కృష్ణయ్య రాజీనామాకు చంద్రబాబే కారణం!

నిర్దేశం, హైద‌రాబాద్ః వైసీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ ఉద్య‌మ‌నేత ఆర్. కృష్ణయ్య రాజీనామాకు కారణం ఏమిటి? ఆయనకు జగన్ తో గొడవలొచ్చాయని, మనస్పర్థలు వచ్చాయని చెప్పడానికి దాఖలాలు లేవు. అలాంటి వార్తలు కూడా ఎప్పుడూ వచ్చినట్లు కనబడలేదు. తెలంగాణకు చెందిన కృష్ణయ్యకు జగన్ ఏరికోరి రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. పెద్దల సభకు పంపాలనుకుంటే తన పార్టీ వారే ఉన్నారు కదా. అందులోనూ బీసీలే కావాలనుకుంటే ఏపీలో బీసీ నాయకులే లేరా? కానీ కృష్ణయ్యకు బీసీ ఉద్యమ నాయకుడిగా గుర్తింపు ఉంది.

మొదటి నుంచి జగన్ బీసీలకు, ఇతర బలహీన వర్గాలకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పొరుగున ఉన్న తెలంగాణకు చెందిన కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేశాడు. కానీ బీసీల హక్కుల కోసం ఉద్యమం నడపాలనే పేరుతో ఆయన పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే రాజీనామా చేశాడు. ఇది జగన్ కు షాక్ అనే చెప్పాలి. ఆల్ రెడీ మోపిదేవి వెంకట రమణ అండ్ బీద మస్తాన్ రావు రిజైన్ చేశారు. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం ఎనిమిదికి పడిపోయింది.

కృష్ణయ్య అనుకుంటే ఎంపీగానే ఉంటూ బీసీల కోసం ఉద్యమం చేయొచ్చు. కానీ రాజీనామా చేశాడు. ఉద్యమం కోసమే రాజీనామా చేశానని ఆయన చెప్పడం సరైన కారణం కాదనిపిస్తోంది. బీసీ పార్టీ పెడతానని అన్నాడు. కానీ అది కేవలం ప్రతిపాదన దశలోనే ఉంది. వైసీపీ నాయకులు మాత్రం చంద్రబాబు వల్లనే కృష్ణయ్య రాజీనామా చేశాడని అంటున్నారు. అంటే చంద్రబాబే చేయించాడని చెబుతున్నారు. కృష్ణయ్యను బాబు కొనుగోలు చేశాడని చెబుతున్నారు.

ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. చంద్రబాబుకు కృష్ణయ్య కొత్త కాదు. ఒకప్పుడు టీడీపీ వ్యక్తే. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచాడు. అప్పట్లో టీడీపీ తరపున సీఎం అభ్యర్థిగా కూడా ప్రచారం జరిగింది. 2018 ఎన్నికల్లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన కృష్ణయ్య.. ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. అయితే బీసీ నేత కావడం, బీసీ హక్కుల కోసం పోరాడుతూ ఉండటంతో 2022 లో వైఎస్ జగన్.. ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చారు.

అయితే పదవీకాలం మరో నాలుగేళ్లు ఉండగానే ఆయన తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు ఆర్. కృష్ణయ్య తెలంగాణ బీజేపీలో చేరతారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన్ని బీజేపీలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆయనకు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ బీసీ ఓట్ల పైన ఫోకస్ పెట్టింది.

కృష్ణయ్య బీసీ పార్టీ పెడతానంటున్నాడు. పార్టీ పెడితే మాత్రం బీసీల ఓట్లు చీలిపోతాయి. దీని కారణంగా బీజేపీ నష్టపోతోంది. దాన్ని నిలువరించడానికే ఆయన్ని పార్టీలో చేర్చుకొని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలనే ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. దానివల్ల బీసీలు బీజేపీ వైపు మొగ్గుతారని ఆ పార్టీ నాయకుల భావన. కృష్ణయ్య జన్మదినం సందర్భంగా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారట. కృష్ణయ్య అల్లాటప్పాగా రాజీనామా చేసి ఉండడని అనిపిస్తోంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!