నిర్దేశం, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో బీఆర్ఎస్ నేత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతుంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆయన వెనకాల నిలబడి నిక్కి నిక్కి చూస్తున్నారు. అవును.. రేవంత్ గతంలో టీఆర్ఎస్ లో ఉన్నారు. బహుశా ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ సమయంలో ఆయనకు అంత పాపులారిటీ లేకపోవడం, ఎక్కవ కాలం ఆ పార్టీలో లేకపోవడం వల్ల చాలా మందికి ఇది గుర్తు లేదు. కానీ, తాజాగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వల్ల మరోసారి గుర్తుకు వచ్చింది.
రాజకీయ నాయకులు పదవుల కోసమే కండువాలు మార్చడం, పొత్తులు పెట్టుకోవడం సర్వసాధారణం. రేవంత్ రెడ్డి కూడా అందుకే మారారు. అదేంటో కానీ, రాజకీయ నేతలంతా చేసే పని ఇదే కానీ, ఎదుటివారిని పదవుల కోసమే ఈ పని చేశావు, ఆ పని చేశావని అంటుంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు అందుకే పెట్టుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. అంతే, హరీష్ రావుకు కోపం వచ్చింది. పాత వీడియో బయటికి తీసి సోషల్ మీడియాలో వదిలారు. పదవుల కోసం పూటకో పార్టీ మారిన రేవంత్ రెడ్డికి.. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిదంటూ దుమ్మెత్తి పోశారు.