నిర్దేశం, హైదరాబాద్ః ప్రపంచంలో ఏ తల్లి తన బిడ్డల్ని వేరు చేసి చూడదు. కానీ, భరతమాత మాత్రం అలా కాదు. తన బిడ్డల్ని కులాలుగా విడదీసి, కొందరిని తిని బలవమని, కొందరిని ఊడిగం చేసి చావమని చెప్పింది. బహుశా.. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి తల్లి ఉండదేమో? ఈ కులం ఎంత ప్రమాదకరమైందంటే.. ఒక డబ్బున్న అమ్మాయిని పేదవాడు ప్రేమిస్తే.. అమ్మాయి తరపు వారు పేదవడానికి చంపేస్తారు, ఇద్దరు వేరు మతస్తులు ప్రేమించుకుంటే వారు కూడా తమ పిల్లల్ని కాకుండా వేరే వారిని చంపాలని చూస్తారు. కానీ, కులం అలా కాదు. ఒకవేళ తమ కూతురో, కొడుకో వేరే కులం వారిని ప్రేమిస్తే.. సొంత పిల్లల్నే చంపుకుంటారు. అంతా చేసి కూతురు చనిపోయిందని వారికి ఇసుమంత దుఃఖమైనా ఉండదు. తాను ఏదో సాధించానని ఎక్కడా లేని గర్వం వస్తుంది. కులం ముందు, కులగజ్జి ముందు కన్న పిల్లలు కూడా తెల్ల వెంట్రుక కూడా కాదు.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని హయత్‌నగర్‌లో కానిస్టేబుల్ నాగమణి హత్యతో మరోసారి రాష్ట్రంలో కులోన్మాద, మతోన్మాద హత్యల వ్యవహారం చర్చకు దారితీసింది. అప్పట్లో నల్లగొండ జిల్లాలో ప్రణయ్, అమృత ప్రేమ-పెళ్లి విషయంలో జరిగిన ఘోరాన్ని తెలంగాణ సమాజం ఇంకా మరిచిపోలేదు. దళిత యువకుడిని పెళ్లి చేసుకుని తన పరువు తీసిందనే కోపంతో అమృత తండ్రి మారుతి రావు రూ. 50 లక్షలకు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ని హత్య చేయించాడు. తన సోదరి వేరే మతస్తుడిని ప్రేమించి పెళ్లిచేసుకోవడంతో కుటుంబం పరువు పోయిందని భావించిన ఓ సోదరుడు స్నేహితులతో కలిసి సరూర్‌నగర్ ప్రాంతంలో నాగరాజు అనే వ్యక్తిని అందరు చూస్తుండగానే అత్యంత దారుణంగా చంపేశాడు.
“గడప లోపలే కులం.. గడపదాటితే హిందువులం” ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తున్న మాట ఇది. కానీ, ఎక్కడ? హిందువుల మీద ఎవరో దాడి చేస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు అంటారు కానీ, సాటి నిమ్నకుల హిందువుల మీద అగ్రకుల హిందువులు చేసిన, చేస్తున్న దాడి ప్రపంచంలో ఏ మానవ సమూహంలో జరగలేదు. కనీసం ఒక వర్గం జంతువులు కూడా కలిసే ఉంటాయి. కానీ, తామంతా హిందువులమని చెప్పుకునే సమూహం ఏమాత్రం సొంత మనుషుల మీదే ధ్వేషం, హింస, వివక్ష చూపిస్తుంది. కుల పరువు కోసం ఇప్పటికీ హత్యగావించబడ్డ మహిళలు వేలు, లక్షల్లో ఉంటారు ఈ దేశంలో. అలాగే, కుల వివక్ష కారణంగా చనిపోయిన బహుజన ప్రజలు కోట్లలోనే ఉంటారు. ఇంత దుర్మార్గాలు చేస్తూ కూడా.. తామంతా వసుధైక కుటుంబమని, హిందువులమని చెప్పడం అగ్రకుల హిందువులకే చెల్లింది. అందరం హిందువులమే అంటారు కానీ, బహుజన సమాజాన్ని పీక్కుతునే రాబందువులు ఇదే హిందూ సమాజంలో అగ్రకులాలుగా ఉన్నారు.
ఇంకా విచిత్రం ఏంటంటే.. హిందూమతంలో కులం వల్ల ఇబ్బంది ఎదుర్కోలేక మతం మారినా కుల వివక్ష మాత్రం విడవడం లేదు. తాజాగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్ చెంగయ్య మీద అగ్రకుల హిందువులు దాడి చేశారు. వారు చెప్పిన కారణం, మత ప్రచారం చేస్తున్నారని. మతం ప్రచారం చేశారా లేదా అన్నది కాసేపు పక్కన పెడితే.. ఇలాంటి దాడులు అనేకం జరుగుతుంటాయి. సరిగ్గా పరిశీలిస్తే.. వారంతా దళిత వర్గం వారై ఉంటారు. క్రైస్తవంలో చాలా కులాల వారు ఉన్నారు. వారు కూడా మత ప్రచారం చేస్తారు. కానీ, వారిపై ఈ తరహా దాడులు ఎందుకు జరగవు? ఇలాంటి వాటిని మతోన్మాద దాడులు అంటారు, కానీ ఇవన్నీ పచ్చి కులోన్మాద దాడులే. కాకపోతే, కులం పేరు చెప్పి కొట్టడం కొంటే మతం పేరు చెప్పి కొట్టడం సులువు కాబట్టి.. దాన్ని వాడుకుంటారు అంతే.
కులోన్మాద, మతోన్మాద హత్యలు పెరిగిపోతుండటంపై గతంలోనే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ తరహా ఘటనలు దేశానికి కళంకం అని ఆటవిక, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నం అని, వాటికి ముగింపు పలకాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కులోన్మాద, మతోన్మాద హత్య కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించేందుకు వీలుగా వాటిని అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలని న్యాయస్థానాలకు సూచిస్తూ సంచలనాత్మక తీర్పును సుప్రీంకోర్టు గతంలో వెలువరించింది.
– టోనీ బెక్కల్