– ఆస్తి తగాదాలతో రచ్చకెక్కిన జగన్, షర్మిల
– సూటిపోటి మాటలు, ఘాటు విమర్శలు
– రాజకీయ విబేధాలే కారణమని కొందరి వాదన
– ఇంత జరిగినా ఎంతమాత్రం నోరు విప్పని విజయమ్మ
నిర్దేశం, హైదరాబాద్: కుటుంబం అంటే ప్రేమ, ఆప్యాయతలే కాదు. ఆస్తులు, తన్నుకు చావడాలు కూడా ఉంటాయి. దాదాపుగా ఈ రెండూ లేని కుటుంబం ఉండదు. వైయస్ కుటుంబమైనా అంతే.. మొన్నటి వరకు కుటుంబ ఐక్యత, ప్రేమానురాగాలు కనిపించాయి. ఇప్పుడు అన్నా- చెల్లెల ఆస్తితగాదాలు తారా స్థాయికి చేరాయి. మామూలుగా ధనవంతుల మధ్య ఆస్తి గొడవలు అంటే కోర్టు మెట్లు ఎక్కడమో, కుటుంబంలోని పెద్దలు పరిష్కరించడమో ఉంటుంది. పొరపాటుగా అలా జరిగితే అది వైయస్ కుటుంబం ఎలా అవుతుంది? వైయస్ పౌరుషం, మొండితనం ఉన్న వారసులు కదా.. అందుకే దాన్ని రాజకీయాన్ని ఈడ్చి రచ్చ చేస్తున్నారు. చేసే వారు చేయకుండా.. మాటకు ముందు ఒకసారి వైయస్, తర్వాత ఒకసారి వైయస్ అంటున్నారు. బహుశా.. వాళ్ల నాన్న గురించి గొప్పగా చెప్పుకుంటున్నామనుకుంటున్నారేమో. కానీ, వాస్తవంలో ఉన్న పరువు పోతోంది.
రాజకీయ వైరుధ్యాలే కారణమా?
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి చాలా కాలం వరకు జగన్ వెంటే షర్మిల ఉన్నారు. జగన్ జైలుకు వెళ్లిన సందర్భంలో ఆమె చేపట్టిన పాదయాత్ర పార్టీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతలోనే ఏమయ్యిందో కానీ, ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. అంతే.. చెల్లి ఇంటిని కాదు, ఏకంగా రాష్ట్రాన్నే వదిలి మెట్టింటి(తెలంగాణ)కి వచ్చింది. నాలుగైదు ఏళ్లు ఎవరిమానాన వాళ్లే ఉన్నారు. ఇంతలో కాంగ్రెస్ తో కుదిరిన ఒప్పందంతో షర్మిల మళ్లీ పుట్టింటి(ఆంధ్రా)కి వెళ్లాల్సి వచ్చింది. కథ మొత్తం ఇక్కడే మలుపు తిరిగింది. అప్పటి వరకు సైలెంట్ గానే ఉన్న షర్మిల.. ఒక్కసారి జగన్ మీద యుద్ధం ప్రకటించింది. బాణాలు, బరిసెలతో దాడి చేయడం ప్రారంభించింది. జగన్ పెద్దగా పెదవి విప్పకపోయినప్పటికీ.. వైసీపీ నుంచి అదే స్థాయిలో షర్మిల మీద విరుచుకుపడుతూనే ఉంది. అక్కడ ప్రారంభమైన ప్రత్యక్ష యుద్ధం.. నేడు ఆస్తి పంపకాలతో పీక్స్ కు వెళ్లింది.
విజయమ్మది మౌనవ్రతమే
ఒక్క ఏపీనే కాదు.. ఇటు తెలంగాణ ప్రజలకు కూడా జగన్-షర్మిల ఎపిసోడ్ ని మిస్సవ్వకుండా తిలకిస్తున్నారు. కొడుకు, కూతురు ఇంతగా తగువులాడుకుంటున్నా విజయమ్మ మాత్రం ఒక్కమాటనైనా మాట్లాకపోవడమే విడ్డూరం. అటు కొడుకు పార్టీతోనూ ప్రయాణం చేసిన ఆమె.. ఇటు కూతురు రాజకీయాల్లోనూ పాలు పంచుకున్నారు. నిజానికి, తల్లికి ఎవరు ఎక్కువంటే ఏమని చెప్తాం. అది తేల్చుకోలేకే విజయమ్మ మౌనంగా ఉందని అంటున్నారు. ఉన్నమాట మాట్లాడుకోవాలంటే.. ఇప్పుడున్న పరిస్థితిలో విజయమ్మే కాదు, వైయస్ ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితే. తోబుట్టువుల మధ్య అంత వార్ నడుస్తోంది.
ఇద్దరూ తన్నుకుంటూ తండ్రి పరువు తీస్తున్నారు
కుటుంబానికి పరువు అనేది ఒకటి ఉంటుంది. కుటుంబంలోని ఏ ఇద్దరు కొట్టుకున్నా అది నలుగురిలో నవ్వుల పాటు అవుతుంది. వైయస్ కుటుంబానికి కూడా పరువనేది ఒకటి ఉంటుంది. అది వైయస్ ద్వారా వచ్చిన పరువు. ఆ పరువు పేరు కూడా వైయస్సే. అయితే, కన్నబిడ్డలు ఇద్దరు రచ్చకెక్కి ఆస్తులంటూ కొట్టుకుంటే.. ముందుగా నవ్వులపాలయ్యేది వైయస్ అనే పరువే. నిజానికి.. భారత రాజకీయాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. మొదటి వైయస్ కుమారుడు, కూతురు ఇలాంటి రికార్డ్ నెలకొల్పారు. ఇక్కడ చిత్రమేంటంటే.. ఇంతా చేస్తూ తాను వైయస్ బిడ్డనంటూ ఇద్దరు గొప్పలు పోవడమే సంభ్రమాశ్చర్యం.