- కూటమి గాలికి కొట్టుకుపోయిన ఫ్యాన్
క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి
ఏకంగా 164 సీట్లు కైవసం
దారుణ ఓటమి పాలైన అధికార వైసీపీ
ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు
నిర్దేశం, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీని ఈడ్చికొట్టిన ఓటర్లు.. ఈసారి వైసీపీని చావుదెబ్బ కొట్టారు. 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఆ కూటమిక ఏకంగా 164 సీట్లు సాధించింది. ఇక వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే.. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా అయినా దక్కలేదు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 సీట్లు రావాలి. కనీసం ఆ సీట్లను కూడా జగన్ పార్టీ గెలుచుకోలేకపోయింది.
విజయానికి కారణం కూటమి
టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి వల్లే ఇంతటి విజయం సాధ్యమైంది. వాస్తవానికి వైసీపీకి 39 శాతం ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు మాత్రం పది కూడా సాధించలేకపోయింది. చాలాచోట్ల జనసేన, బీజేపీ, టీడీపీ ఓట్లు కూటమి అభ్యర్థుల విజయానికి కలిసి వచ్చాయి. దీంతో వైసీపీ ఒంటరిదైపోయింది. కూటమి ఓట్లను వైసీపీ దాటలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కూటమి ముందు వైసీపీ నిలవలేకపోయింది.
మళ్లీ కింగ్ మేకర్ చంద్రబాబు
నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. కేంద్రంలో మరోసారి కీలకం కాబోతున్నారు. కేంద్రంలో బీజేపీకి అనుకున్న ఫలితాలు రాలేదు. ఎన్డీయేలో బీజేపీయేతర పక్షాల అవసరం చాలా పెరిగింది. అలాగే టీడీపీ 16 స్థానాలు గెలిచింది. దీంతో ఎన్డీయే కూటమిలో మరోసారి చంద్రబాబు కీలకం కాబోతున్నారు.
జనసేనకు ఎట్టకేలకు.. 10 ఏళ్లకు ప్రభంజనం
జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తైంది. మొదటి ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పేరుతో ఎన్నికలకు దూరంగా ఉండడం, 2019లో సరైన ఫలితాలు సాధించలేకపోవడంతో అప్పటి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటూ వస్తోన్న పవన్ కల్యాణ్.. ఎట్టకేలకు విజయ ఢంకా మోగించారు. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించడం విశేషం. అలాగే రెండు ఎంపీ స్థానాల్లోనూ జనసేన గెలుపొందింది.
వైసీపీని ఓడించిన 3 రాజధానులు
వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణం 3 రాజధానుల అంశమేనని ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రులకు రాజధాని అనేది పెద్ద సెంటిమెంటుగా మారింది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. తాత్కాలికంగా కొన్ని ప్రభుత్వ భవనాలు నిర్మించారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. మూడు రాజధానులు ప్రకటించడం.. వాటిపై కూడా సరైన క్లారిటీ లేకపోవడంతో ప్రజల సెంటిమెంట్ చాలా దెబ్బతిందని, అది ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిందని అంటున్నారు.