కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి
– కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల దూకుడు
– దిల్లీ మద్యం కేసులో కూతురు కవిత అరెస్టు
– ఫోన్ ట్యాపింగ్ విచారణ వేగవంతం
– కాళేశ్వరం పై విజిలెన్స్ విచారణ
– రోజురోజుకు పార్టీ బలహీనం
నిర్దేశం, హైదరాబాద్:
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒకేసారి సమస్యలు చుట్టుముట్టడంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దిల్లీ మద్యం కేసులో కూతురు కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడం, ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియస్ గా విచారణ జరగడం, కాళేశ్వరం, మిషన్ భగీరథ పనులపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కు అప్పగించడంతో ఏ కేసు ఎవరిమెడకు చుట్టుకుంటుందోననే ఆందోళన ఒకవైపు ఉండగా, మరోవైపు తాను స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలహీన పడడంతో ఏమి తోచని పరిస్థితి నెలకొంది.
ఒకవైపు కేంద్ర, మరోవైపు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్ ను లక్ష్యం చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. విచారణలో అవినీతి, అక్రమాలు బయట పడుతున్నాయి. దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం కేసీఆర్ కు పెద్ద షాక్ తగిలినట్లయింది. రాజకీయంగానూ నష్టం జరుగుతోంది. అన్నింటికి మించి కవిత అరెస్టుకు ప్రజల నుంచి సానుభూతి రాలేదు. అరెస్టును ఏ రాజకీయ పార్టీ ల నాయకులు ఖండించలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో దర్యాప్తు అధికారులు దూకుడు పెంచారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిందితుడు ప్రణీత్ రావు తెలిపినట్లు తెలిసింది. ఇది ముఖ్యనాయకుడితో పాటు మాజీ మంత్రి మెడకు చుట్టుకునే అవకాశముంది. కాళేశ్వరం, మిషన్ భగీరథలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. టెండర్ తర్వాత ఈ సంస్థ బీఆర్ఎస్ కు ఎలక్ట్రోరల్ బాండ్లు ఇచ్చింది. దీనిని బట్టి క్విడ్ ప్రోకో జరిగినట్లు అర్థమవుతోంది.
రోజురోజుకు పార్టీ బలహీనం
పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రతీ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లకు డిమాండ్ ఉండేది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో, 2009 లో తెలుగు దేశంతో పొత్తు ఉండేది. బీఆర్ఎస్ కు కేటాయించిన సీట్లలో ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డారు. ఆ తర్వాత 2014, 2018, 2023 ఎన్నికల్లో మరింత డిమాండ్ ఏర్పడింది. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారయింది. అధికారం కోల్పోయిన మూడు నెలల్లో పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎంపీలు కూడా పోటీ చేయకుండా పారిపోతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు జంప్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో బీఆర్ఎస్ తో పొత్తుకు ఇతర పార్టీలు ఆసక్తి చూపేవి. ప్రస్తుతం ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. బీఎస్పీ ముందుకొచ్చినా ఆ తర్వాత తెగతెంపులు చేసుకుంది. రాజకీయంగా ఒంటరి అయింది. గతంలో పార్టీ బలహీనమైన ప్రతీ సారి కేసీఆర్ బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించేవారు. అది కొంత కాలం పార్టీకి మైలేజీ వచ్చేది. ప్రస్తుతం ఆ అవకాశం కూడా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ కు లేవు. ఇతర పార్టీలకు బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పూర్వవైభవం రావడానికి కేసీఆర్ ఏం స్కెచ్ వేస్తారో వేచి చూడాల్సిందే.