– నిరుద్యోగ నిరసనల్లో కనిపించని ప్రముఖులు
– కేసీఆర్ హయాంలో ముందు వరుసలో ఉన్నది వీరే
– కాంగ్రెస్ హయాంలో మౌనమెందుకు?
నిర్దేశం, హైదరాబాద్ః “అండాదండా ఉంటాడని కోదండరాముని నమ్ముకుంటే, గుండేలేని మనిషల్లే నిను కొండాకోనలకు ఒదిలేశాడా?”.. స్వాతిముత్యం సినిమాలోని పాట ఇది. నిరుద్యోగుల నిరసనల్లో తెలంగాణ జనసమితి పార్టీ చీఫ్ కోదండరాంను ఉద్దేశించి ఒక నిరుద్యోగి మళ్లీ పాడాడు. ప్రస్తుతం కోదండరాం పరిస్థితి ఇలాగే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారా, చెవులు మేపుతున్నారో తెలియదు కానీ, నిరుద్యోగుల సమ్మెలో ఆయన ఎక్కడా కనిపించడం లేదు, కనీసం వినిపించడమూ లేదు.
పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేసిన కోదండరాం ఇప్పుడు అలిసిపోయారా? లేదంటే విమర్శకులు అంటున్నట్లు తమ రెడ్డి ప్రభుత్వం వచ్చిందని సేద తీరుతున్నారా అనేది తెలియాలి. ఎందుకంటే, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ నిరసన జరిగినా కోదండరాం వెంటనే వాలిపోయేవారు. బొంగురు గొంతే అయినా, ఆయన ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ప్రశ్నలు వేస్తుంటే ఆనందంతో, ధైర్యంతో ప్రజలు చప్పట్లు కొట్టేవారు. ప్రజా సమస్యలకు పెద్దదిక్కుగా కోదండరాంను చూసేవారు. అధికారం చిక్కగానే కేసీఆర్ అహంకారం బయటికి వచ్చింది. కానీ కోదండరాం నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నారనే సానుభూతి ఉండేది. కానీ, నేడది అసత్యమని రుజువు అవుతున్నది. కేవలం కేసీఆర్ మీద కక్ష తప్ప మరేం కాదనేలా నేటి పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్ మీద కోపం చల్లారితే చల్లారుండొచ్చు గాక, కానీ నిరుద్యోగులకు అంత ఇబ్బంది పడుతుంటే పెద్ద గొంతుక మౌనం వహిస్తే, ఇంత కంటే ద్రోహం ఉండబోదు కూడా.
కేసీఆర్ ప్రభుత్వ విమర్శకుల్లో ఆకునూరి మురళిని ప్రముఖంగా చెప్పుకోవాలి. కేసీఆర్ మీద, గులాబీ పార్టీ మీద ఆకునూరి మాటలు తూటాల కంటే పదునుగా విరుచుకుపడేవి. అదేంటో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంపై తాటాకు చప్పుడు కూడా చేయడం లేదు. బాధితులు అదే ప్రజలు, సమస్య అదే.. ఒక్క ప్రభుత్వమే మారింది. అయితే, ఆకునూరి లాంటి తీరెందుకు మారిందనేది ఆలోచించదగ్గ విషయం. నిజానికి ఇది విమర్శించదగ్గ విషయం కూడానూ. ఈయన కోదంరాంలా రాజకీయ నాయకుడు కాదు. కేసీఆర్ తో మరీ వ్యక్తిగతంగా కోపాలు లేవు. కానీ, అప్పుడు ఆకునూరి చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం, పోరాడతాం అంటూ తొడలు కొట్టి, మీసాలు తిప్పిన ఆకునూరి.. ఇప్పటి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మహా నిరసనలపై పెదవి విరుపుకైనా మాట్లాడటం లేదు. ఇంతకు ముందు పదునుతో దూసిన కత్తి, ఇప్పుడెందుకు మొండిబడిపోయిందో ఆకునూరికే తెలియాలి. నిజానికి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులు కనిపించిన ఆయన.. కొంత కాలంగా ప్రజా జీవనంలోనే కనిపించడం మానేశారు. నమ్మి మోసపోయారా? లేదంటే, శ్రమించి అలసిపోయారా?
ఎక్కడ నిరసన జరిగినా ఎర్రెర్ర జెండాలతో ఎగిరెగిరి పడే ఎర్రన్నలు కూడా నేటి నిరుద్యోగ నిరసనల్లో కనిపించడం లేదు. ప్రతిసారి ప్రభుత్వాన్ని బాయ్ కాట్ చేసే లెఫ్టులు ఈసారి విద్యార్థులను, నిరుద్యోగులను బాయ్ కాట్ చేశారా? కాంగ్రెస్ పార్టీతో కొంత కాలంగా అంటకాగుతున్నందుకేమో.. పొత్తు ధర్మాన్ని పాటించి మాట లేవనెత్తడం లేదు. కామ్రెడ్లు అంటే రెడ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి కామ్ గా ఉన్నారని అనుకోవాలా? వీరితో పాటు తీన్మార్ మల్లన్న లాంటి యూట్యాబ్ ఛానళ్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. విపక్షాల కంటే కూడా ఎక్కువగా కేసీఆర్ ప్రభుత్వాన్ని బజార్లో నిలబెట్టి కడిగిపారేసింది యూట్యూబర్లే. తొలివెలుగు రఘులాంటి వారు నిరుద్యోగుల గురించి కవర్ చేస్తున్నప్పటికీ.. తీన్మార్ మల్లన్న ఛానల్ పూర్తిగా మారిపోయింది. పరీక్షకు లేటుగా రావడం నిరుద్యోగుల తప్పే, కనీసం బుద్దుండక్కర్లేదా అంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే తీన్మార్ మల్లన్న కడిగిపారేశారు. పైగా ఇప్పుడు అదే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ కూడానూ. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. గ్రాడ్యూయేట్ ఓట్లతో గెలిచారు మల్లన్న. ఇప్పుడదే గ్రాడ్యూయేట్లు నిరసన చేస్తున్నారు. టికెట్ ఇచ్చిన పార్టీవైపా, ఓట్లేసి గెలిపించిన నిరుద్యోగులు-విద్యార్థుల వైపా అంటే.. పాపం మల్లన్నకు కూడా కష్టమే కాబోలు.