రాములమ్మ @25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం

– సినీ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి
– రాఖీ కట్టిన చేతికి సస్పెండ్ లెటర్ ఇచ్చిన కేసీఆర్
– కాంగ్రెస్, బీజేపీల్లో రెండు సార్లు చేరినా లాభం లేదు

నిర్దేశం, హైదరాబాద్: కొద్ది రోజులుగా రాములమ్మ కానరావడం లేదు. రాజకీయాల నుంచి తప్పుకున్నారా? సినీ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి.. రాజకీయంగా సాధించిన అంత పెద్ద విజయాలేమీ లేము. సొంత పార్టీతో రాణించలేక కేసీఆర్ ను నమ్మి తన పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేస్తే నిర్దాక్షిణ్యమైన వెలివేత ఎదురైంది. రెండేసి మార్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరితే పదవులు లేకపోగా, రవ్వంత పేరైనా దక్కలేదు. పాతికేళ్ల రాజకీయంలో ఆరుసార్లు పార్టీ మారినా గెలిచింది ఒక్కసారే. ఇప్పటికి అదే చివరిసారి కూడాను.

సొంత పార్టీ అట్టర్ ప్లాప్
తమిళనాడులో జయలలిత తరహాలో రాజకీయాలు చేయబోయి బొక్కబోర్లా పడ్డారు విజయశాంతి. 2005 జనవరిలో ‘తల్లి తెలంగాణ’ పేరుతో పార్టీ పెట్టారు. అయితే చాలినంత సహకారం లభించక, మరొకవైపు కార్యకర్తల కొరత కూడా ఉండడంతో తన పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేశారు. నిజానికి తమిళనాడు రాజకీయాల్లో సిని ప్రముఖుల ఆధిపత్యం ఎక్కువ. పక్క రాష్ట్రమే అయినా మన తెలుగు రాజకీయాల్లో సినీ ప్రముఖుల జోక్యం అంతగా ఉండదు. చిరంజీవి, కృష్ణ లాంటి వారు చాలా మందే వచ్చినప్పటికీ ఒక్క ఎన్టీఆర్ మినహా ఎవరూ సక్సెస్ కాలేకపోయారు.

కేసీఆర్ తో తగాదా
నిజానికి బీఆర్ఎస్ పార్టీలో చేరాకే విజయశాంతి ఎంపీగా గెలిచారు. అప్పటికి ఆమె రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దం పూర్తైంది. తెలంగాణ గాలి జోరుగా వీస్తోన్న ఆ సమయంలో గులాబీ పార్టీ నుంచి కేసీఆర్ తో పాటు విజయశాంతి మాత్రమే ఎంపీలుగా గెలిచారు. మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నట్లుగా ఒకానొక పరిస్థితిలో గులాబీ పార్టీ పోటీ చేయడానికి భయపడే పరిస్థితుల్లో కేసీఆర్ తో సమానంగా విజయశాంతి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి విజయశాంతి గ్లామర్ చాలానే ఉపయోగపడింది. అయితే, 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటున్నారని ఆమెను టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారు. అంతకు ముందు ఆలె నరేంద్ర వంటి నేతలకు కేసీఆర్ ఎలాంటి సన్మానం చేశారో తెలియంది కాదు. అన్న అని నమ్మి రాఖీ కట్టిన విజయశాంతికి కట్నంగా సస్పెండ్ లెటర్ ఇచ్చేంత గట్స్ ఒక్క కేసీఆర్ కు మాత్రమే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

రెండేసి సార్లు బీజేపీ, కాంగ్రెస్ లోకి
విజయశాంతి రాజకీయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో రెండు రెండు సార్లు చేరారు. 1999లో బీజేపీతో రాజకీయ ప్రవేశం చేసిన ఆమె.. మళ్లీ 2020లో బీజేపీలో చేరారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కూడా.. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక ఒకసారి, బీజేపీ నుంచి బయటికి వచ్చాక ఒకసారి చేరారు. కానీ ఈ రెండు జాతీయ పార్టీల నుంచి ఆమె రాష్ట్ర స్థాయి ప్రయోజనం కూడా పొందకపోవడం గమనార్హం. బీజేపీలో జాతీయ మహిళా మోర్చాకు కార్యదర్శి, కాంగ్రెస్ లో తెలంగాణ రాష్ట్రానికి స్టార్ క్యాంపెయినర్ అయినప్పటికీ చట్ట సభ మాత్రం దూరపు చుట్టంలాగే మిగిలింది.

విజయశాంతి రెండోసారి జాయిన్ కాకుండా వదిలేసిన బీఆర్ఎస్ లోకి వెళ్లి ఆ లోటును భర్తీ చేయనున్నట్లు నిన్నీమధ్య వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ అంతమవుతుందని బీజేపీ నేతలు అంతే గులాబీ నేతలకంటే ఎక్కువ ఆగ్రహం విజయశాంతి వ్యక్తపరిచారు. తెలంగాణకు సొంత పార్టీ ఉండొద్దా అంటూ నిప్పులు చెరిగారు. సరే.. రాబోయే రోజుల్లో విజయశాంతి ఏం చేయబోతున్నారనేది కాలమే నిర్ణయిస్తుంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!