– తనతో పాటు నేతలు, అధికారులు బాబుతో పోటీ పడాలట
– రేవంత్ వ్యాఖ్యలతో భగ్గుమంటున్న తెలంగాణవాదులు
నిర్దేశం, హైదరాబాద్: తప్పకుండా ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రంతో పోటీ పడడంలో తప్పు లేదు. అలాగే ముఖ్యమంత్రుల మధ్య కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉండడమూ మంచిదే. కానీ, ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమ్మత్తు కామెంట్స్ చేశారు. చంద్రబాబుతో పోటీ పడి పని చేసే అవకాశం వచ్చిందని చెప్తూనే ఇక నుంచి రోజుకు 18 గంటలు పని చేయాలని అన్నారు. తానొక్కడే కాకుండా తెలంగాణ నేతలు, అధికారులంతా 18 గంటలు పని చేయాలని సెలవిచ్చారు.
రేవంత్ నిజంగానే రోజుకు 12 గంటలు పని చేస్తే సంతోషమే.. 18 గంటలు పని చేసినా కూడా ఆనందించే విషయమే. చంద్రబాబు రాజకీయ శిష్యుడైన ఆయన.. గురువతో పోటీ పడాలనుకోవడం మంచిదే. కానీ, తెలంగాణ నేతలను, అధికారులను చంద్రబాబు ముందు చిన్నతనం చేయడమే సరికాదు. తెలంగాణకు సంబంధించిన పని విధానం వేరే ఉంటుంది. ఆ కోణంలో ప్రభుత్వ యంత్రాంగం పనితీరును మెరుగు పర్చాలి కానీ, మిత్రులు పిలిచిన విందు భోజనానికి వెళ్లి తమ వారికి తక్కువ చేసి చూడడం అంటే మానిన గాయాన్ని మళ్లీ రేపడమే అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి చాలా వెనుకబడి ఉంది. మొత్తంగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. కొత్త ఆంధ్ర రాష్ట్రానికి మొదటి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రాజధాని రగడ కొనసాగుతూనే ఉంది. రాజధానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి భవనం కానీ, ప్రాజెక్టు కానీ ప్రారంభం కాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే. ఆంధ్రాతో పోలిస్తే చాలా విషయాల్లో ముందున్న తెలంగాణ.. ఆ రాష్ట్రంతో పోటీ అంటే విమర్శలే వస్తాయి. పైగా ఆంధ్రా వ్యతిరేకతతోనే ఏర్పడ్డ తెలంగాణకు ఆంధ్రాతో పోలికంటే తెలంగాణావాదులకు ఎంతమాత్రం గిట్టదు. చంద్రబాబుకు శిష్యుడైతే అయ్యుండొచ్చు కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే నెటిజెన్లు దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ఆమాత్రం చూసుకోకపోతే ఎట్లా?