ప్రజాపంథా కామ్రేడ్ యాదగిరి పోరు బాట..

యాదగిరి పోరు బాట..

–       సర్కార్ కొలువు వదలి విప్లవంలోకి..

–       కుటుంబమంతా ఉద్యమం లోనే.. 

–       ఎమర్జెన్సీలో తృటిలో చావు నుంచి తప్పించుకుని..

–       18 రోజుల వ్యవదిలోనే ఆ భార్య భర్తలు..

ఆయనకు మూడు  సర్కార్ కొలువులు స్వాగతం పలికాయి.. ఆ కొలువులలో జాబ్ చేస్తే రెండు చేతులా సంపాదించే అవకాశం. అయినా.. పేదల కష్టాలను చూసి స్పందించారు.. నేను.. నా కుటుంబం కంటే పేద ప్రజల జీవితమే ముఖ్యమనుకుని యాభై ఏళ్లు విప్లవోద్యమంలో పని చేసిన కామ్రేడ్ కర్నాటి యాదగిరి అమరుడయ్యారు. ఉద్యమ బాటలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని పోరు బాటలోనే పని చేస్తూ ప్రాణాలను వదిలిన యాదగిరి జీవితం నేటి యువతకు స్పూర్తిగా నిలుస్తోంది.


జీవిత ప్రస్థానం..

కర్నాటి యాదగిరిది..  ఉమ్మడి నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్. కర్నాటి రాములు, రామచంద్రమ్మ గార్ల ఐదుగురు సంతానంలో పెద్ద కుమారుడు యాదగిరి. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన సాంప్రదాయ కుటుంబానికి చెందిన అనసూయతో తన 17వ ఏట, (ఆమెకు 11 సం॥రాల వయస్సు) 1960లో బాల్య వివాహం జరిగింది. తన స్వగ్రామమైన సంస్థాన్ నారాయణపూర్ లోనే చదువుకున్నాడు.
మూడు సర్కార్ కొలువులే..
 కర్నాటి యాదగిరికి మూడు సర్కార్ కొలువులు స్వాగతం పలికాయి. మొదట ఉపాధ్యాయుడిగా  జాబ్ వచ్చినా చేరలేదు. ఆయనకు ఆ తరువాత ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో రెండేళ్లు పని చేశారు. ఆ తరువాత సాంఘీక సంక్షేమ శాఖ లో మంచి ఉద్యోగం యూడీసీ జాబ్ వచ్చింది. అతను పని చేసిన కాలంలో పేదల కష్టాలను చూసిన యాదగిరి ఆలోచనలో పడ్డారు.
ఆ ఇద్దరి పరిచయంతోనే..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పని చేస్తున్న యాదగిరికి పోస్టల్ డిపార్టుమెంట్ లో పని చేసే ఆరెట్టి నారాయణ, కార్మిక శాఖలో పని చేసే డి.వి. కృష్ణలతో పరిచయం జీవితంలో టర్నింగ్ పాయింట్. ఒకవైపు జాబ్ చేస్తునే ఆరెట్టి నారాయణ డి.వి. కృష్ణ లు జాతీయ, అంతర్జాతీయ విప్లవ రాజకీయాలపై గంటల తరబడి చర్చించడంతో యాదగిరి జీవితంలో మార్పు కనిపించింది. ఆ విప్లవ రాజకీయాల పట్ల ఆకర్శితులైన ఆయన సర్కార్ కొలువు గుడ్ బై చెప్పి పోరు బాట పట్టారు.
ఆజ్ఞాతంలోకి యాదగిరి అన్న..
ప్రభుత్వ ఉద్యోగి దాస్ ప్రొత్సహంతో నిజామాబాద్ జిల్లాలోయువజన సంఘాల నిర్మాణానికి, అంటరానితనానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా యాదగిరి పోరాటాలను నిర్మించాడు. 25. 6. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో తీవ్ర నిర్బంధకాండ కొనసాగింది. ఈ క్రమంలో పార్టీ నిర్ణయం మేరకు 4.7.1975న ఉద్యోగాన్ని వదిలి వేసి, రహస్య జీవితానికి వెళ్ళాడు యాదగిరి. అప్పటికే ఆయనకు సుధారాణి, సంధ్యారాణి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రహస్య జీవితంలోకి పోయేనాటికి యాదగిరి భార్య  అనసూయ నిండు గర్భిణీ. తాను రహాస్య జీవితంలోకి వెళ్ళిన తరువాత కుమారుడు భాస్కరస్వామి జన్మించాడు. ఏ ఆధారం లేదు. తీవ్ర నిర్బంధం. ఈ పరిస్థితులలో అనసూయక్క తన పిల్లలను తీసుకొని తన ఊరికి వెళ్ళింది. తను చిన్నప్పుడు కొద్దిగా నేర్చుకున్న కుటుంబ వృత్తి చేనేత మీద పనిచేస్తూ పొట్ట పోసుకున్నది. పిల్లలను సాకింది.

ఎమర్జెన్సీలో చావు నుంచి తప్పించుకుని..
ఎమర్జెన్సీ కాలంలో ఆజ్ఞాతంలో ఉన్న యాదగిరన్నను మలక్ పేటలోని రహస్య  స్థావరానికి రమ్మని పార్టీ కబురు పెట్టింది. తను వెళ్ళడం ఆలస్యమైంది. ఈలోపే ఆ డెన్ మీద పోలీసులు దాడి చేసి కా॥ రామనర్సయ్య, శ్రీపాద శ్రీహరి, జానకి రాంరెడ్డి, కుమార్ నారాయణలను పట్టుకొని బూటకపు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపింది ప్రభుత్వం. తాను ఆలస్యం కావడం వల్ల యాదగిరి ప్రాణాలతో మిగిలారు.
ప్రజా ఉద్యమాలలో యాదగిరి..
ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత కా॥ యాదగిరన్న కుటుంబం నిజామాబాద్ లోని కోటగల్లీలో కిరాయి ఇంట్లో వున్నారు. ఆరెట్టి నారాయణ, డీవీకే, దాసు గార్లతో కలిసి కోటగల్లి, పులాంగ్, పోచమ్మగల్లీ, అర్సపల్లి, శివాజీ నగర్ లో వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ యువజన సంఘాలను నిర్మాణం చేస్తూ, ఇళ్ళ స్థలాలకై పోరాటాలు నిర్వహించారు. అలానే జిల్లాలో గడ్కొల్, భీంగల్, డిచ్ పల్లి, బోధన్, ఆర్మూర్ ప్రాంతంలో అనేక రైతాంగ ఉద్యమాల నిర్మాణంలో పాల్గొన్నాడు. సీలింగు, అటవీ భూమి పంపకంలోనూ, నిజాంసాగర్ ఆయకట్టు సాగునీటి కోసం, సింగూరు ప్రాజెక్టు నీటిని రైతులకే ఇవ్వాలనీ జరిగిన ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండుపై సాగిన రైతాంగ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. పట్టణంలో బీడీ కార్మిక యూనియన్ ను నిర్మించడంలో, దానిని అభివృద్ధి చేసే కృషిలో భాగమయ్యారు.
నక్సల్స్ హిట్ లిస్ట్ లో యాదగిరి..
నిజామాబాద్ జిల్లాలో రైతాంగ పోరాటాలు చేస్తున్న సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరిని అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ నక్సల్స్ హిట్ లిస్ట్ లో పెట్టారు. జిల్లాలో విప్లవొద్యమంలో భాగంగా ప్రజాపంథాలో పుల్ టైమ్ వర్కర్ గా పని చేసే వారిని నక్సల్స్ హెచ్చరించారు. ఆర్మూర్ ప్రాంతంలో రైతు కూలీ సంఘం నాయకులు బి. దేవరాంపై  నక్సల్స్  కాల్పులు జరిపి యాదగిరికి హెచ్చరికలు పంపారు. అయినా.. యాదగిరి జిల్లాలో ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా ధైర్యంగా ముందుకు వెళ్లారు. వామ పక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొవడానికి, ఉద్యమాన్ని విస్తరించడానికై పార్టీ నాయకత్వంలో ప్రతాప్ పేరుతో సాయుద దళం ఏర్పాటు చేశారు.

 

18 రోజుల వ్యవదిలోనే ఆ భార్య భర్తలు..
50 ఏళ్లుగా ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజల హృదయాలలో నిలిచిన యాదగిరి అన్న 1 ఫిబ్రదరా2025న మరణించాడు. ఆయన కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో, అనారోగ్యంతో బాధపడుతూ వున్నాడు. తనకు ఉద్యమంలోనూ, జీవితంలోనూ వెన్నంటి వున్న ఆయన జీవిత సహచరి కామ్రేడ్ అనసూయ కూడా 13.1.2025న క్యాన్సర్ వ్యాధితో మరణించింది. ఆమె మరణించిన 18 రోజులలోనే కామ్రేడ్ యాదగిరన్న అమరుడైనాడు. కామ్రేడ్ యాదగిరన్న సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా దాదాపు 33 ఏండ్లుగా వున్నాడు. నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా నాలుగు దశాబ్దాలకు పైగా పని చేశారు. అలుపెరగని, చెక్కుచెదరని దృఢ విశ్వాసంతో, ప్రజాపంథా రాజకీయ అవగాహన వెనుక నిలబడ్డ ఆ కామ్రేడ్ అంకితభావ జీవితం ఎంతో ఆదర్శవంతమైనది.

విప్లవోద్యంలో కుటుంబం…
యాదగిరి – అనసూయ కుటుంబమంతా విప్లవోద్యమంలోనే పని చేస్తోంది. ఆయన పెద్ద కూతురు సుధారాణి గతంలో మహిళ సంఘంలో  పని చేసింది. సంధ్యారాణి ప్రగతి మహిళ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేస్తోంది. వీళ్లతో పాటు వాళ్ల భర్తలు శివరాజ్, అల్గోట్ రవీందర్ లు పీడీఎస్ యు లో పని చేసిన వారే.. ప్రస్తుతం యాదగిరి కుమారుడు భాష్కర్ స్వామి, చిన్న అల్లుడు అల్గోట్ రవీందర్ పౌరహక్కుల సంఘంలో కొనసాగుతున్నారు.
ఐదు దశాబ్ధాల కాలం పాటు విప్లవోద్యమంలో అలుపెరుగకుండా పని చేసిన కామ్రేడ్ యాదగిరి అన్న జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
కామ్రేడ్ యాదగిరి అన్న అమర్ హై…
–       యాటకర్ల మల్లేష్
Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »