– రాజధాని కోసం ట్రిలియన్ డాలర్ల సాయం కావాలన్న
– సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు
– బాబు ప్రతిపాదనకు మోదీ ఓకే చెప్పినట్లు టాక్
నిర్దేశం, న్యూఢిల్లీ: అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్లు ఉంటుంది రాజకీయం. ఇంతకు ముందు ఎన్డీయేలో ఉన్నప్పటికీ, బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉండడంతో కిక్కురుమనకుండా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పుడు అవకాశం దొరికింది. అంతే, కేంద్రం నుంచి ముక్కు పిండీ మరీ నిధులు వసూలు చేసే పనిలో ఉన్నారు. తాజాగా ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్రం ముందు భారీ డిమాండ్లు ఉంచినట్టు సమాచారం. దీనిపై బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం ప్రచురించింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇది సంచలనంగా మారుతోంది.
ఈ నెలలోనే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అదే టైంలో ఏపీ కూడా బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రసాయం లేకపోతే గట్టెక్కించడం కష్టమని మొదటి నుంచి చెబుతున్న ఏపీ సీఎం అదే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఢిల్లీ టూర్‌లో ఇదే అంశంపై కేంద్రంతో చంద్రబాబు చర్చలు జరిపారని బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం ప్రచురించింది.
ఆ కథనంలో ఏముంది?
ట్రిలియన్ రూపాయలు కేంద్రం సాయం ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలదొక్కోవడం చాలా కష్టమని కేంద్రానికి చంద్రబాబు చెప్పారట. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంతోపాటు ఇతర కీలకమైన ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే భారీగా నిధులు అవసరమని ప్రధానమంత్రి మోదీకి చంద్రబాబు చెప్పినట్టు ఆ కథనం వెల్లడించింది. ప్రస్తుత మోదీ ప్రభుత్వానికి పెద్దగా మెజార్టీ లేదు. ఈ ప్రభుత్వం ఓవైపు నితీష్ కుమార్, మరోవైపు చంద్రబాబు మద్దతుపై ఆధారపడి ఉంది. అందుకే దీన్నే ఛాన్స్‌గా తీసుకుంటున్న రెండూ పార్టీలు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచుకునేందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారని టాక్.
ఇప్పటికే ప్రత్యేక హోదా డిమాండ్‌ను నితీష్ కుమార్ కేంద్రం ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కూడా నిధులపై పట్టుబడుతున్నారనే మాట గట్టిగా వినిపిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో మాట్లాడామని.. బహిరంగంగా మాట్లాడేందుకు అంగీకరించని ఆ వ్యక్తులు కీలక సమాచారం అందించినట్టు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. నితీశ్, చంద్రబాబు పెట్టిన ఈ డిమాండ్లకు ప్రధాని మోదీ అంగీకరించినట్లు సమాచారం.