– కీలక సమయాల్లో పార్టీతో బీసీలు
– పదవులు, గౌరవాల్లో మాత్రం దూరం
నిర్దేశం, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీపై బీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తర్వాత బీసీలను అధ్యక్షులుగా పెడుతూ.. సరిగ్గా ఎన్నికల సమయంలో అగ్రవర్ణాలకు పార్టీ పగ్గాలు ఇవ్వడం ఏంటనే ప్రశ్న ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది. గతంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన లక్ష్మణ్, బండి సంజయ్ లు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డిని అధ్యక్షుడు చేశారు. ఇప్పుడు మళ్లీ బీసీ నేత ఈటల రాజేందర్ కు పగ్గాలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
విజయం బీసీలకు ఇవ్వొద్దనేనా?
వాస్తవానికి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండగా పార్టీలో మంచి ఊపు వచ్చింది. ముఖ్యంగా యువతలో జోరు పెరిగింది. ఆ క్రెడిట్ బీసీలకు రావొద్దనే కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇప్పుడు మరో బీసీ నేతను అధ్యక్షుడిగా నియమించబోతున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల గ్రామ స్థాయి వరకు ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి.
ప్రస్తుతం బీజేపీకి అతిపెద్ద ఓట్ బ్యాంక్ బీసీలు. బీసీల ఓట్ల ద్వారానే బీజేపీ దేశ వ్యాప్తంగా రాజకీయాలు సాగిస్తోంది. ఆ పార్టీ కూడా బీసీ కార్డు బాగానే వాడుతుంది. మరి పార్టీలోని పదవులు, అవకాశాలు వరకు వచ్చేసరికి ఏమవుతుందనేది అర్థం కాని సంగతి. తనను తాను బీసీనని చెప్పుకునే, పార్టీలో అతి శక్తివంతమైన నేతగా ఉన్న నరేంద్రమోదీ ఈ విషయంలో మార్పులు తీసుకువస్తారని అనుకున్నప్పటికీ, అది భ్రమేనని రుజువు అయింది.