రస్తావన లేకపోవడం వల్ల రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
రుణమాఫీపై ప్రభుత్వం నేటి వరకు అటు బ్యాంకర్లకు కానీ, ఇటు రైతులకు కానీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. రుణాలు మేమే చెల్లిస్తామని, రైతులపై ఒత్తిడి తేవొద్దని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించలేదు. ఎవరైనా రైతులు వడ్డీ భారం పడకుండా రుణాలు చెల్లిస్తే వారికి ప్రభుత్వం తిరిగి నగదు ఇస్తుందా, లేదా? అనే విషయంపైనా స్పష్టత లేదు. ఈ అనిశ్చితి గ్రామాల్లో రైతులకు, బ్యాంకర్ల మధ్య చిచ్చు పెడుతున్నది. స్థానిక బ్యాంకు మేనేజర్లకు వారి ఉన్నతాధికారుల నుంచి లోన్ రికవరీ కోసం నోటీసులు వస్తున్నాయి. దీంతో వారు రైతుల మీద పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయకపోవడం వల్ల వారు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందక, పంటలు ఎండిపోయి, సకాలంలో నీళ్లు అందక, ఈ నాలుగు నెలల కాలంలో 209 మంది అన్నదాతలు చనిపోయారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లకు, వేధింపులకు తట్టుకోలేక రైతులు ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రుణమాఫీ విషయంలో మీరు తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. 2లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేది ప్రకటించాలని రైతుల పక్షాన కోరుతున్నాను. రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలని విన్నవించుకుంటున్నాను. అని లేఖలో పేర్కొన్నారు.