రేవంత్ రెడ్డి అనే నేను..
ఈ పోస్ట్ పై చాలా మంది స్పందించారు. వాళ్లందరికి ధన్యవాదాలు.. ముఖ్యంగా ఒక జర్నలిస్ట్ మితృడు, నా శ్రేయోభిలాషి రాసిన లేఖ చదివిన వెంటనే ఈ మ్యాటర్ పోస్ట్ చేసి తప్పు చేశాను అనిపించింది. సో.. ఆ వెంటనే తొలగించాను. నా గురించి.. నా వ్యక్తిత్వం గురించి లేఖ రాసిన మితృడికి ప్రత్యేక ధన్యవాదాలు..
ఇక పోతే.. తప్పును తప్పుగా ఒప్పుకోవడంలో తప్పు లేదు.. సో.. ఆ మితృడు రాసిన లేఖతో కళ్లు తెరిచాను.. నిజాన్ని నిర్భయంగా రాసిన ఆ మితృడు ఎప్పుడు ఇలానే నాకు తెలియ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
సారీ తప్పు చేశాను.. లేఖ చూసిన తరువాత ఆ తప్పు తెలుసుకున్నాను. ఈ పోస్ట్ ద్వారా ఎవరైనా బాధ పడి ఉంటే క్షేమించగలరు..
– యాటకర్ల మల్లేష్, 939422 5111
మితృడి లేఖ..
నమస్తే మల్లేశ్ గారు, బాగున్నారా?
పొద్దున ఈ పోస్ట్ చూశాను. మీ ఆవేదన అర్థమవుతుంది. కానీ రాసిన అంశం, ఉద్దేశం సరికాదనిపించింది.
మీరు జర్నలిస్టుగా బతికారు. ఏదీ ఆశించకుండా ఉన్నందాతో బతికారు. మీ ఉద్వేగాలతో స్పందించారు గానీ ఏదీ ఆశించలేదన్నది మీ గురించి తెలిసినవాళ్లందరికీ తెలుస్తుంది.
అట్లాగే మీకు అనిపించింది, మీ అనుభవాన్ని రాయడం మీ అలవాటు. అట్లాగే రేవంత్ రెడ్డి గురించి రాశారు. దీన్ని పబ్లిష్ చేయడానికి మీకు తెలిసినవాళ్లను సహకారం కోసం అడగడంలో తప్పులేదు.
కానీ వాళ్లు స్పందించలేదనీ, పట్టించుకోలేదనీ, వీళ్ల తీరు ఇట్లా ఉంటుందని తప్పుబడుతున్నట్లుగా పబ్లిక్ వేదికపై రాయడం సరికాదనిపించింది. రేవంత్ రెడ్డి జీవిత కథ రాయడం, పబ్లిష్ చేయడం ప్రజల సమస్య కాదు. ప్రభుత్వ సమస్యో, ఆ పార్టీ సమస్యో కూడా కాదు. లేకుంటే ఆ వ్యక్తులు స్పందించకపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు.
అట్లాగే మీరు నేరుగా సీఎంను కలిసే ప్రయత్నం చేసినట్లుగా రాయలేదు. ఆ ప్రయత్నం చేయకుండా ఆయన్ను కలవడం ఇంత కష్టమా అనడం కూడా సరైంది కాదు.
ఒక రచయితగా, జర్నలిస్టుగా మీకు నచ్చింది, అనిపించింది రాసే స్వేచ్ఛ మీకు ఉంది. అట్లాగే ఇతరుల ఆసక్తులు, అవసరాలను బట్టి వాళ్లకూ స్వేచ్ఛ ఉంటుంది కదా. వాళ్లలో ఎవరైనా మీ పని, ఉద్దేశం నచ్చి మీకు సపోర్ట్ చేస్తే సంతోషించాల్సిందే. అభినందించాల్సిందే.
కానీ అట్లా చేయలేదని వాళ్లను తప్పుబట్టడం బాగోలేదు. ఇందులో వాళ్లను తప్పుబట్టడం కంటే మీ గౌరవాన్ని తగ్గించుకున్నారన్న సంకేతం పోయే ప్రమాదం ఉంది. వాళ్లు స్పందించలేదు కాబట్టి మీరు వేరే ప్రయత్నాలు చేయడమో, ఈ-బుక్ లాంటి ఇతర ఫార్మాల్లో పబ్లిష్ చేయడమో లాంటి ప్రత్యామ్నాయాలు చూడొచ్చు.
పబ్లిక్ సమస్యలు, అంశాలపై ప్రభుత్వం, పార్టీ, లీడర్లను ఎట్లయినా విమర్శించొచ్చు. కానీ ఇట్లాంటి అంశంపై పబ్లిక్ డొమైన్ లో రాయడం సరైన పద్ధతిగా అనిపించలేదు. బయటి నుంచి చూసేవాళ్లకు ఇది పూర్తిగా మీ వ్యక్తిగత అంశంగానే కనిపిస్తుంది. మీ గురించి నాకున్న మంచి అభిప్రాయంతో గౌరవంతోనే నాకు అనిపించింది చెప్పాను. వేరేలా అనుకోవద్దు. థాంక్యూ..
– ఆజ్ఞాత మితృడు