నిర్దేశం, హైదరాబాద్: తెలంగాణలో రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం.. దేశ రాజకీయాలపై కన్నేసిన తర్వాత గులాబీ పార్టీకి అసెంబ్లీ సహా లోక్ సభ ఎన్నికల్లో చావు దెబ్బ పడింది. దాంతో ఆ పార్టీ బాగా రియలైజ్ అయింది. దేశ రాజకీయాల సంగతి తర్వాత.. ముందు రాష్ట్రంలో ఉనికి కాపాడుకుంటే చాలన్నట్లు మారిపోయింది పరిస్థితి. ఇందులో భాగంగా భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే పనిలో ఉన్నట్లు ప్రచారం సమాచారం. నిజానికి, దీనిపై పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు వచ్చిన వార్తలకు గులాబీ పార్టీ కీలక నేత హరీష్ రావు భారీ సంకేతాలను ఇచ్చారు.
బుధవారం పటాన్ చెరు నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మెడలో టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువా కనిపించడం గమనార్హం. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఆయన అనుకోకుండా ఇలా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారా, లేదంటే టీఆర్ఎస్ సంకేతాలు బలంగా ఇస్తున్నారా అనే విషయం అయితే స్పష్టంగా తెలియదు కానీ, పార్టీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి టీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో పార్టీ పేరు మార్పు గురించేనని అంటున్నారు.