– భారీ ఎత్తున రోడ్డపైకి ఎస్సీ-ఎస్టీ సమాజం
– ఎస్సీ, ఎస్టీలో భారీగా కనిపించిన ఐక్యత
– రిజర్వేషన్లలో జోక్యంపై దేశవ్యాప్తంగా భారీ నిరసన
– పలుచోట్ల నిరసన కారులపై లాఠీ చార్జ్
నిర్దేశం, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్, అలాగే వర్గీకరణకు సానుకూలంగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎస్సీ, ఎస్టీ సమాజం భగ్గుమంది. దీనిపై ఈరోజు (ఆగస్టు 21) దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన విజయవంతమైంది. జై భీం నినాదాలతో రోడ్లన్నీ నీలిమయమయ్యాయి. ఎక్కడ చూసినా నీలి జెండాల ప్రవాహమే కనిపించింది. బంద్ కు 20 రోజుల ముందే పిలుపునిచ్చారు. అయితే రెండు రోజల క్రీతం దీనికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించడంతో వేరే స్థాయికి వెళ్లింది.
దక్షిణాదిలో భారత్ బంద్ ప్రభావం అంత కనిపించలేదు కానీ, ఉత్తర భారతదేశం అయితే అట్టుడికి పోయింది. బీజేపీతో ఉన్న చిరాగ్ పాశ్వాన్, మహారాష్ట్ర నుంచి ప్రకాశ్ అంబేద్కర్, రాజస్థాన్ సామాజిక సేవా సంస్థలు భారత్ బంద్‌ను ప్రత్యేకంగా తీసుకున్నాయి. దళిత, గిరిజన వర్గాల్లోని అన్ని పార్టీలు, అన్ని సంఘాలు ఈ బంద్ లో కలిసి వచ్చాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. పెద్ద లీడర్లు రోడ్లపైకి వచ్చారు.
బీహార్ లో లాఠీ చార్జ్
భారత్ బంద్ నేపథ్యంలో పలు చోట్ల నిరసనకారులపై లాఠీ చార్జ్ జరిగింది. బిహార్ లో జరిగిన లాఠీ చార్జ్ వివాదాస్పదంగా మారింది. నిరసనకారులను పోలీసులు పరుగెత్తించి కొడుతున్న వీడియోలు నెట్టింట్లో షేర్ చేస్తూ దళిత, గిరిజన నేతలు భగ్గుమంటున్నారు. శాంతిపూర్వకంగా జరుగుతున్న నిరసనపై లాఠీ చార్జ్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక యూపీ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ స్వల్ప స్థాయిలో లాఠీ చార్జ్ జరిగింది.
మరోసారి ఏకతాటిపైకి ఎస్సీ, ఎస్టీలు
అనేక కులాలుగా విడిపోయిన సమాజాన్ని సామాజిక అంశాల ప్రాతిపదికన రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలుగా ఐక్యం చేశారు. అయితే చెప్పుకోవడానికి ఒకే పేరు అయినా, ఉప కులాలవారిగానే వారు విడిపోయి ఉన్నారు. బహుశా చరిత్ర మొత్తంలో వారు రెండు సందర్భాల్లో ఏకమయ్యారు. 2018లో ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం రద్దు చేస్తామన్నప్పుడు నాలుగు రోజుల పాటు దేశం దద్దరిల్లిపోయింది. మళ్లీ ఈరోజు ఎస్సీ, ఎస్టీ క్రీమిలేయర్, వర్గీకరణకు వ్యతిరేకంగా ఏకమయ్యారు.