నిర్దేశం, హైదరాబాద్: అధికారులు తింటున్నారంటే.. అవినీతి చేస్తూ ప్రజాధనాన్ని తింటున్నారనుకున్నట్లైతే తప్పులో కాలేసినట్లే సుమా.. ఇక్కడ మాట్లాడుతున్నది వాళ్ల కష్టార్జితంతో కొనుక్కుని, వండుకుని తినే అన్నం గురించి. 12 తర్వాత బ్యాంకుకు వెళ్లినా, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా అధికారులు తింటున్నారనే బోర్డ్ కనిపిస్తుంది. లేదంటే ‘లంచ్ టైం’ అంటూ వాళ్లే చెప్తారు. అందరినీ అని కాదు కానీ, ప్రభుత్వ అధికారుల్లో చాలా మంది కనీసం రెండు, మూడు గంటలైనా లంచ్ చేస్తారు. చేయరు మరీ.. చెమటోడ్చి సంపాదించింది కదా.. ఆస్వాదిస్తూ తినడానికి ఆమాత్రం టైం పడుతుంది. ప్రతి గింజపై తినేవాడి పేరు రాసుంటుందంటారు.. బహుశా, ప్రతి గింజపై తమ పేర్లు చూసుకుని తింటున్నారో, లేదంటే పేరు లేదని రాసుకుని తింటున్నారో ఎవరికి తెలుసు?
వారి తిండి మీద ఏడవడం కాదు కానీ, తిండి పేరుతో పని పక్కన పడేస్తుండటం సర్వసాధారణం అయిపోయింది. అయినా వారినేం అంటాలేం.. పై అధికారులకు సెల్యూట్, కింది అధికారిపై పెత్తనం.. ఆఫీసును చక్కదిద్దే ఇన్ని పనుల మధ్య మిగతా పని ఎలా చేయగలరు? ఆఫీసు చక్కదిద్దడం అంటే ప్రజల అవసరాలు తీర్చడం కాదండోయ్. బహుశా ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లినప్పుడు ఈ సిట్యువేషన్ ఎదుర్కోని కామన్ మ్యాన్ ఉండరు. రెండు నిమిషాల్లో అయ్యే పని కోసం.. సదరు కార్యాలయం చెట్ల కిందనో, పార్కింగ్ స్టాండులోనో గంటలు గంటలు వెయిట్ చేయడం మామూలే.
గత శుక్రవారం నిజామాబాద్ జిల్లాలోని ఓ ఎంఆర్ఓ ఆఫీసులో అధికారులు ఒంటి గంటకు ముందే టిఫిన్ డబ్బా తెరిచి తినడం ప్రారంభించారు. సాయంత్రం నాలుగైనా క్యాంటీన్ నుంచి బయటికి రాలేదు. సర్టిఫికెట్ కోసం వెళ్లిన ఒకతడికి ఆఫీసు పరిసరాల్లో చెట్ల కింద ఎదురుచూడాల్సి వచ్చింది. ఇలా అని వారినేదో తప్పు పడితే ఎట్లా? ఎండన పడి వచ్చారు కదా.. అలా చెట్ల కింద సేద తీరమని పార్కింగ్ స్థలంలో వెయిట్ చేయించారు. వారి దొడ్డ మనుసును అర్థం చేసుకోవాలి. అయితే, ఇక్కడొక విషయం ఏంటంటే.. సదరు వ్యక్తి మూడు రోజుల నుంచి చెట్లకిందే ఉన్నా సర్టిఫికెట్ అయితే చేతికి రాలేదు. బహుశా.. విశ్రాంతి అంటే ఓ వారమైనా పడుతుందని వారికున్న సొంత అలవాటు నుంచి భావించి ఉండవచ్చు.
ప్రభుత్వ అధికారులు కొందరు ఆఫీసుకు వచ్చేదే 12 గంటలకు. సరిగ్గా లంచ్ టైం ముందు వచ్చి, సహోద్యోగులకు నమస్తే పెట్టే లోపే లంచ్ టైం.. అది పూర్తయ్యే సరికి సాయంత్రం. చూశారా.. ఆఫీస్ టైం అయిపోతుంది. మరి ఇంత బిజీ షెడ్యూల్ లో వాళ్లెలా పని చేస్తారు చెప్పండి. అయినా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొనే ఒత్తిడి మామూలా..? మామూళ్ల కోసం వారు పడే శ్రమ అంతా ఇంతా కాదు. తీరా వస్తే, వారికి వీరికి వాటా ఇవ్వడం షరా మామూలే. ఆ చాలి చాలని మామూళ్లకు బయట జరిగే ప్రచారం.. అబ్బో వేరే లెవల్ ఉంటుంది. నెలాఖరుకు వచ్చే జీతం కంటే ఆ పైకం పైనే ఎక్కువ ఆశలు. పైగా చుట్టాలు, బంధువులు తలోమాట అంటుంటే పాపం, తల ఎక్కడ పెట్టుకోమంటారు? ఇంతటి ఒత్తిడిలో కాస్తంత ప్రశాంతత దొరికేది ఆ ఒక్క లంచ్ టైమే. అందుకే వారు టైంతీరా తింటారు.