కొత్త సంవత్సరంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకునే వారు ఆలస్యం చేయకుండా ఇప్పుడే కొనుగోలు చేసుకోవడం మేలు. లేదంటే జేబుకు చిల్లు తప్పదు. ముడి వస్తువుల ధరలు పెరగడం, పెరుగుతున్న రవాణా చార్జీల భారాన్ని మోయడం కష్టం కావడంతో ఎలక్ట్రానిక్ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపైకి నెట్టేయాలని నిర్ణయించాయి. దీంతో ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువుల ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఫలితంగా ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ వంటి వాటి ధరలు అమాంతం పెరగనున్నాయి.
కొన్ని కంపెనీలు ఇప్పటికే ధరలను ఏడు నుంచి పదిశాతం వరకు పెంచేశాయి. మిగతా కంపెనీలు కూడా అదే బాటన నడిచేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని కంపెనీలు ఈ నెలాఖరు నాటికి వాషింగ్ మెషీన్ల ధరలను 5-10 శాతం పెంచేందుకు రంగం సిద్ధం చేశాయి. ఈ నెలాఖరు నాటికి అది సాధ్యం కాకుంటే మార్చి నాటికైనా పెంపు తప్పదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలైన ఎల్జీ, పానసోనిక్, హయర్ వంటి కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచేసి వినియోగదారులపై భారం మోపాయి. దీంతో గోద్రెజ్, సోనీ, హిటాచీ వంటి కంపెనీలు కూడా ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నాయి. మరోవైపు, ఇప్పటికే కొన్నింటి ధరలు పెంచేసిన పానసోనిక్ ఏసీలతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెంచే యోచనలో ఉంది.
దిగుమతులు కట్టడి చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఇటీవల కొన్ని అల్యూమినియం విడిభాగాలు, రిఫ్రిజిరెంట్స్పై యాంటీ డంపింగ్ సుంకం విధించింది. దీని ప్రభావం ఉత్పత్తులపై పడుతోంది. పెరిగిన ఉత్పత్తి వ్యయం తలకు మించిన భారంగా మారడంతో ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయాలని యోచిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాల ధరలను పది శాతం వరకు పెంచక తప్పదని హిటాచీ ఎయిర్కండీషనింగ్ ఇండియా సీఎండీ గుర్మీత్ సింగ్ తెలిపారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్ల ధరలను 3 నుంచి 5 శాతం పెంచాలని నిర్ణయించినట్టు హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీశ్ ఎన్ఎస్ పేర్కొన్నారు.