ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం, అలాగే అతిగొప్ప రాజ్యాంగం కూడా మనదే. మన రాజ్యాంగాన్ని సరిగా అమలు చేస్తే భారతదేశం భూమి మీదుండే స్వర్గం అవుతుందని వివిధ దేశాల రాజ్యాంగ విశ్లేషకులు అన్నారు. కానీ, రాజ్యాంగాన్ని సరిగా అమలు చేసే దిక్కేలేదు. ఎంతసేపు రాజ్యాంగంలో ఏం లొసుగులు ఉన్నాయని వెతికి మరీ వాటిని వాడుకోవడమే కానీ, రాజ్యాంగంలోని మంచి ఏంటి? పాలకులుగా మనమేం చేయగలమే సోయి ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకుడికి లేకుండా పోయింది. రాజ్యాంగం అమలు పైన ఏ పార్టీకి శ్రద్ధలేదు కానీ, రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడంలో మాత్రం అన్ని పార్టీలు ఆరితేరిపోయాయి. రాజకీయ రాబందులుగా మారాయి. ఇంతటి సంకట స్థితిలో ఈరోజు (నవంబర్ 26) రాజ్యాంగ దినోత్సవం జరుగుతోంది. ఈరోజును కూడా తమ స్వలాభాల కోసమే వాడుకునే రాజకీయం నడుస్తోంది నేడు.
నిర్దేశం, హైదరాబాద్ః కొంత కాలంగా రాహుల్ గాంధీ సహా అనేక విపక్ష పార్టీలు రాజ్యాంగం పుస్తకాలు పట్టుకుని.. రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని గుడ్డలు ఊడిపోయేలా గుండెలు బాధుకుంటున్నారు. చిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ అధికారంలో ఉండగా భారతీయ జనతా పార్టీ కూడా రాజ్యాంగాన్ని కాపాడాలంటూ చెవులు చిల్లులు పడే మైకుల్లో ప్రచారం చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ అండ్ కో చేస్తున్న ప్రచారం కంటే కూడా ఎక్కువ హంగామానే జరిగింది. ఇక్కడ మీకో విషయం అర్థమై ఉండాలి. ఈ రెండు పార్టీలకు విపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే రాజ్యాంగం, విలువలు గుర్తొస్తాయి. రాజ్యాంగానికి పడిన 106 తూట్లే అందుకు పెద్ద ఉదహారణ.
రాజ్యాంగాన్ని వంచించడంలో స్థానిక పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు ఏమాత్రం తీసిపోలేదు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ మార్చే హక్కు పార్లమెంటుకు ఉండడం వల్ల ప్రత్యక్షంగా వీళ్లేమీ చేయలేకపోయారు కానీ, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పాలించడంలో కొన్నిసార్లు జాతీయ పార్టీలను మించిపోయాయి ప్రాంతీయ పార్టీలు. సెక్యూలర్, డెమొక్రటిక్, సోషల్.. ఇలా పలు రకాల పేర్లతో చలామణి అయ్యే పార్టీలు రాజ్యాంగంపై రాబందుల కంటే దారుణంగా దాడి చేసినవే. నిన్న రైట్ వింగ్ అయినా, నేడు లెఫ్ట్, సెంటర్ వింగులైనా రాజ్యాంగాన్ని కాపాడాలంటూ డిస్నీ కంటే ఎక్కువ గ్రాఫిక్స్ తో చిందులు తొక్కుతున్నారు కానీ, అమలు గురించి ఎవరూ మాట్లాడటం లేదు. వారికి ఇష్టం ఉండదు కూడా. గాయాలైన పేషెంటుని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించకుండా.. రోడ్డు మీద పడుకోబెట్టి ధర్నాలు చేసే దుర్మార్గలపు పార్టీలు ఇవన్నీ.
చట్టం అధికారానికి చుట్టం
చట్టం ఎవరికీ చుట్టం కాదంటారు. నిజానికి అది 101% తప్పు. చట్టం అధికారంలో ఉన్నవాడికి చుట్టం. వారికే కాదు, రాజకీయం చేయగలిగే ప్రతీ పార్టీకి చుట్టమే. అధికార వ్యవస్థలన్నింటినీ తమ వ్యక్తిగత అవసరాలను, ప్రజలు కట్టే పనుల్ని దోచుకోవడానికి వాడుకునేవారే అంతా. రాజకీయాన్ని మూసీ నది కంటే కూడా కలుషితం చేసి, పందుల్లా అందులో దొర్లుతున్నారు మన నాయకులు. పొరపాటున కొత్త నాయకుడో, కొత్త పార్టీనో కాస్తంత మంచి మనసుతో వస్తే.. ఈ పందులన్నీ కలిసి, ఆ కొత్త వారిని కలుషితం చేస్తున్నాయి. వినకపోతే, రాజకీయాల నుంచి మాయం చేస్తున్నాయి. తమ వ్యక్తిగత కక్షలు, తమ వ్యక్తిగత ఇమేజ్ లో ప్రజలను పడేసి, వాటి చుట్టే రాజకీయం, ఎన్నికలు, పాలన, వ్యవస్థలను తిప్పుతున్నారు. ఉదాహరణకి మన దేశంలో గాంధీ కుటుంబం. ఇక, ఏదో ఒక అంశం తీసుకుని, దాంట్లోకి ప్రజలను నెట్టేసి పబ్బం గడుపుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ చేస్తున్న హిందుత్వ రాజకీయం.
అధికారం వస్తే అందరూ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రజాస్వామ్యవాదే. అధికారం రాగానే నియంత అయిపోతారు. ఇది ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది. మమతా బెనర్జీ నుంచి స్టాలిన్ వరకు.. మోదీ నుంచి కేసీఆర్ వరకు.. ఎవరూ తక్కువ తినలేదు. అధికారం చేతికందగానే తామేదో ఆకాశం నుంచి ఊడిపడ్డ మీనవేషాలు చేస్తూనే ఉన్నారు. ఇది రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకం. పైగా వీళ్లంతా సమయం దొరికినప్పుడు రాజ్యాంగం మీద లెక్చర్లు ఇస్తుంటారనుకోండి. అది వేరే విషయం. ప్రభుత్వాల్ని కూల్చడం, ఎమ్మెల్యేలను కొనడం, గమర్నర్లను మార్చడం, ప్రభుత్వ సంస్థల్ని పావులుగా వాడుకోవడం, కోర్టులను కూడా తమకు అనుకూలంగా మలుచుకునే సందర్భాలు అనేకం. ఇవన్నీ నేడు బీజేపీ చేస్తోంది. గతంలో కాంగ్రెస్ చేసింది. మోదీ ప్రభుత్వంలో సుమారు 4 ప్రభుత్వాలు కూలాయి. కాంగ్రెస్ ఏకంగా 42 ప్రభుత్వాలను కూల్చింది. మరి వీళ్లు రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడటం ఎంతటి హాస్యం?
రక్షణ కాదు అమలు కావాలి
నిజానికి రాజ్యాంగం రక్షణ గురించి మాట్లాడటం కాదు. రాజ్యాంగం అమలు గురించి మాట్లాడాలి. రాజ్యాంగం వైలేషన్స్ ఎలా జరుగుతున్నాయో ఎత్తి చూపాలి. రాజ్యాంగం ఎంత వరకు అమలైంతదని స్టాటిక్స్ తీసుకోవాలి. ఊరికే.. పూజ గదిలో దేవుడి ఫొటోలాగ అరలో పెడితోనో, కాపీ పట్టుకుని కెమెరాల ముందు ఫోజులు కొడితేనో దేశంలో మార్పులు రావు కదా. బహుశా.. ఇప్పుడున్న పాలుకులెవరికీ అది ఇష్టం ఉండకపోవచ్చు. కానీ, ప్రజాస్వామ్యవాదులెవరైనా ఉంటే ముందు రాజ్యాంగ అమలుపై చర్చ ప్రారంభించడమే మొదటి కర్తవ్యం కావాలి.