నిర్దేశం, నిర్మల్ః తాను అత్యంత బీదరికమైన జీవితం నుంచి వచ్చానని, అలాంటి వారిని ఎప్పటికీ మర్చిపోనని, వారి కోసం ఏదైనా చేయాలనే తపనే తనను రాజకీయాలవైపుకు మళ్లించిందని డీఎస్పీ మధనం గంగాధర్ అన్నారు. పోలీసుగా 200 అవార్డులు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. పొలిటీషన్ గా మంచి పేరు సాధించడం, సమాజానికి మంచి సేవ చేయడమే పెద్ద అవార్డని, అదే తన ఆశయమని అన్నారు. ఆదివారం సిద్దిపేట, ఆర్మూర్ పట్టణల్లో వరుస పర్యటలు చేసి అనేకమందిని కలిశారు.
సోమవారం నిర్మల్ లో తమను రెగ్యూలరైజ్ చేయాలని నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం డీఎస్పీ గంగాధర్ కలిశారు. ఈ సందర్బంగా వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని, సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వారితోనే కలిసి నడుస్తానని హామీ ఇచ్చారు. “మీ వెనకాలైనా ఉంటా, ముందైనా ఉంటా.. అది మీ నిర్ణయం. కానీ, కచ్చితంగా ఉంటా. ఇది నేను తీసుకున్న నిర్ణయం. నా బాధ్యత కూడా. ఇక్కడికి రాజకీయం కోసం రాలేదు. సమస్య పరిష్కారం కోసం వచ్చాను” అని గంగాధర్ అన్నారు.
ఇక పోలీసులకు సమాజంలోని ఎలాంటి సమస్యలైనా అర్థం చేసుకోవడం, వాటికి పరిష్కారం వెతకడం బాగా తెలుస్తుందని గంగాధర్ అన్నారు. నిరసన సభలో ఆయన మాట్లాడుతూ “సమస్యల్ని అర్థం చేసుకోవడం పోలీసులకు బాగా తెలుసు. ఏ సమస్యపై నిరసన చేసినా, సంబంధిత అధికారులు రాకముందే పోలీసులు మాట్లాడి కన్విన్స్ చేసి, ధర్నా విరమింప చేస్తారు. అలాంటి రంగంలో 26 ఏళ్లు పని చేసి వచ్చాను. రాజకీయాల్లో ఆ అనుభవం చాలా ముఖ్యం. రాజకీయ నాయకుడిగా సమస్యల్ని అర్థం చేసుకోవడం పోలీసులకు బాగా తెలుసు. నా అనుభవం రాజకీయంగా చాలా ఉపయోగపడుతుంది” అని అన్నారు.