– మళ్లీ ఆంధ్రా పెత్తనమని ప్రచారం చేస్తున్న గులాబీ పార్టీ
– ప్రతిసారి పావులా ఉపయోగపడుతున్న చంద్రబాబు
– కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ కు మరోసారి అవకాశం!
నిర్దేశం, హైదరాబాద్ః తెలంగాణలో మళ్లీ ఆంధ్రా చిచ్చు లేచేలా కనిపిస్తోంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రా-తెలంగాణ వాదం చాలా అనుకూలమైన అంశం. ఖర్చు లేని ప్రచారం, శ్రమ లేని లాభం. అందుకే చంద్రబాబు రీఎంట్రీని మళ్లీ ఆంధ్రా-తెలంగాణ మధ్య మళ్లీ సున్నిత అంశం చేసేందుకు విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. తెలంగాణపై మళ్లీ ఆంధ్రా పెత్తనం అంటూ దూకుడుగా ప్రచారం చేస్తోంది.
కలిసొచ్చిన చంద్రబాబు
ఆంధ్రా అనే మాటకు రాగానే గులాబీ పార్టీకి మొదట గుర్తొచ్చే పేరు చంద్రబాబు. అదేంటో.. చాలా మంది ఆంధ్రా నాయకులు హైదరాబాద్ లో ఉన్నారు. చాలా మంది ఆంధ్రా కళాకారులు, వ్యాపారులు తెలుగు నేలను ఏలుతున్నారు. కానీ, చంద్రబాబు బొమ్మ కనిపిస్తే చాలు తెలంగాణ వాదంతో ఒంటికాలిపై లేస్తుంది బీఆర్ఎస్. ఇందులో లాభం లేకపోలేదు. చంద్రబాబును కార్నర్ చేసిన ప్రతీసారి బీఆర్ఎస్ లాభపడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అయితే పూర్తిగా చంద్రబాబు చుట్టూనే తిరిగింది. మళ్లీ ఆంధ్రా పెత్తనం అంటూ కేసీఆర్ చేసిన ప్రచారం కారు పార్టీకి బంపర్ మెజారిటీని ఇచ్చింది.
రేవంత్ కామెంట్స్ అలాగే..
అన్నిసార్లు ఓపెన్ గా ఉండడం అంత ఆరోగ్యకరం కాకపోవచ్చు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో. చంద్రబాబు, రేవంత్ రేడ్డి రాజకీయ గురుశిష్యులు. కేసీర్ కూడా చంద్రబాబుకు శిష్యుడే. కానీ, ప్రాంతీయ పోరాటాల కారణంగా అనేక పొరపొచ్చలు వచ్చాయి. వైరం పెరిగింది. కానీ చంద్రబాబు-రేవంత్ మధ్య సానుకూల వాతావరణమే ఉంది. చిత్రంగా.. ఇరు నేతలు ఒకేసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కారణంగా వీరి మధ్య ఉన్న బంధం గురించి తరుచూ చర్చ జరిగింది. ఈ సందర్భంలో చంద్రబాబు గురించి, టీడీపీ గురించి రేవంత్ గొప్పగా చెప్తుండడం బీఆర్ఎస్ కు పావుగా మారుతోంది. ఆంధ్రా వ్యతిరేకతను తెలంగాణ ప్రజలు అంత సులువుగా మర్చిపోరు. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్పందించాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్ కు రేవంత్ సరైన కౌంటర్ వేయగలిగితే ఓకే.. లేదంటే, దీన్ని వాడుకుని మరోసారి తెలంగాణ అంశాన్ని వివాదం చేయడంలో గులాబీ పార్టీ ఎంత మాత్రం వెనుకాదు.